హైదరాబాద్, జులై 26, బిసిఎం10 న్యూస్.
పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ హిట్టా, ఫట్టా అన్నది కాదు. బాధ్యతాయుత స్థానంలో వున్న వ్యక్తి ఏ సందేశం ఇచ్చారన్నది ముఖ్యం. సందేశాత్మక, కుటుంబ చిత్రాల నిలయంగా భాసిల్లిన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రమాదకర చిత్రం రావడం, అందులో ఉప ముఖ్యమంత్రి స్థానంలో వున్న వ్యక్తి నటించడం రానున్న ప్రమాద ఘంటికలకు సంకేతం. విద్వేషాగ్నులు రగిలించే ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు, కాంగ్రెస్ ఏలుబడిలో వున్న తెలంగాణలో కూడా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంలో అంతుచిక్కని ఆంతర్యం ఏమిటో? ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు గురువారం విడుదలైంది. ఆయన అభిమానుల్లో జోష్ పెంచినట్లు లేదు. గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న మాటలను, అనుసరిస్తున్న విధానాలను గమనిస్తున్న వారు ఊహించినట్లుగానే ఈ చిత్రం చారిత్రాత్మకం కాదు, మత విద్వేషాగ్నుల వ్యాప్తిలో భాగమని తేలిపోయింది. తన అభిమానులకన్నా తెలుగు ప్రేక్షకులకన్నా ప్రస్తుతం తాను ఆరాధిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికే ఈ సినిమాలో నటించారా అనే అనుమానాన్ని కలిగించింది. తెలుగు రాష్ట్రాల యువతలో క్రేజ్ వున్న పవన్ కల్యాణ్ బిజెపి నాయకుల చెలిమితో మత విద్వేషకారుడుగా దిగజారిపోవడం మాత్రం విషాదకరం, భవిష్యత్తుకు ప్రమాదకరం. చరిత్రలోని స్థలాలు, కొందరు వ్యక్తుల పేర్లతో కల్పితమైన సంఘటనలను మతం కోణంలో చూపడం వెనుక రాజకీయ ఎజెండా వుంది. అధికారం కోసం కాదు మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రశ్నించడం తన సిద్ధాంతమని చెప్పుకున్న పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా తానే ప్రశ్నగా మారిపోతున్నారు. తాను గతంలో మాట్లాడిన మాటలకు తానే జవాబు చెప్పుకోవలసిన స్థితికి చేరుకున్నారు. ఆయనలో గందరగోళం కేవలం వ్యక్తిగతమే అయితే చర్చ అక్కర్లేదు. కానీ ఆయన రెండు రకాలుగా సమాజాన్ని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే స్థానాల్లో వున్నారు. ఒకటి ఆయన ప్రముఖ సినీనటుడు, రెండు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. ఆయన చేసే నటన, చెప్పే మాట, తీసుకునే ప్రతి నిర్ణయం సమాజంపై ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాంటి వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా వుండాలి. అలా వుండాలని ఆయన అభిమానులు కోరుకుంటారు. అందుకే కుల, మత, ప్రాంత, లింగ బేధాలకు ఆతీతంగా తల్లిదండ్రుల కంటే, బిడ్డల కంటే సినిమా హీరోలనే ఎక్కువగా అభిమానిస్తారు. తమ కష్టార్జితాన్ని ధారపోస్తారు. ఇలాంటి అభిమానులే పవన్ కల్యాణ్ లాంటి వారి ఉన్నతికి పునాదిరాళ్ళు. అలాంటి పునాదులను ఎవరి మెప్పు కోసమో పెకలించుకోవడం విజ్ఞత కాదు.
● వీరమల్లు సినిమా కథ.
నదిలో కొట్టుకుంటూ వచ్చిన ఒక పిల్లాడిని ఒక కుటుంబం పెంచుకుంటుంది. మన రాష్ట్రంలోని పూర్వపు గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం కోళ్లూరు ప్రాంతాల్లో పెరిగిన ఈ పిల్లాడు దొంగతనంలో ఆరితేరతాడు. ఈ ప్రాంతాన్ని ఒక చిన్న రాజు పాలిస్తుంటాడు. ఇక్కడ వజ్రాలు వున్నాయని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ అధికారులు అన్వేషణ చేయిస్తుంటారు. ఇక్కడ దొరికిన ఒక వజ్రాన్ని బ్రిటీష్ అధికారుల కన్నుగప్పి అతి చాకచక్యంగా దొంగిలించి తన రాజుకు ఈ పిల్లాడు చేరుస్తాడు. ఆ వజ్రం, ఆ వజ్రాన్ని దొంగిలించిన వాడి గురించి అలా అలా తిరిగి గోల్కొండ నవాబు దర్బారుకు చేరుతుంది. ఔరంగజేబు దగ్గర వున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తెచ్చే బాధ్యత ఈ దొంగకు గోల్కొండ నవాబు అప్పగిస్తాడు. హైదరాబాద్ నుండి ఎర్రకోట పైకి తన మంది మార్బలంతో ఈ దొంగ వెళ్లే క్రమంలో ఔరంగజేబు హిందువులపై అనేక రకాల పన్నులు వేసి, చిత్రహింసలకు గురిచేసి, మత మార్పిళ్లకు పాల్పడుతున్న సంఘటనలు చూసి వాటిని ఈ దొంగ హీరో ప్రతిఘటించడం ఈ చిత్ర ప్రధాన కథ.
● చరిత్ర ఏం చెబుతుంది..??
కోళ్లూరు ప్రాంతంలో బ్రిటీష్ వారు చేసిన వజ్రాల పరిశోధనలో గనులలో పెద్ద వజ్రం బయటపడినట్లు చరిత్ర చెబుతుంది. దాని బరువు గురించి అనేక వాదనలు వున్నా స్థూలంగా 186 పాత క్యారెట్లు లేదా 38.2 గ్రాములు వున్నట్లు చరిత్రకారులు నిర్ధారించారు. ఈ వజ్రాన్ని మొదట ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 1626లో బాబర్ వశమై ‘బాబర్ వజ్రం’గా పేరు పొంది మొఘల్ ఆస్థానంలోకి చేరింది. మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కుట్రలు పన్ని మహమ్మద్ షా నుండి దక్కించుకుని కోహి-ఇ-నూర్ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది. ఇలా అనేక చేతులు మారి చివరికి బ్రిటన్ ఎలిజబెత్ రాణి కిరీటంలోకి చేరింది. అత్యంత కాంతివంతమైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి మన దేశానికి ఇవ్వాలని 1947, 1953 సంవత్సరాలలో భారత ప్రభుత్వం బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసినా ఇవ్వడానికి ఆ దేశ పాలకులు అంగీకరించలేదు. ఇప్పటికీ అక్కడే వుండిపోయింది. గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ఈ కోహినూర్ వజ్రం గురించి ఒక్కమాట మాట్లాడలేదు. వారికి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నడూ మాట్లాడలేదు. ఈ చిత్రంలో ఆ బ్రిటీష్ సామ్రాజ్యవాదం గురించి చూపలేదు (రెండవ భాగంలో వుందంటారేమో). వినోదం, విజ్ఞానానికి ఉపయోగ పడాల్సిన సినిమాలను ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో మత విద్వేషాలకు ఆర్ఎస్ఎస్, బిజెపి ఉపయోగించుకుంటున్నాయి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, శంభాజీ, ఝాన్సీ, ఛావా లాంటి సినిమాలను ఈ లక్ష్యంతోనే తీశారు. ఇదే తరహాలో ఇటీవల తెలంగాణలో ‘రజాకార్’ వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రంలోకి ‘హరి హర వీరమల్లు’ రూపంలో ప్రవేశించింది. ఈ సంవత్సరం మార్చి నెలలో విడుదలైన ‘ఛావా’ సినిమా మహారాష్ట్ర లోని ఖుల్దాబాద్‌లో మత అల్లర్లకు కారణమైంది. ఆ వెంటనే స్థానిక బిజెపి ఎంపీ ఉదయన్ రాజ్ భోంస్లే ఆ ప్రాంతంలో ఉన్న ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేయాలని డిమాండ్ చేశాడు. రాజకీయ ఎజెండాలో భాగమే ఈ తరహా సినిమాలు అనడానికి ఇంతకన్న సాక్ష్యం అక్కర్లేదు. ఇవన్నీ పవన్ కల్యాణ్‌కు తెలియవని అనుకోగలమా?
● అభ్యుదయ తెలుగు చిత్రసీమ.
తెలుగు ప్రజల చరిత్రలో మన చిత్రసీమ అద్భుతమైన పాత్ర పోషించింది. ‘భక్త ప్రహ్లాద’తో ప్రారంభమైన తెలుగు చిత్రాలు మొదటి పది సంవత్సరాలు పౌరాణిక కథల ఆధారంగానే వచ్చాయి. 1938-39 నాటికి గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’ సినిమాతో అభ్యుదయ భావాలను చిత్రాల్లో పలికించడం ప్రారంభించారు. ఆ దశాబ్దం చివరిలో వచ్చిన ‘వందేమాతరం’, ‘రైతు బిడ్డ’, ‘వర విక్రయం’ లాంటి సందేశాత్మక చిత్రాలకు తెలుగు ప్రజలు పట్టం కట్టారు. 1940-50 మధ్య ‘భక్త పోతన’, ‘యోగి వేమన’, ‘త్యాగయ్య’, ‘పల్నాటి యుద్ధం’. ‘బాలనాగమ్మ కథ’ ‘కన్యాశుల్కం’ లాంటి అనేక చిత్రాలు ప్రజల జీవితాలతో ముడివేసుకుపోయాయి, పండిత పామరులను మెప్పించాయి. ఆ తర్వాతి కాలంలో ప్రజానాట్య మండలి నుండి వచ్చిన డాక్టర్ రాజారావు ‘పుట్టిల్లు’తో సినీ రంగ నడకను ఉరకలెత్తించారు. ‘రోజులు మారాయి’, ‘పెద్ద మనుషులు’, ‘జయభేరి’ లాంటి సినిమాలు తెలుగు నాట అభ్యుదయ భావాలను పెద్ద ఎత్తున వ్యాపింపచేశాయి. ఆ తర్వాతి కాలంలో అనేక పరిణామాలు చెంది దొంగ, ఖైదీ, రాక్షసుడు, పోకిరి, పోరంబోకు, గుడుంబా శంకర్, ఇడియట్ లాంటి పేర్లతో చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలో వచ్చిన ‘హరి హర వీరమల్లు’ సినిమా మతతత్వ భావజాలానికి పునాది వేయడానికి ప్రయత్నించింది. గత సంవత్సరన్నర కాలంగా పవన్ కల్యాణ్ ఆర్ఎస్ఎస్ ఎజెండాను భుజాన వేసుకున్నారు. స్వయం ప్రకటిత సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యారు. తిరుపతి లడ్డుతో మొదలు పహల్గాం ఉగ్రవాద సంఘటన వరకు ప్రతిదీ మత కోణంలో మాట్లాడుతున్నారు. ఇంతకంటే గట్టిగా మతోన్మాద భావజాలాన్ని మాట్లాడిన తాజా మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కాశ్మీర్ పూర్వ గవర్నర్ సత్యపాల్ మాలిక్, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఒకరేమిటి ఇలా అనేకమంది నాగపూర్ మూల విరాట్‌ల చేతిలో కరివేపాకు లేదంటే తమలపాకులుగా మారిపోయిన విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించడంలేదు. చైతన్యానికి ప్రతీకలైన ఆంధ్రప్రదేశ్ రచయితలు, కళాకారులు, అభ్యుదయ, ప్రజాతంత్ర వాదులు సాంస్కృతిక రంగంలోకి జొరబడుతున్న మత విద్వేషాలను ఆదిలోనే ప్రతిఘటించాలి. అందుకు వారి కలాలు, గళాలు, కళలు ఉపయోగించాలి.
0 Comments