Breaking News

Loading..

పరీక్షలు - మార్కులు - పోటీలు.


ఖమ్మం, సెప్టెంబర్ 26, బిసిఎం10 న్యూస్.

మన చదువులే నాసిరకం చదువులు. ఆ చదువులకు పెట్టే పరీక్షలు మరింత నాసిరకం, అశాస్త్రీయం. అందరూ కలిసి ఆడుతున్న గొప్ప నాటకం, పిల్లల్ని మోసగించటానికి. ఈ పరీక్షలు పిల్లల్ని భయపెట్టడానికి అవమానించడానికి తప్ప ఎందుకూ పనికిరావు. పిల్లలు పరీక్షల గురించి వారికి వచ్చే మార్కుల గురించి ఎలాంటి ఆలోచనలతో ఉంటారు? వారి మనసుల్లో ఎలాంటి భయాలుంటాయి? ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటారు? పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ భవిష్యత్తు, జీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఈ విషయాల గురించి వివరంగా చర్చిద్దాం. తర్కబద్ధంగా ఆలోచిద్దాం, సరైన నిర్ణయానికి వద్దాం. పరీక్షలు రాసేటప్పుడు ఎవరూ చూడరు, ఎన్ని మార్కులు వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ పరీక్షల మార్కులు చెబుతున్నారంటే మాత్రం పిల్లలు భయపడిపోతుంటారు. రేపు సైన్స్‌ మాస్టర్‌ మార్కులు చెబుతారట. తక్కువ మార్కులు వస్తే పైకి లేపి అవమానంగా మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళను కూడా తిడతారు. దేవుడా రేపు సైన్స్‌ మాస్టర్‌ కు జ్వరం వచ్చి సెలవు పెట్టాలి. లేకపోతే ఏదో ఒకటి జరిగి రాకపోతే ఛీ.. చీ.. అనుకుంటూ చెడ్డ ఆలోచనలకు చెంపలు వాయించుకున్నది నీలిమ. సోషల్‌ మాస్టర్‌ మార్కుల పేపర్లు ఇస్తున్నారు, విజయకు 50 మార్కులు వచ్చాయి. 'సార్‌ అన్ని ప్రశ్నలకు జవాబులు రాశాను. సగానికి సగం తక్కువ వేశారు. కుమార్‌కు మాత్రం ఫుల్‌ మార్కులు వేశారు. ఎందుకని?' అడిగాడు. 'నువ్వు అధిక ప్రసంగివి, అంతా సొంతంగా రాశావు. పుస్తకంలో ఉన్నవి లేనివి కలిపి రాశావు. కుమార్‌ నేను ఇచ్చిన నోట్స్‌ కష్టపడి కంఠస్థం చేసి రాశాడు. అందుకే నీకు సగం మార్కులు. ఆమాత్రం వేసినందుకు సంతోషించు' అన్నారు. ఎవరు తెలివిగలవాడు? కంఠస్థం చేసినవాడా? సొంతంగా రాసినవాడా? ఇది అన్యాయం. టీచర్ కు బుద్ధి లేదు. పక్షపాతం చూపించిండు. ఇలా ప్రతి పిల్లవాడు ఏదో ఒక విధంగా ఈ పరీక్షల గురించి మార్కుల గురించి భయపడుతూనే ఉంటారు, అన్యాయం జరిగిందని అనుకుంటారు. ఈ భయాలు, అనుమానాలు, ఈ చేదు అనుభవాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. పరీక్షల భయం, మార్కుల భయం పాతిక సంవత్సరాల వరకు, చదువు పూర్తయ్యే వరకు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. ఆ తర్వాత భయం అనే భూతం శరీరంలో ప్రవేశించి దాగి ఉంటుంది. జీవితాంతం ప్రతిదానికి భయపడుతుంటారు. ఇతరులతో పోల్చుకొని న్యూనతకు గురి అవుతారు. తనకు అన్యాయం జరిగిందనే నిర్ణయానికి వస్తారు. ఈ ఆలోచనలన్నీ తనకు తెలియకుండానే మనసు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. పోరాడడం సర్దుకుపోవడం రెండూ చేతకాదు, కుంగిపోతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేక ఇతరుల పై ఆధారపడుతుంటారు. లేదా ఇతరులకు అనుచరులుగా తయారవుతారు. వాడు ఎంత చెడ్డవాడైనా వాళ్ళని అంటిపెట్టుకొని బతుకుతారు. ఇలాంటి వారి వలన సమాజం ముందుకు పోలేక అనేక రుగ్మతలతో రోగిష్టి సమాజంగా తయారవుతుంది. ఈ మార్కులు అనేవి ఒకరిని గెలిపించి 99 మందిని ఓడిస్తాయి. క్లాసులో ఒక్కడికే ఫస్ట్‌ మార్కులు వస్తాయి. మిగిలిన వారంతా తనకంటే తక్కువ మార్కులు వచ్చినవాడిని చూసుకొని సంతోషిస్తారు. సంతృప్తి పడతారు. తనకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని చూసి నేనింతేలే అని సరిపెట్టుకుంటారు. పిల్లల తెలివితేటలను సూచించే ఈ మార్కులు ఆరు నెలల తర్వాత అదే పరీక్షలు పెట్టి చూడండి. మొదట వచ్చిన మార్కులు రానే రావు. అందులో సగం మార్కులు కూడా రావు, ఎందుకని? అవి నిజమైన తెలివితేటలు కావు. ఊపిరి బిగబట్టి జవాబులు కంఠస్థం చేసి పరీక్షల్లో కక్కేసి ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత బుర్ర ఖాళీ అయిపోతుంది. అందుకే ఐన్‌స్టీన్‌ 'స్కూల్లో చదివిన చదువు అంతా మర్చిపోయిన తర్వాత మిగిలినదే అసలైన జ్ఞానం' అంటాడు. ఐన్‌స్టీన్‌ పరీక్షల గురించి కూడా ఒక మాట అన్నాడు. ఆయన చదువు పూర్తి అయిన తర్వాత మొట్టమొదట పత్రికలకు రాసిన వ్యాసంలో 'పరీక్షలు రాయాలని పిల్లల్ని బలవంత పెట్టకూడదు. అది వారి మానసిక శారీరక ఆరోగ్యాల పై ప్రభావం చూపిస్తాయి' అంటారు. మనం ఐన్‌స్టీన్‌ ఈ విశ్వం గురించి చెప్పిన భౌతిక సూత్రాలను నమ్ముతాము. ప్రకృతి సూత్రాలను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఐన్‌స్టీన్‌ అంత తెలివిగలవాడు భూమి మీద పుట్టలేదంటారు. జ్ఞానాన్ని గురించి పరీక్షలు గురించి, ఆయన చెప్పిన మాటలు ఎందుకు పట్టించుకోము? చదువుల్లో మార్కులే ముఖ్యమైనప్పుడు ఆ మార్కులు సంపాదించడానికి చదువులు తయారవుతాయి. జ్ఞానం కోసం చదవడం గాక మార్కుల కోసం చదువుతారు. ఆ మార్కులు సంపాదించడానికి వక్ర మార్గాలు అన్వేషిస్తారు. 24 గంటలు కంఠస్తం చేస్తూ ప్రతిరోజూ పరీక్షలు రాస్తూ ప్రాక్టీస్‌ చేస్తారు. తాత్కాలికంగా మనసులో గుర్తుపెట్టుకోవడానికి మెదడు కూడా ఒక పద్ధతి అలవాటు చేసుకుంటుంది. విద్యార్థి సోషల్‌ లో జవాబులు ఎంతో బాగా రాస్తాడు. ప్రపంచంలో నేలల స్వభావాన్ని గురించి అద్భుతంగా రాస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఒండ్రు మట్టి నేలలు చూసావా అంటే చూడలేదంటాడు. చెట్ల గురించి బ్రహ్మాండంగా రాస్తాడు. అంటు కట్టే పద్ధతి గురించి ఎంతో చక్కగా రాస్తాడు. కానీ నీకు అంటూ కట్టే పద్ధతి తెలుసా అంటే తెలియదంటాడు. ఆక్సిజన్‌ గురించి తెలుసు, దాని ప్రయోజనాలు తెలుసు. కానీ దాన్ని తయారు చేయడం తెలుసా అంటే చేతకాదంటాడు. అసలు పరీక్ష నాళికే చూసి ఉండడు. ఈ దండగ మారిన చదువుల వలన పోటీల వలన ఏం ప్రయోజనం? పరీక్షల్లో మార్కుల కోసం పోటీ పడడం, ఉద్యోగాల కోసం పోటీ పడడం, వ్యాపారంలో లాభాల కోసం పోటీ పడడం, ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప అయినప్పుడు, సమాజంలో ఏ చెడ్డ పని అయినా దుర్మార్గమైనా ఎక్కువ సంపాదించడానికి పోటీ పడతారు. ఈ పోటీకి అంతం అనేది లేదు. ఆ పోటీ కూడా పడలేక చివరకు అందర్ని కొనేస్తారు. ఇప్పుడు చూడండి, ఎంతో ఆనందంగా ఆడుకునే ఆటలు కూడా పోటీలై, వ్యాపారమై, ఆ వ్యాపారస్తులు ఆటగాళ్లని కొనుక్కొని ఆడించే వరకు వచ్చింది. ఆటగాళ్లు ఇప్పుడు తమకోసం గాక తమ యజమాని కోసం ఆడుతున్నారు. ఇందులో కూడా మోసాలు, ఎదుటివారితో కలిసిపోయి ఆటగాడిని ఓడిపోమన్నప్పుడు ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ఆటల్లో ఎవరు గెలుస్తారనే దాని పై బెట్టింగులు ఊరురా వస్తాయి, ఆస్తులు పోగొట్టుకుంటారు. ఆటగాళ్లు బానిసలుగా మారిపోతారు, ఆటగాళ్లకు ఆత్మాభిమానం ఉండదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితికి సమాజం దిగజారిపోతున్నదో చూస్తున్నాం కదా. ఇదంతా న్యాయమే అనుకుంటాం. ఓడిన ఆటగాడిని అమ్ముడు పోయినాడని తిడతారు. గెలిచినప్పుడు ఆకాశానికి ఎత్తిన వారే ఓడినప్పుడు అవమానిస్తారు, ఆటగాళ్లు కుంగిపోతారు. ఇలా ఈ పోటీలు సమాజాన్ని ఎంత వరకైనా దిగజారుస్తాయి. అసలు చదువులన్నీ మాయమైపోతాయి. జ్ఞానము, వివేకం, వికాసం, ధర్మం, న్యాయం ఇట్లాంటివి అన్నీ పడికట్టు పదాలుగా మారిపోతాయి. సమాజంలో వాటికి ఎలాంటి విలువ ఉండదు. విలువలు లేని సమాజం ఎలా తయారవుతుందో మనం చూస్తూనే ఉన్నాం గదా, ఒక పద్ధతి ఒక పాడు ఏమీ ఉండదు. అన్ని రకాల సంస్థలు అవినీతిమయంగా మారిపోతాయి. అంతా అమ్మకం కొనుగోళ్లే. ఈ చదువులు, ఈ పరీక్షలు, ఈ పోటీలు ఇవన్నీ మారిందాక ఈ సమాజానికి విముక్తి లేదు, నిజమైన పరీక్షలు వేరే ఉంటాయి. అవి ప్రతి నిత్యం పిల్లలకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి.

Post a Comment

0 Comments