రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిదేళ్ల తర్వాత కప్ గెలిచింది. కోహ్లీ పై అభిమానం, కప్పే గెలవలేదన్న సానుభూతి అన్నీ కలసి వచ్చింది, గెలిచింది, ఆ టీమ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ విజయోత్సవ ర్యాలీతో పదకొండు మంది ప్రాణాలు పోయాయి. మూడు లక్షల మంది స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది..?? ఇంత మంది ఎందుకు వచ్చారు..?? అసలు ఐపీఎల్ అనేది ఏంటి..?? యువతకు ప్రాధాన్యతలు, భద్రత, జాగ్రత్త తెలియడం లేదా..?? ఫ్యానిజం బానిసత్వం ఎందుకు..??
● ఫ్యానిజం – జీవితాన్ని నాశనం చేస్తుంది.
ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, ఆ దేశానికి వెళ్తే తండోపతండాలుగా ఫ్యాన్స్ రారు. న్యూజిలాండ్‌లోనూ అంతే, అమెరికాలోనూ క్రేజ్ ఉన్న ఆటగాళ్లు రోడ్ పై కనిపించినా పెద్దగా పట్టించుకోరు. అలా అని అక్కడ ఆయా ఆటలకు ఆదరణ లేదని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు. కానీ దాన్ని తమ జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తెచ్చుకోరు. ఎవరి కెరీర్ ల విషయంలో వారు బిజీగా ఉంటారు. కానీ మన దేశంలో ఏం జరుగుతోంది..?? యువత ఎవరో ఒకరికి అభిమాన బానిసలుగా మారి టైం వేస్ట్ చేస్తున్నారు. ఏ చిన్న పనికి మాలిన సెలబ్రిటి వస్తున్నారని చెప్పిన తండోపతండాలుగా చూసేందుకు వస్తున్నారు. ఇంత పని లేని వాళ్లు ఉన్నారా అని ఆ సెలబ్రిటి కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
● మీ జీవితంలో మీరే హీరో.
ఒక సారి ఎవరో ఏదో సాధించారని అతన్ని చూసేందుకు వెళ్లడం, లేదా అభిమాన హీరో అని ధియేటర్లలో చొక్కాల చింపు కోవడం, లేదా రాజకీయ పార్టీల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆవేశపడటం వంటివి చేసే ముందు అసలు మన జీవితం ఏమిటి, మనం చేయాల్సిన పనులు ఏమిటి, చేస్తున్నదేమిటి అని ఒక్క సారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ హీరో, క్రికెటర్ లేదా రాజకీయ నాయకుడు తన డ్యూటీని తాను చేసుకుంటున్నాడు. తన జీవితంలో తాను ఎదిగేందుకు కష్టపడుతున్నాడు. ఆ స్ఫూర్తి మీలో ఎందుకు లేదో తెలుసుకోవాలి. వేరేవాళ్లకు జిందాబాద్‌లు కొట్టాల్సిన దౌర్భాగ్యమైన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వాళ్ల విజయాల నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి కానీ వారి విజయాలకు సంబరపడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జీవితం కాదు.
● మీరు ఎందులో తక్కువ..??
వాళ్లు ప్రయత్నించి క్రికెటర్లు అయ్యారు, సినిమా నటులు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. మీరు ప్రయత్నిస్తే మీకు ఇష్టమైన రంగంలో మీరు కూడా ముందుకు వెళ్లవచ్చు. వాళ్లకు ఫ్యానిజం, బాసిజం చేసుకుంటూ, ర్యాలీలకు హాజరై సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటూ టైం పాస్ చేస్తే జీవితానికి అర్థం ఏముంటుంది..?? బెంగళూరు జట్టు గెలిచింది, ఆ టీమ్ లో అందరికి కోట్లకు కోట్లు వస్తాయి. కాని విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన పదకొండు మంది కుటుంబాలకు ఎవరు దిక్కు..?? గాయపడి ఇక పని చేయలేక నిత్య నరకం అనుభవించేవారి కుటుంబాలకు ఎవరు సాయం చేస్తారు, అలాంటి పరిస్థితుల్లో మీరుంటే అని ఆలోచించండి.
ఎవరో విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఆపండి. మీ జీవితాలను మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే యువత బాగుపడుతుంది, యువత బాగుపడితే ఆటోమేటిక్‌గా దేశం బాగుపడుతుంది. కావాల్సింది ఇదే..!!

0 Comments