Breaking News

Loading..

నల్లబజారులో యూరియా దందా..పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు.


బూర్గంపాడు ఆగస్టు 08 బిసిఎం10 న్యూస్ : ఒకవైపు వర్షాలు అనుకూలించి సాగు పనులు వేగం పుంజుకుంటుంటే, మరోవైపు ఎరువుల కొరత రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో యూరియా నల్లబజారు దందా పడగవిప్పింది. పంటకు సమయానికి యూరియా వేయకలేక లోకల్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఎరువుల వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టించి అక్రమ సంపాదనలో మునిగితేలుతున్నారు.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా బస్తా నిర్ణీత ధర సుమారు ₹260 ఉండగా, బ్లాక్ మార్కెట్లో మాత్రం దానిని ₹350 నుండి ₹360 వరకు బహిరంగంగానే విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రశ్నిస్తే "స్టాక్ లేదు, కావాలంటే ఈ ధరకే తీసుకోండి" అని వ్యాపారులు తెగేసి చెబుతుండటంతో చేసేదేమీ లేక రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు.


స్థానిక రైతులకు దక్కని ఎరువులు


బూర్గంపాడు మండలంలోని స్థానిక రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన సొసైటీలు, ప్రైవేటు దుకాణాల్లో "స్టాక్ నిల్వలు లేవు" అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. కానీ, అదే సమయంలో నల్లబజారులో మాత్రం ఎంత డబ్బు పెడితే అంత యూరియా లభిస్తుండటం గమనార్హం. పక్క మండలాల నుంచి వచ్చే రైతులకు సైతం ఇక్కడ అధిక ధరలకు ఎరువులు లభిస్తున్నాయి

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవసాయ శాఖ : 

పక్కా ప్రణాళికతో జరుగుతున్న ఈ నల్లబజారు దందాపై అధికారులు మాత్రం కన్నుమూసి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లోనే నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తున్నా, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారుల అలసత్వమే వ్యాపారులకు చుట్టరికంగా మారిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

రైతాంగం డిమాండ్ : 

పంటల దిగుబడిపై ప్రభావం పడకముందే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బూర్గంపాడు మండలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నల్లబజారుకు తెరదించి, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు సరిపడా యూరియాను మద్దతు ధరకే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments