భద్రాచలంలో భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. గోదావరి నీటిమట్టం పెరిగిన నేపథ్యంలో స్లూయిజ్ ద్వారా బ్యాక్‌వాటర్, డ్రైనేజ్ నీటిని గోదావరిలోకి పంపించే బాహుబలి మోటార్లు నిన్నటి నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒకే మోటార్ పరిమిత స్థాయిలో పనిచేస్తోందని సమాచారం.
దీంతో రామాలయం అన్నదాన సత్రం ముందు వరకు డ్రైనేజ్ నీరు చేరుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో భారీ వర్షం కురిస్తే నీరు మరింత నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మోటార్ల నిర్వహణలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించిందా? లేక సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఇబ్బందులు పడేది ప్రజలేనని స్థానికులు పేర్కొంటున్నారు.వర్షాలు మరింత ఉధృతం కాకముందే సంబంధిత అధికారులు స్పందించి అన్ని మోటార్లను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



0 Comments