జూలై 9న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె- గ్రామీణ బందును జయప్రదం చేయాలని సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు లు పిలుపునిచ్చారు. పార్టీ శాఖ కార్యదర్శి చెన్నూరి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన అశోక్ నగర్ కొత్త కాలనీ సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. జూలై 9న జరగబోయే సార్వత్రిక సమ్మె కేవలం కార్మిక సమస్యలు మాత్రమే కాదని పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, మహిళలపై హింస తదితర సమస్యలు పై జరిగే ప్రజా ఉద్యమమని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ దేశంలోని కోట్లాదిమంది ప్రజల ప్రయోజనాలను సామ్రాజ్యవాదానికి, కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో గోవర్ధన ఝాన్సీ, లంబు రమణ, హైమావతి, ఎర్రం శెట్టి రాము, పై పూర్ణిమ దేవి, తదితరులు పాల్గొన్నారు.

0 Comments