Breaking News

Loading..

మావోయిజం ఒక 'రాజ్యాంగేతర శక్తి'..!!


ఖమ్మం, నవంబర్ 23, బిసిఎం10 న్యూస్.

ఒక రాజ్యాంగం, ప్రజలు, చట్టబద్ధ వ్యవస్థ, ప్రజాస్వామ్యం చేయాల్సిన పనులు కొన్ని 'మావోయిస్ట్'లు చేసి చూపారు. అడవుల్లో ఉంటూ దశాబ్దాలుగా అడవులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అడవులను కార్పొరేట్ శక్తుల పరం కాకుండా అడవులను గుండెలకు హత్తుకున్నారు. ఆదివాసుల హక్కులకు తమ ప్రాణాలను అడ్డుపెట్టారు, సహజ వనరుల విధ్వంసానికి అడుగడుగునా అడ్డు తలిగారు. దేశం లోపల ముఖ్యంగా అడవి లోపల ప్రజల మానప్రాణాలకు రక్షణగా తామున్నామని బాసటగా నిలిచారు. అణిచివేతలకు, అన్యాయాలకు, అక్రమాలకు, ఎదురొడ్డి పోరాడిన సందర్భాలేన్నొ. దశాబ్దాలుగా ఏకైక ధిక్కారస్వరంగా దేశం నలుదిక్కులా వినిపించారు. ఈ విప్లవ పంథా ప్రజల జీవన వికాసానికి ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది. కాకపోతే ప్రజల హృదయాలను కొన్ని ఏళ్ల పాటు ఏకధాటిగా ఏలారు అసలైన ప్రజాపాలన అడవి ప్రజలకు రుచి చూపారు. ఇటు పోలీసులు, ప్రభుత్వ బలగాలు రాజ్యాంగాన్ని పరిరక్షించేవాళ్లు పైగా చట్టబద్ధంగా ఎంపిక ఐనవాళ్లు. వీళ్ళు చేసే పనులన్నీ చట్టబద్ధమా..?? వీళ్ళు పౌరులకు రక్షణ కల్పిస్తున్నారా, పాలక వ్యవస్థలకు తొత్తులుగా పనిచేస్తున్నారా..?? 

నిజానికి మన దేశ రక్షణ వ్యవస్థ అంతర్గత దేశద్రోహులను పెంచి పోషిస్తుంది వారికి కాపలాగా ఉంటుంది. ఒక అవినీతిపరుడికి, ఒక అక్రమార్గుడికి, ఒక భూకబ్జాదారుడికి, ఒక బ్యాంకు రుణం ఎగవేత దారుడికి వొంత పాడి, ఒక బడా రాజకీయ నాయకుడికి అండగా నిలిచి, వారి చెప్పుచేతుల్లో బతికే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలకు ఏం చేస్తుంది, ఎలాంటి సందేశం ఇస్తున్నది అన్నది అసలైన ప్రశ్న..?? ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు మావోయిస్టుల రూపంలో ప్రజలకు కనపడ్డాయి, వినపడ్డాయి. అందుకే రాజ్యాంగేతర శక్తులైన మావోయిస్టులు అంటే ప్రజలకు అభిమానం. ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్న 'హిడ్మా' పేరు మార్మోగుతుంది. వాస్తవానికి హిడ్మా చేసింది రవ్వంత, రవ్వంత కూడా కొండంతగా మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఆ రవ్వంత చేసే వాళ్ళు కూడా లేరు. కొందరు హిడ్మా పెద్దగా చదువు కోలేదు అని విమర్శిస్తున్నారు అయితే ఉన్నత విద్య అభ్యసించకపోయినా, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఉన్నత విలువలతో, ఉన్నత వ్యక్తిత్వంతో తనను నమ్ముకున్న తన అడవి కోసం, అడవి ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడాడు, ఇప్పుడు హిడ్మానే ఒక చరిత్ర అయిపోయాడు. బాగా చదువుకున్న మనం సమాజం నడి మధ్యలో బతుకుతూ ఏ మాత్రం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నామో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. హిడ్మా పెద్దగా చదువుకోకపోయినా హిడ్మా గురించే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, భావితరాలు చదువుకోబోతున్నాయి. ఎందుకంటే అతనిది ఒక వీరోచిత పోరాటం. హిడ్మాను వీరుడు అనడం కూడా తక్కువే ఎందుకంటే అడవి జనం అతన్ని దేవుడు అంటున్నారు.

ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆయుధాలు పట్టుకుని అడవుల్లో ఉంటూ దోపిడీకి వ్యతిరేకంగా మావోయిస్టులు చేసిన మంచి పనులే కాకుండా (కొన్ని దుర్మార్గాలు కూడా లేకపోలేవు). వాళ్ల శత్రువు పోలీసు వ్యవస్థనే అయిపోయింది తప్ప ఈ దోపిడీ వ్యవస్థ మన శత్రువు అనే మార్గం నుండి కొంచెం మావోయిస్టులు దారి తప్పారు, చివరి వరకు అదే పరంపరను కొనసాగించారు. ఇక్కడ మావోయిస్టులు క్షమార్హులు కాదు, మావోయిస్టులు అవినీతిపరులైన నాయకులను చంపినప్పుడు సాధారణ ప్రజలు కూడా హర్షించారు. కానీ పోలీసులను పొట్టన పెట్టుకున్నప్పుడు ప్రజల నుండి కూడా వ్యతిరేకత మొదలైంది. మరో పక్క ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఆదివాసుల, అడవి బిడ్డల హక్కులకు భంగం వాటిల్లకుండా వాళ్ల బతుకులకు భరోసా కల్పిస్తే, అడవిని ఆక్రమణదారుల నుండి రక్షిస్తే, అందుకు అండగా నిలబడితే, వాళ్లు సైతం మావోయిజానికి, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశాలు ఉన్నాయి. ఆ అపనమ్మకం వల్లే ఆ భరోసా లేకపోవడం కారణంగానే ఆదివాసీలు, అడవి బిడ్డలు, సామాన్య ప్రజానీకం మావోయిజానికి ఇన్నాళ్లుగా మద్దతు పలికారు. మరోవైపు కొన్ని దశాబ్దాల పాటు పోలీసులను, ప్రభుత్వ బలగాలను, ప్రభుత్వ వ్యవస్థను ముప్పు తిప్పలపెట్టి  ఒక్కసారి కూడా చిక్కకుండా ఏమరపాటుగా ఉండకుండా మెరుపు వేగంతో దాడులకు పాల్పడి ఎక్కడ ఎవరు చేయలేని  డ్యామేజ్ చేసి మావోయిస్టుల్లోనే ఒక ఎత్తయిన శత్రుదుర్భేద్యమైన శక్తిగా నిలిచిన హిడ్మా పోలీసులకు ఏ రకంగా చిక్కినా వాళ్లు వదిలే ప్రసక్తి అయితే ఉండదు. అందరిలాగా లొంగిపోతా అంటే కరచాలనం చేసి ప్రెస్ మీట్  పెట్టి హిడ్మాను జనజీవన స్రవంతిలోకి కలిపే అవకాశం, అవసరం అంతకన్నా ఉండదు. ఎందుకంటే హిడ్మా సాదా సీదా మావోయిస్టు కాదు కదా. 'వ్యవస్థకు, పోలీసులకు హిడ్మా ఒక జీవితకాల శత్రువు'. ఒకప్పుడు వాళ్లకు మృత్యువు ఉందంటే కేవలం హిడ్మా రూపంలోనే కావొచ్చు. అలాంటి హిడ్మా ను దొరికితే వాళ్లు వదిలే ప్రసక్తే లేదు. కానీ హిడ్మా కూడా లొంగిపోయే వ్యక్తిత్వం కాదని అతని పోరాట జీవితం చెప్పకనే చెబుతుంది. ఎవరో మాయమాటలు చెప్తే విధి లేక విని, నమ్మకద్రోహులను గుడ్డిగా నమ్మి ఫలితంగా హిడ్మా తన ప్రాణాలను కోల్పోయాడు. అంతేకాదు ఆదివాసుల ఆత్మ గౌరవం, హక్కులు, అతని భౌతిక కాయంతో పాటే బూడిదలో కలిసి, అడవి గొంతుక అతనితో పాటే మూగబోయింది. ఇక అడవులు అంతరించిపోవడానికి మొదటి అడుగు హిడ్మా మరణంతో గట్టిగానే పడింది. 'హిడ్మా' నిజంగా ఇది నీ మరణం కాదు 'సరి కొత్త జననం'. హిడ్మా ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి, కానీ తుపాకీ పట్టి కాదు పిడికిలి బిగించి హిడ్మా రూపంలో అడవుల్లో కాదు 'నగరం నడి బొడ్డున' ఇప్పుడు ఉద్యమం ఉద్భవించాల్సిన సమయం.

Post a Comment

0 Comments