బిసిఎం10 న్యూస్ ఆగస్టు 31 భద్రాచలం : గిరిజన మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు, హింస, అత్యాచార ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టాలనీ–తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాచలం పట్టణ కార్యదర్శి కుంజ శ్రీను ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి కొప్పుల రవీందర్ మాట్లాడుతూ ఊకె శిరీషపై జరిగిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శిరీషపై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, సమగ్ర దర్యాప్తు నిర్వహించి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.గిరిజన ప్రాంతాల్లో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోతున్న పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. గిరిజన బిడ్డలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, వారి భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని దారుణ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా ఉద్యమిస్తున్న ఆదివాసులపై అత్యాచారం చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. గిరిజన మహిళలు, బాలికలపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం అందించడంతో పాటు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.ఊకె శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని, గిరిజన బిడ్డల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ–టిఏజిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0 Comments