ఖమ్మం, మే 05, బిసిఎం10 న్యూస్.
నేటి తరం కమ్యూనిస్టులు బతకనేర్చినవారంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించడంతో మొదలుపెట్టి చివరికి నేటి కమ్యూనిస్టులు జీవచ్ఛవాలు అని తేల్చేస్తున్నారు చాలామంది మేధావులు, పెద్దలు. భవిష్యత్తులో పోరాటాలు వచ్చే అవకాశం ఉందంటూనే, ఈ జీవచ్ఛవాలు వాటిలో పోషించబోయే పాత్ర ఎంత అన్నది ప్రశ్నార్ధకమేనంటూ ముక్తాయింపు పలుకుతున్నారు. సోషలిస్టు సమాజాన్ని కోరుకునే వ్యక్తులు, ఇప్పుడున్న పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అంతం కావాలని బలంగా కోరుకునే వారే అనుకుందాము. అటువంటి మేథావులు ఏ నేపథ్యంలో పై వ్యాఖ్యలు చేశారో, రాతలు రాశారో ముందు వెనుక చూడాలి కదా. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధాన స్రవంతిగా ఉన్న సిపిఐ(ఎం) ఇటీవలే జాతీయ మహాసభలు పూర్తి చేసుకుని, రానున్న కాలంలో చేపట్టవలసిన కర్తవ్యాలను నిర్ధారించుకుంది. పార్టీ అంతర్గత నిర్మాణ పరిస్థితిని, బలాలను, బలహీనతలను సూటిగా, దాపరికం లేకుండా మదింపు చేసి పార్టీ పటిష్టతకు చేపట్టవలసిన చర్యలను కూడా నిర్ణయించింది. కొద్ది నెలల్లో ఇంకొక ప్రధాన కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐ కూడా అటువంటి మహాసభల నిర్వహణకే సమాయత్తం ఆవుతోంది. మూడవ స్రవంతిగా ఉన్న మావోయిస్టులు ‘ఆపరేషన్ కగార్’ దాడిని ఎదుర్కొనే జీవన్మరణ పోరాటంలో మునిగివున్నారు.
● ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులంతా ‘ఆపరేషన్ కగార్’ను ఖండిస్తున్నారు.
మేధావులు శలవిచ్చినట్టు రాబోయే రోజుల్లో మళ్ళీ పోరాటాలు ఉవ్వెత్తున తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. అందుకు తగిన విధంగా కమ్యూనిస్టులు సిద్ధపడుతున్నారా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం. సిపిఎం మహాసభ తీర్మానాలు ఆ విషయాన్ని స్పష్టంగానే ప్రకటించాయి. సర్వశక్తులనూ ఒడ్డి, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కష్టజీవుల పోరాటాలను నిర్మించాలని, ఆ పోరాటాలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశాయి. ఇది మేధావులకు బతకనేర్వడంలా కనిపించడం విడ్డూరంగానే ఉంది. 'జీనా హై తో మర్‌నా సీఖో, కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో అనేవారు' కమ్యూనిస్టులు. సంపూర్ణమైన మానవత్వంతో జీవించాలంటే పోరాటం నేర్చుకోవాలన్నది కమ్యూనిస్టు అవగాహన. అందుచేత కమ్యూనిస్టులంటే బతకనేర్చినవారు అని అనుకోకూడదని, మనిషి బతుకంటే ఏమిటో, దాని విలువ ఏమిటో, ఆ బతకడం కోసం ఎలా పోరాడాలో నేర్పేవారు, నేర్చిన వారు కమ్యూనిస్టులు అని అందరం గమనించాలని కోరుకుందాం. కొందరు కమ్యూనిస్టుల పిల్లలు పెట్టుబడిదారులు అయిపోయారనో లేదా మరికొందరు అవకాశవాదంతో దారి తప్పారనో అంటూ వారికి ఈ సమాజం ద్వారా అంటిన అవలక్షణాలను మొత్తం కమ్యూనిస్టులందరికీ అంటగట్టాలని చూస్తున్నారా..?? 'కమ్యూనిస్టుల్లోనూ కొందరు మంచివాళ్ళున్నారు' అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం బట్టి అలానే అనుకోవలసి వస్తోంది. సోషలిజాన్ని సాధించడమే లక్ష్యంగా, అందులో భాగంగా ప్రస్తుతం దేశానికి పట్టిన కార్పొరేట్, మతతత్వ శక్తుల పీడను వదిలించడమే కర్తవ్యంగా ఎంచుకుని కృషి చేస్తున్న కమ్యూనిస్టులు నాయతక్వం స్థాయి నుంచి సాధారణ సభ్యుల స్థాయి దాకా లక్షలాది మంది ఉంటే కొందరికి 'కొందరు మంచివాళ్ళు' మాత్రమే కనిపించడం దృష్టి లోపం అనుకోవాలా..?? సుందరయ్య, రాజేశ్వరరావుల తరం తర్వాత కమ్యూనిస్టులు కొందరి దృష్టిలో కొరగానివాళ్ళు. కాని 1990ల తర్వాత నుంచి నేటి దాకా అంతర్జాతీయంగా గాని, జాతీయంగా గాని అత్యంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్న కాలంలో శక్తి మేరకు పోరాడుతున్నదెవరు..?? దేశంలో నేటికీ బ్యాంకులు, ఇన్సూరెన్సు, విద్యుత్తు, ఇంధన, ఉక్కు రంగాలు వంటివి ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతున్నాయంటే అందుకు కారణం ఆ రంగాల కార్మికుల ప్రతిఘటన కాదా..?? ఆ ప్రతిఘటన వెనుక వెన్నెముకగా నిలిచిన కమ్యూనిస్టులు కాదా..?? మోది చేసిన నల్ల రైతు చట్టాలను ప్రతిఘటించి ఓడించినది రైతుల వర్గ పోరాటం కాదా..?? ఆ పోరాటంతో మమేకమై ప్రతీ అడుగులోనూ వెన్నంటి నిలిచిన వారు కమ్యూనిస్టులు కారా..?? నేడు వీరోచితంగా విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె సాగుతోంది. అన్ని నిర్బంధాలను, పాలక పార్టీల నమ్మక ద్రోహాన్ని తట్టుకుని ఆ పోరాటం సాగడం వెనుక కమ్యూనిస్టుల కీలకపాత్రను మేధావులు ఎందుకు చూడలేకపోతున్నారు..?? నేడు రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీల రూపంలో, బలవంతపు భూసేకరణ రూపంలో, పేదల ఇళ్ళను కూల్చివేసే రూపంలో ఇలా చాలా చెప్పవచ్చు పాలక వర్గాలు సామాన్యుల మీద దాడులు ఎడతెరిపి లేకుండా చేస్తూంటే ఆ దుర్మార్గాలను ఎలుగెత్తి ఖండిస్తున్నది ఎవరు..?? కమ్యూనిస్టులు కాదా..?? ప్రతీరోజూ ఎక్కడో ఒక దగ్గర పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నా వెనుదిరిగే ఆలోచనే లేకుండా పెనుగులాడుతున్నది ఎవరు..?? కమ్యూనిస్టులు కాదా..?? ఇదంతా బతకనేర్వడం కిందే జమ కట్టదలిచారా..?? కమ్యూనిస్టు కార్యకర్తల కుటుంబాలకు ఆ పార్టీలు ‘భరోసా’ ఇవ్వలేకపోతున్నాయంటూ వారు వాపోతున్నారు. ‘బతకనేర్చినవారు’ అన్నది వార, కార్యకర్తలకు భరోసా లేదన్నది వారే. పరస్పరం పొసగని ఈ తరహా వ్యాఖ్యలతో ఎవరిని గందరగోళానికి గురి చేయదలిచారో మరి. కమ్యూనిస్టు కార్యకర్తలు నేటికీ సుందరయ్య, రాజేశ్వరరావు వంటి మహా నేతల స్ఫూర్తితోనే త్యాగాలకు సిద్ధపడి వచ్చి పని చేస్తున్నవారే తప్ప భరోసాలు, గ్యారంటీలు ఉంటేనే పని చేస్తాం అని వచ్చినవారు కాదు. అటువంటి భరోసాలు, ఇన్సూరెన్స్ స్కీములు, ట్రస్టులు వారు చెప్పినట్టు టిడిపి వంటి బూర్జువా పార్టీలలో అవసరం పడవచ్చేమో గాని కమ్యూనిస్టు పార్టీలలో కాదు. ఇక్కడ కమ్యూనిస్టులు ప్రజలకు, ప్రజలు కమ్యూనిస్టులకు భరోసాగా ఉంటారే తప్ప స్కీములు, ట్రస్టులు కావు. కార్పొరేట్ సంస్థల నుండి నిధులను స్వీకరించడానికి తిరస్కరించినది కమ్యూనిస్టులే. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సైతం గుర్తించక తప్పలేదు. ఇది కూడా బతకనేర్వడమేనా మేధావుల్లారా..??
ఆర్థికవేత్తలు మార్క్సిస్టుల అవగాహన కూడా కలిగిఉండాలి. కాని ఫైనాన్సు పెట్టుబడిది ప్రధాన పాత్ర అయిన తర్వాత సమాజంలో కార్మికులకు, యజమానులకు మధ్య వర్గ పోరాటాలు తలెత్తే అవకాశాలే లేకుండా పోయాయంటూ వింతైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. దోపిడీ ఉన్నంత కాలం దానికి ప్రతిఘటన ఉంటుంది. ఎటొచ్చీ వీరు వర్గ పోరాటం రావాలంటే కార్మికులలో ద్వేషం రావాలన్నారు. ఇదెక్కడి సిద్ధాంతమో ఎవరికి తెలియదు. కాని మార్క్స్, లెనిన్ చెప్పిన ప్రకారం అయితే (1) శ్రమ దోపిడీ కారణంగా పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య వైరుధ్యం అనివార్యంగా తలెత్తుతుంది. అది వర్గ పోరాటాలకు దారి తీస్తుంది. (2) తాము దోపిడీకి గురవుతున్నాం అన్న చైతన్యం కార్మికులలో బలపడుతున్నకొద్దీ ఆ వర్గ పోరాటాలు విప్లవ స్వభావాన్ని సంతరించుకుని అంతిమంగా దోపిడీ వ్యవస్థనే కూల్చివేస్తాయి. అంతే తప్ప ద్వేషం ప్రధానం కానేకాదు. మేధావులు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఫైనాన్సు పెట్టుబడి పెత్తనం కారణంగా కార్మికులకు, పెట్టుబడిదారులకు మధ్య వైరుధ్యాలే లేకుండా పోయాయని అనుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే సమాజం నడవాలంటే సంపద ఉత్పత్తి నిరంతరం జరగాల్సిందే. అందుకోసం కార్మికుల శ్రమ శక్తిని వినియోగించాల్సిందే. ఫైనాన్సు పెట్టుబడి ఎంత పెరిగినా, దాని పెత్తనం ఎంత పెరిగినా, వ్యవసాయ రంగం, ఉత్పత్తి రంగం, రవాణా, ఇంధన రంగాలు, సమాచార రంగం వంటివి కీలకంగానే ఉంటాయి. వాటిలో అసంఖ్యాకంగా శ్రమజీవులు కష్టిస్తూనే వుంటారు. వారి శ్రమ అదనపు విలువను సృష్టిస్తూనే వుంటుంది, దానిని యజమానులు దోచుకుంటూనే వుంటారు. నయా ఉదారవాద విధానాలు వచ్చాక అమెరికా పోయినవారినో, రియల్ ఎస్టేట్ బ్రోకర్లనో, షేర్ మార్కెట్లనో మాత్రమే ఈ మేధావులు ప్రధాన కార్యకలాపాలుగా పరిగణిస్తున్నట్టుంది. దేశంలో దాదాపు 20 కోట్ల మంది పట్టణాల్లో, గ్రామసీమల్లో, సంఘటిత, అసంఘటిత రంగాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. కరోనా కాలంలో నిస్సహాయులుగా తమ గ్రామాలకు కాలినడకన పయనమైన లక్షలాది మంది కార్మికుల హృదయ విదారక దృశ్యాలను వారు అప్పుడే మరిచిపోయారా..?? రోజూ రోడ్ల పై తిరుగుతూ డోర్ డెలివరీ పనుల్లో నలిగిపోతున్న కోటిమంది గిగ్ వర్కర్లు వారికి ఎక్కడా తారసపడలేదా..?? వారందరూ శ్రమ దోపిడీకి గురి కావడం లేదా..?? పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోతోందని అంటున్నారు. దానికి కారణం అత్యధిక శ్రమజీవుల పై దోపిడీ పెరిగి వారి శ్రమను దారుణంగా యజమానులు కొల్లగొట్టడమే. అందువల్లనే ఆ కోట్లాది మంది దగ్గర కొనుగోలు శక్తి లేకుండా పోతోంది. అదే ఆర్థిక మాంద్యానికి దారి తీస్తోంది. ఆర్థిక మాంద్యాన్ని, వ్యవస్థ సంక్షోభాన్ని గుర్తించిన వారు దానికి మూలమైన శ్రమ దోపిడీని మాత్రం ఎందుకు చూడలేకపోతున్నారు..?? ఈ నయా ఉదారవాద కాలంలో శ్రమ దోపిడీ అనేక రెట్లు పెరిగిందే తప్ప తగ్గలేదు. కమ్యూనిస్టులు పార్లమెంటరీ రంగంలో గణనీయంగా బలం కలిగివున్న కాలంలో, వాళ్ళ మద్దతు మీద కేంద్రంలో ప్రభుత్వం ఆధారపడవలసి వచ్చిన కాలంలో ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, విద్యా హక్కు చట్టం, పునరావాస చట్టం, సమాచార హక్కు చట్టం వంటివి వచ్చాయి. ఇవన్నీ నేడు వివిధ ప్రజాతంత్ర ఉద్యమాలకు ఆయుధాలుగా పరిమితంగానైనా తోడ్పడుతున్నాయి. ఇదంతా బతకనేర్వడమేనా..?? బతకనేర్వడం (బహుశా వీరి దృష్టిలో అది అవకాశవాదానికి పర్యాయపదం అనుకుంటున్నాను) తెలిస్తే ఆ కేంద్ర ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చేరకపోయి వుండేవారా..??
● ఆ బతకనేర్వడం ఏదో ఇప్పుడున్న రాష్ట్రాల పాలకులకు బాగా తెలుసు.
అవకాశం వస్తే చాలు, కేంద్ర మంత్రివర్గంలో చేరిపోతారు. అందుకోసం గతంలో విమర్శించిన వారినే కిర్తించడానికి తయారౌతారు. అటువంటి బతకనేర్వడాలు కమ్యూనిస్టులకు తెలియవని ఈ మేధావులకు సవినయంగా నివేదించుకుంటున్నారు. నేటికి ఒక నెల వ్యవధిలో జులై 9న దేశవ్యాప్తంగా కార్మికవర్గం నయా ఉదారవాద విధానాలకు, వాటి పర్యవసానాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ సమ్మెలోకి దిగుతోంది. కార్మిక వర్గానికి రైతుల సంయుక్త కిసాన్ మోర్చా తోడైంది. దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపిచ్చింది. బలం పుంజుకుంటున్న ఈ కార్మిక కర్షక ఐక్యత వెనుక కమ్యూనిస్టుల, ప్రజాస్వామిక వాదుల అవిరళ కృషి ఎంతో ఉంది. ఇటువంటి తరుణంలో కమ్యూనిస్టులను ‘జీవచ్ఛవాలు’ అనడం దారుణం. మహాభారతంలో కర్ణుడు శల్యుడిని తన సారథిగా కావాలని ఎంచుకుని మరీ తెచ్చుకున్నాడు. ఆ శల్యుడు ఒక పక్క సారథ్యం చేస్తున్నట్టు చేస్తూనే, కీలకమైన సందర్భాలలో కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా, అవమానపరిచేలా, కుంగిపోయేలా చేసి అతడి ఓటమికి, చావుకి కూడా కారణం అయ్యాడు. ఐతే ఇది మహాభారత కాలం కాదు, కమ్యూనిస్టులు అంతిమ విజయం సాధించేవరకూ అంతమయ్యేదీ లేదు. అందుచేత మీ శల్య సారథ్యం వలదు కాక వలదు.

0 Comments