- పెండింగ్‌లో ఉన్న రూ.10,840 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
- ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీ, పుస్తకాల దందాను అరికట్టాలి
బిసీఎం 10 న్యూస్ ఆగస్టు 11 భద్రాచలం : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 13వ తేదీన నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన రూ.10,840 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల చదువులు, తదుపరి విద్యా అవకాశాలపై ప్రభావం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారాన్ని మోపుతున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించి, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.పుస్తకాల పేరుతో జరుగుతున్న దందాను అరికట్టాలని అన్నారు. విద్యార్థులను పుస్తకాలు, నోట్‌బుక్స్,తమ దగ్గర కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం ద్వారా తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారని తెలిపారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలల యాజమాన్యాలు నిలిపివేయకుండా, విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను వెంటనే అందించేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని అన్నారు.ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ 13వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని కొప్పుల రవీందర్ తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిరణ్, పవన్ కుమార్,నరేష్, భార్గవ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

0 Comments