హైదరాబాద్, సెప్టెంబర్ 26, బిసిఎం10 న్యూస్.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్లా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేసింది. ఇక, హైదరాబాద్ మహా నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సిటీ వ్యాప్తంగా 48 గంటల పాటు వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వరద పరిస్థితులను, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. అవసరమైతే వరద ప్రభావిత ప్రాంత ప్రజలను క్యాంప్స్‌కు తరలించాలన్నారు. కరెంట్ కోతలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేలా కిందకు వేలాడుతున్న తీగల్ని తొలగించాలన్నారు. హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్స్ హై అలర్ట్‌లో ఉండాలని స్పష్టం చేశారు.

0 Comments