Breaking News

Loading..

'పైసా లేనిదే ఫైలు కదలని వైనం' ప్రతి చిన్న పనికి ఆశ, అంతకుమించిన కాలయాపన.

ఖమ్మం, అగస్ 15, బిసిఎం10 న్యూస్.

ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వంలో కొందరి అధికారుల ఇష్టారాజ్యం మితిమీరిపోతుంది. జిల్లా లో వారి అవినీతి బాగోతం రోజు రోజుకు చర్చనీయాంశం అవుతుంది. ప్రతి చిన్న పనికి పైసా లేనిదే ఫైలు కదలని దుస్థితి నెలకొంది. పైసా ఇవ్వని పనులను వివిధ కారణాలతో కార్యాలయాల చుట్టూ తిప్పుతూ కాలయాపన చేస్తున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి దరికి తెచ్చుకుంటున్నారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు రోజువారి, నెలవారీ టార్గెట్లను పెట్టుకుని ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ అక్రమ సంపాదనకు ఒడిగడుతున్నారన్న అపవాద నెలకొంది. అధికారులకు ఉన్న అధికారాలను అడ్డం పెట్టుకొని చట్టంలోని లొసగులను ఆసరాగా చేసుకుని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారయింది.

● ప్రజల బాధ వర్ణనాతీతం.

నిస్వార్ధంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు ప్రతి చిన్న పనికి పైసలు ఆశిస్తూ ఉండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావం ఏర్పడుతుంది. నెల నెల వేలల్లో, లక్షల్లో జీతాలు వస్తున్నప్పటికి సామాన్యుల నుంచి డబ్బులు ఎందుకు ఆశిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు అమాయక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో, మండల స్థాయిలో అధికారులను మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి పనిని కొందరు ఆర్థిక కోణంలోనే చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైసలు ఇవ్వని వారి పనిని వారం, నెలలు, సంవత్సరాల తరబడి కూడా తిప్పుతున్నారని పలువురు వాపోతున్నారు. కొంతమంది అధికారులు పైరవీకారుల ద్వారా పనులు చక్కబెడుతున్నట్లు సమాచారం. మరికొంతమంది మాత్రం అప్పటికప్పుడు పైసలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారని, వారి పని క్షణాల్లో జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అవినీతి బాగోతాల పై ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ అధికారుల అవినీతిని ఎండగట్టిన విషయం పాఠకులకు విధితమే. 

● ప్రజా ప్రభుత్వానికి పెను సవాల్.

ఒకపక్క కాంగ్రెస్ సర్కార్ తమది ప్రజా ప్రభుత్వమని చెబుతున్నప్పటికి, ఆచరణలో ప్రజలకు అందనంత దూరాన ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా ప్రభుత్వమంటే అధికారుల ద్వారా ప్రజలకు పాలనలో, సేవలలో చేరువ కావాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా న్యాయంగా నిజాయితీగా తమ బాధ్యతలను నెరవేల్చాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులు, అమాయక ప్రజలను, రైతన్నలను ముప్పు తిప్పలు పెడుతున్నారన్న చర్చ 'టాక్' ఆఫ్ ది జిల్లా గా మారిపోయింది. నిజాయితీగా ఇటు ప్రజలకు సేవలు అందించడంలోనూ, అటు ప్రజా ప్రభుత్వానికి జవాబుదారి తనంగా ఉండడంలోనూ కొంతమంది అధికారులు విఫలమవుతున్నారన్న   వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఓట్ల రాజకీయాల కోసం ప్రభుత్వం కూడా అధికారుల వ్యవహార శైలిని చూసి చూడనట్లుగా లైట్ తీసుకుంటున్నాయన్న ఆరోపణలు ఊపొందుకుంటున్నాయి. అధికారులు తలుచుకుంటే   ప్రభుత్వాలను కూలదోస్తాయన్న బహిరంగ హెచ్చరికలు కూడా ప్రజా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయేమో తెలియని పరిస్థితి నెలకొంది.

● ప్రజల తీరు మారాలి ప్రశ్నించే ధోరణి అలవర్చుకోవాలి.

ప్రభుత్వ కార్యాలయంలో ఉచితంగా సేవలు పొందే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. ఆ సేవను డబ్బుతో కొనాలనే ఆలోచనను విడనాడాలి. ఏ పని ఏ అధికారితో అవుతుందో అన్న స్పష్టతను కలిగి ఉండాలి. అధికారుల మీద మీద పడి పని చేయించుకునే బదులు ప్రతి ఒక్కరు ప్రశ్నించే వైఖరి అవలంబించుకోవాలి. సంబంధిత శాఖల అధికారులు పనిచేయకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేసే ధోరణి ఉండాలి. కాలయాపన చేస్తూ ఉంటే, కాలయాపన ఎందుకు జరుగుతుందో లిఖితపూర్వకంగా అధికారుల చేత రాయించుకోవాలి. డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తే అవసరమైతే ఏసిబి అధికారులను ఆశ్రయించాలి. ప్రజా సేవ కోసం విధులను నిబద్దతతో నిర్వర్తించే అధికారులు అసలు విషయాన్నీ మర్చిపోకూడదు. కొందరు అధికారులైతే ఏకంగా చట్టంలో ఉన్న లొసగులను ఆసరాగా చేసుకుని, అధికారులకు ఉన్న అనుకూలతలను ఉపయోగించుకొని కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారంటే పరిస్థితిని మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనాప్పటికీ ప్రజా పాలనలో అధికారుల వ్యవహార శైలిలో ప్రజల్లో సానుకూలమైన మార్పు వచ్చినప్పుడే గాంధీజీ కలలుగన్న స్వాతంత్రం ప్రతిఫలాలు సిద్ధిస్తాయని ఆశిద్దాం.

Post a Comment

0 Comments