- 3 రాష్ట్రాల సరిహద్దు పేద రోగులకు పెద్దదిక్కు ఈ ఆసుపత్రి...
- పేదల పెద్ద దిక్కుకే దిక్కు లేకపోతే ఎలా...?
- అందరూ ఇక్కడే ఉంటారు... నిర్లక్ష్యమో, అలసత్వమో అర్థం కాదు...
- సార్లు... పాయకనాకైనా ప్రశాంతంగా పోనివ్వండి..
పేదలంటే ఇంత నిర్లక్ష్యమా?
ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత వంటి సమస్యలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు, కనీస వసతులు కూడా సక్రమంగా లేకపోవడం మరింత ఆవేదన కలిగిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మరుగుదొడ్లను ఉపయోగించాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“ఇదే పరిస్థితిలో పెద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులను మరుగుదొడ్లకు పంపగలరా? ఒక్కసారి వారు స్వయంగా ఈ పరిస్థితిని పరిశీలిస్తే సమస్య తీవ్రత అర్థమవుతుంది. పేదలంటే ఇంత అలుసా?” అంటూ పలువురు రోగులు ప్రశ్నిస్తున్నారు
పర్యవేక్షణ ఎక్కడ?
ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక పర్యవేక్షణ లోపమే కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భద్రాచలం ఎమ్మెల్యే స్వయంగా వైద్య వృత్తికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు సక్రమంగా లేకపోవడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించాలి..
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మరుగుదొడ్ల పరిస్థితిని తక్షణమే పరిశీలించాలని రోగులు కోరుతున్నారు. అవసరమైన మరమ్మతులు చేపట్టి తలుపులు, గొళ్లాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రి ప్రాంగణం, మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అలాగే పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లు లేదా బాధ్యులపై చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.



0 Comments