Breaking News

Loading..

'జిఎస్‌టి సేవింగ్స్‌ ఫెస్టివల్‌’ కంటి తుడుపేనా..!!


ఖమ్మం, సెప్టెంబర్ 24, బిసిఎం10 న్యూస్.

ఏళ్ల తరబడి ప్రజలను పీల్చి పిప్పి చేసిన అనంతరం వస్తు సేవల పన్ను విధానం (గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ - జిఎస్‌టి)లో కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకువచ్చిన మార్పుల తీరు వాత పెట్టినవాడే వెన్న పూసినట్టుగా ఉంది. ఈ చర్యతో భారీ మొత్తంలో పన్నులు తగ్గాయని, సామాన్యులు పండగ చేసుకోవచ్చని పాలకులు చెబుతున్నప్పటికి వాటి ఫలితాలు సామాన్యులకు అందడం పై సందేహాలు నెలకొన్నాయి. ఈ నెల 22వ తేదీ నుండి నూతన జిఎస్‌టి విధానం అమలులోకి రాగా, ఒక రోజు ముందు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ దసరా, దీపావళి పండగ సీజన్‌ను ‘జిఎస్‌టి సేవింగ్స్‌ ఫెస్టివల్‌’గా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఇతర ఎన్డిఎ కూటమి నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోడీని అభినందిస్తూ వివిధ సభల్లో తీర్మానాలు చేసారు. జిఎస్‌టి 2.0 వల్ల కలిగే ప్రయోజనాల పై సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. అయితే, ప్రధాని నరేంద్రమోడిగాని, ఇతర ఎన్డిఎ నాయకులు గాని ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల పై మోపిన భారాన్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. అలాగే ఒక కుటుంబానికి కలిగే ప్రయోజనం ఎంతో కూడా వారు చెప్పలేదు. నిజానికి, ఏ వస్తువు పై ఎంత ధర తగ్గుతుందన్న నిర్దిష్టమైన వివరాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించలేదు. బహుళ, పరోక్ష పన్నుల విధానం స్థానంలో ఏకీకృత పన్ను అని చెబుతూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జిఎస్‌టిని 2017లో దేశం పై రుద్దింది నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వమే కావడం గమనార్హం. కొన్ని దశాబ్దాలుగా అనుసరించిన ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా సామాన్యుడి కొనుగోలు శక్తి గణనీంగా తగ్గింది. జిఎస్‌టిలో ఉన్న సంక్లిష్టత, అపరిమిత శ్లాబుల కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగి దేశ వ్యాప్తంగా గగ్గోలు రేగింది. ప్రతిపక్షాలు దీనిని గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించాయి. మరోవైపు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గాయి. అదే సమయంలో ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావమూ పడింది. దీంతో ప్రజల ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికి కార్పొరేట్ల కోసమైనా దేశీయ మార్కెట్‌ను పెంచడం కోసం జిఎస్‌టిని తగ్గించక తప్పనిస్థితి ఏర్పడింది. పోనీ, ఈ పేరుతోనైనా జిఎస్‌టి ప్రయోజనాలను పూర్తిగా పేదలకు అందిస్తున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 55 లక్షల కోట్ల రూపాయలను గత ఏడు సంవత్సరాల్లో జిఎస్‌టి ద్వారా ప్రజల మూలుగలు పిండి మోడీ సర్కారు వసూలు చేసింది. అప్పుడే పుట్టిన శిశువు నుండి, తుది శ్వాస విడిచిన వారి వరకు ఏవరినీ వదలని స్థితి. ఇప్పుడు తాజా సంస్కరణల కారణంగా జరిగే తగ్గింపు విలువ గరిష్టంగా 2.25 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అంటే సామాన్యుడి నుండి పిండినదెంత..?? ఇప్పుడు తగ్గిస్తున్నదెంత..?? ఇడ్లీ, దోశలను పట్టించుకోని కేంద్ర పాలకులు చపాతీ, పరోటాల పై మాత్రం జిఎస్‌టి ని తగ్గించారు. దీని వెనుక బీహార్‌ ఎన్నికల ప్రయోజనాలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జమోటా, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలివరీ సంస్థల సేవలను 18 శాతం పన్నుల శ్లాబులో చేర్చారు. దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే చేనేత రంగానికి అవసరమయ్యే ముడి సరుకులను అదే శ్లాబులో ఉంచారు. కొన్ని రకాల ఔషధాలను జీరో శ్లాబులో ఉంచినట్లు చెబుతున్నప్పటికి, వాటి తయారీకవసరమైన ముడి పదార్ధాల పై పన్ను విధించారు. జిఎస్‌టి అమలులోకి వచ్చిన 24 గంటల తరువాత కూడా పాలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. పాత స్టాక్‌కు తగ్గింపు వర్తించదని అంటున్నారు. పలు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను కొద్దిరోజుల కిందటే పెంచాయి. వీటి పై జిఎస్‌టిని తగ్గించినా, పెద్దగా ఫలితం లేదు. సామాన్యుడికి ప్రయోజనం కలిగించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నా జిఎస్‌టి రేట్ల తగ్గింపు వివరాలను నిర్దిష్టంగా సరుకుల వారీగా ప్రకటించాలి. జిఎస్‌టి తగ్గక ముందు ఉన్న ధర, తగ్గిన తరువాత ఉన్న ధరల వివరాలను నిర్దిష్టంగా వెల్లడించాలి. అలాగే జిఎస్‌టి తగ్గింపు ఒక్కటే చాలదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి అవసరమైన ఇతర చర్యలు నిజ వేతనాల పెంపు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అప్పుడే దేశీయ ఉత్పత్తులకు, ఎంఎస్ఎంఇలకు ఊతం లభిస్తుంది. స్వావలంబన దిశలో అడుగులు పడతాయన్నది మా అభిప్రాయం.

Post a Comment

0 Comments