బిసిఎం10 న్యూస్ ఆగస్టు 31 హైదరాబాద్ : భద్రాచలం ప్రాంత ప్రజలకు న్యాయం మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ హైకోర్టులో గౌరవ న్యాయమూర్తులకు వినతిపత్రం సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జె. శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీమపాక నగేష్, జస్టిస్ ఖాజా శరత్‌లను కలిసి ఈ వినతిపత్రాన్ని అందజేశారు. భద్రాచలం, మణుగూరు పోలీస్ సబ్-డివిజన్లకు సంబంధించిన 600కు పైగా సెషన్స్ ట్రయల్ కేసులు వివిధ సెషన్స్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, విచారణల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల న్యాయవాదులు, కక్షిదారులు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు లేదా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని, ప్రత్యామ్నాయంగా సెషన్స్ కోర్టును భద్రాచలంలో ఏర్పాటు చేసి భద్రాచలాన్ని ప్రధాన కేంద్రంగా గుర్తించాలని కోరారు. అలాగే కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, న్యాయవాదుల హాలులో ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి, పరిశుభ్రమైన క్యాంటీన్, జిరాక్స్ సెంటర్ తదితర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం ప్రాంత ఆధ్యాత్మిక, చారిత్రక, భౌగోళిక, గిరిజన ప్రాధాన్యతతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1), ఐదవ షెడ్యూల్ పరిధిలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, హైకోర్టు న్యాయవాదులు పీవీ కృష్ణమాచారి, ఏజీపీ జట్టి సాల్మన్ రాజు, సీనియర్ న్యాయవాది పోకల మోహన్ కృష్ణ, ముత్యాల ప్రవీణ్, బి. రామకృష్ణ, వలవల సురేష్ కుమార్, ఏ. రజని, దన్నాన తరుణ్ నాయుడు, హైమావతి, హైకోర్టు మాజీ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్, మాజీ జీపీ నల్లమోతు రాము తదితరులు పాల్గొన్నారు.

0 Comments