హైదరాబాద్, జులై 03, బిసిఎం10 న్యూస్.
● లాభాల్లో ఉన్నా సిబ్బంది పై వేటు.
● ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు.
మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో తొమ్మిది వేల మందిని తొలగించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రకటన విడుదల చేసింది. 2026వ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ నిర్ణయం తీసుకుంది. గత త్రైమాసికంలో 26 బిలియన్ల లాభం సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తొలగించింది. కంపెనీ నిర్వహణ స్థాయిని తగ్గించి, కార్యకలాపాలను సులభతరం చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కోంది. మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,28,000 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 3.9% ఉద్యోగులను బుధవారం తొలగించింది. ఈ ఏడాదిలో మొత్తం 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని, జూన్‌లో అమెరికా ప్రైవేట్ సెక్టార్‌లో 33,000 ఉద్యోగాలు తగ్గాయని ఏడీపి (ఆటోమేటిక్ డేటా ప్రోసెసింగ్) సంస్థ నివేదించింది.
● లాభాలు ఉన్నా ఎందుకు తొలగింపు..??
మైక్రోసాఫ్ట్ లాభాల్లోనే పనిచేస్తుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ 70 బిలియన్ డాలర్ల ఆదాయంలో 26 బిలియన్ డాలర్ల నికర లాభం సాధించింది. ఈ లెక్కలు వాల్‌స్ట్రీట్ అంచనాలను మించిపోయాయి. అయినప్పటికీ కంపెనీ తన ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోంది. తన కార్యకలాపాలను సులభతరం చేయడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి ఇమెయిల్ ద్వారా తెలిపారు. మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం సాధించడానికి, బృందాలను సిద్ధం చేయడానికి ఈ మార్పులు అవసరమని, ఏఐ , క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో 80 బిలియన్ల పెట్టుబడులు పెడుతూ, కంపెనీ దీర్ఘకాలిక ఆవిష్కరణల పై దృష్టి సారిస్తోందని తెలిపింది. ఈ ప్రకటనతో స్టాక్‌మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ షేర్లు బుధవారం ఉదయం 0.6% తగ్గిపోయాయి. మరోవైపు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు ఆటోడెస్క్, చెగ్‌జి, క్రౌడ్‌స్ట్రైక్‌జి వంటి కంపెనీలు ఉద్యోగుల తొలగింపుకు సిద్దమవుతున్నాయని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
0 Comments