ఖమ్మం, జులై 30, బిసిఎం10 న్యూస్.
కళాశాలల్లో, కోచింగ్ సెంటర్లలో మార్కుల కోసం, ర్యాంకుల కోసం జరిగే తీవ్రమైన పోటీలో ఎంతో మంది యువత తమ చిరునవ్వులు పోగొట్టుకుంటున్నారు. వారి మనసులలో పేరుకుపోయిన ఒత్తిడి, బయటకు చెప్పుకోలేని బాధ, చివరికి ప్రాణాలు తీసుకోవడానికి దారితీస్తోంది. ఈ భయంకరమైన పరిస్థితిని గుర్తించిన సుప్రీంకోర్టు 25 జులై 2025న కీలకమైన తీర్పు ఇచ్చింది. 'నేర్చుకోవడంలో ఆనందం పోయి, ర్యాంకులు, ఫలితాలు, నిరంతర పోటీ ఆందోళనగా మారిపోయింది' అని న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై మద్దతు ఇవ్వడానికి, ఆత్మహత్యలను నివారించడానికి దేశంలో సమగ్రమైన, అమలు చేయదగిన చట్టపరమైన నియంత్రణలు లేవని కోర్టు లోతుగా విశ్లేషించింది. విద్యార్థుల ఆత్మహత్యలను ఆపడానికి 15 ముఖ్యమైన సూత్రాలతో కూడిన ఒక ప్రణాళికను ప్రకటించింది. విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదు, పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని ఈ తీర్పు తేటతెల్లం చేసింది.
● గణాంకాలు చెప్పే కఠిన వాస్తవం.
జాతీయ నేర గణాంక సంస్థ 2022 నాటి 'యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా' నివేదిక మన దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 7.6 శాతం మంది విద్యార్థులే అని పేర్కొంది. 2022లో సుమారు 13,044 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో 2,248 మంది కేవలం పరీక్షలలో ఫెయిల్ అవడం వల్లే చనిపోయారని స్పష్టం చేసింది. 2001లో 5,425 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా 2022 నాటికి ఈ సంఖ్య 13,044కి చేరింది. నియంత్రణ లేని కోచింగ్ పరిశ్రమ యువత జీవితాలను ఎలా ప్రమాదంలో పడేస్తుందో విశ్లేషిస్తుంది.
● సుప్రీంకోర్టు జోక్యం ఎందుకు?
ఈ తీర్పునకు తక్షణ కారణం, తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై సుక్దేవ్ సాహా చేసిన పోరాటం. విశాఖపట్నంలోని ఒక కోచింగ్ సెంటర్‌లో నీట్ కోసం చదువుతున్న అతని పదిహేడేళ్ల కుమార్తె 2023 జులై 14న హాస్టల్ పైకప్పు నుండి పడిపోయి అనుమానాస్పదంగా మరణించింది. ఈ సంఘటన పై పోలీసులు సరిగా విచారించడం లేదని, కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిజాలను దాచిపెడుతోందని ఆరోపిస్తూ సాహా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆ ఒక్క సంఘటనను కేవలం వ్యక్తిగత విషాదంగా చూడకుండా అది దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంక్షోభానికి, వ్యవస్థాగత లోపానికి నిదర్శనంగా విశ్లేషించింది. పోలీసు దర్యాప్తులో 'లోతైన లోపాలు' ఉన్నాయని, 'కీలక ఆధారాలను దాచిపెట్టే అవకాశం' ఉందని గమనించి సిబిఐ విచారణకు ఆదేశించడం ద్వారా వ్యవస్థల మధ్య జవాబుదారీతనం లేకపోవడంపైనా కోర్టు పరోక్షంగా దృష్టి సారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, జీవించే హక్కు పరిధిలో మానసిక ఆరోగ్యం ఒక అంతర్భాగమని కోర్టు స్పష్టం చేసింది. ఈ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉందని, అందుకే ఈ ఆదేశాలను జారీ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.
● సంస్థలే జవాబుదారీ వహించాలి.
విద్యార్థుల సమస్యలను విద్యాసంస్థలు పట్టించుకోకపోయినా, ఆ నిర్లక్ష్యం ఆత్మహత్యకు దారితీస్తే, ఆ సంస్థలే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఈ తీర్పు విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడటానికి ఒక బహుళ రంగ విధాన ఆవశ్యకతను ప్రతిబింబిస్తుంది. అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఒకే రకమైన మానసిక ఆరోగ్య విధానాన్ని పాటించాలి. దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్యానికి ఒక ప్రామాణిక విధానాన్ని ఏర్పాటు చేయాలి. వంద మందికి పైగా విద్యార్థులున్న ప్రతి విద్యా సంస్థలో కనీసం ఒక అర్హత కలిగిన కౌన్సెలర్, సైకాలజిస్ట్‌ను తప్పనిసరిగా నియమించాలి. చిన్న సంస్థలు తగినంత మంది కౌన్సెలర్‌లు ఉండేలా చూసుకోవాలి. పరీక్షా సమయాల్లో విద్యార్థి బృందాలకు మెంటార్‌లను కేటాయించాలి. మానసిక ఆరోగ్య సేవలు, స్థానిక ఆసుపత్రులు, ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు తక్షణ రెఫరల్ కోసం అన్ని విద్యా సంస్థలు ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేయాలి. ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. టెలీ-మానస్, ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ నంబర్‌లను హాస్టళ్లు, తరగతి గదులు, సాధారణ ప్రాంతాలు, వెబ్‌సైట్‌లలో పెద్ద అక్షరాలతో ప్రముఖంగా ప్రదర్శించాలి. బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కనీసం సంవత్సరానికి రెండుసార్లు ధృవీకరించబడిన మానసిక ఆరోగ్య నిపుణులచే శిక్షణ పొందాలి. ఈ శిక్షణలో మానసిక ప్రథమ చికిత్స, ఆత్మహత్య సంకేతాలను గుర్తించడం, స్వీయ హానిని ఎదుర్కోవడం, రెఫరల్ విధానాలు ఉండాలి. ఉపాధ్యాయులు, వార్డెన్లు మొదలైనవారు విద్యార్థులలో మానసిక క్షోభను గుర్తించి, సరిగ్గా స్పందించడానికి ఇది కీలకం. తల్లిదండ్రులు, సంరక్షకులను నిరంతరం అవగాహనా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. విద్యార్థుల పై అనవసరమైన విద్యా ఒత్తిడిని తగ్గించి ఇంట్లో సహాయక వాతావరణాన్ని ప్రోత్సహించడం ఈ సెషన్ల లక్ష్యం. లైంగిక వేధింపులు, ర్యాగింగ్, కులం, వర్గం, లింగం, లైంగిక ధోరణి, వైకల్యం, మతం లేదా జాతి ఆధారిత బెదిరింపులకు సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, పరిష్కరించడానికి, నివారించడానికి పటిష్టమైన, గోప్యమైన అందుబాటులో ఉండే సమగ్ర ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుదారులు లేదా విజిల్ బ్లోయర్‌ల పై ప్రతీకార చర్యలకు 'జీరో టాలరెన్స్ విధానం' ఉండాలి. ఇటువంటి కేసులలో మానసిక ఆరోగ్య నిపుణులకు తక్షణ రెఫరల్ తప్పనిసరి. ఫిర్యాదుల పై సకాలంలో లేదా తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ప్రత్యేకించి అటువంటి నిర్లక్ష్యం విద్యార్థి ఆత్మహత్యకు లేదా స్వీయ హానికీ దారితీస్తే, అది 'సంస్థాగత దోషం’గా పరిగణించబడుతుంది. ఇది నిర్వాహకులను నియంత్రణ, చట్టపరమైన పరిణామాలకు బాధ్యులను చేస్తుంది. అన్ని హాస్టళ్లు ట్యాంపర్ ప్రూఫ్ సీలింగ్ ఫ్యాన్‌లు, భద్రతా పరికరాలను అమర్చాలి. అలాగే ఆత్మహత్యా యత్నాలను నిరోధించడానికి పైకప్పులు, బాల్కనీలు ఇతర ప్రమాదకర ప్రాంతాలకు ప్రవేశాన్ని నియంత్రించాలి. అకడమిక్ పని తీరు ఆధారంగా విద్యార్థుల బ్యాచ్‌లను వేరుచేయడం, బహిరంగంగా అవమానించడం, విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా లేని విద్యా లక్ష్యాలను విధించడం వంటివి కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు చేయకూడదు. ఇది ఒత్తిడిని తగ్గించి, విద్యార్థుల పై అనవసరమైన భారాన్ని తొలగించడానికి సహాయ పడుతుంది. విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్యం శ్రేయస్సు పద్ధతుల పై వార్షిక బాహ్య నిపుణులతో నిర్వహించాలి. ఆత్మహత్యా యత్నాన్ని జిల్లా అధికారులకు అధికారికంగా నివేదించాలి. సంస్థలు అంతర్గత విచారణలు నిర్వహించి, నివారణ చర్యలను నమోదు చేయాలి, ఇది పారదర్శకతను పెంచుతుంది, బాధ్యతను నిర్ధారిస్తుంది. విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన డేటాను సేకరించడానికి, విశ్లేషించడానికి ఒక జాతీయ డేటా బేస్‌ను ఏర్పాటు చేయాలని పరోక్షంగా ఈ తీర్పు సూచిస్తుంది. చివరగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండు నెలల్లోగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నమోదు, నియంత్రణ, పర్యవేక్షణకు నిబంధనలను నోటిఫై చేయాలి, ఈ నిబంధనలు విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్య రక్షణలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కోచింగ్ సెంటర్ల అదుపులేని వృద్ధిని, వాటిలో నెలకొన్న ఒత్తిడిని పరిష్కరించడానికి ఒక కీలకమైన చట్టపరమైన చర్య. ఈ మార్గదర్శకాల విజయం వాటిని ఎంత పకడ్బందీగా అమలు చేస్తారనే దాని పై ఆధారపడి ఉంటుంది. వార్షిక తనిఖీలు జవాబుదారీతనాన్ని పెంచుతాయి. కేవలం మార్కుల వెనుక పరిగెత్తే ధోరణిని వదిలిపెట్టి, పిల్లల సమగ్ర అభివృద్ధికి, మానసిక స్థితిస్థాపకతను ప్రోత్సహించే విద్య వైపు మన సమాజం మళ్లినప్పుడే సాధ్యమవుతుంది.

0 Comments