Breaking News

Loading..

'వక్రీకరణ'కు పురస్కారాలా..!!


ఖమ్మం, జూన్ 09, బిసిఎం10 న్యూస్.

ఇటీవల తెలంగాణా ప్రభుత్వం గద్దర్‌ పేరిట ఇచ్చిన సినిమా అవార్డులు ఆయన స్ఫూర్తిని అవమానించేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి, అందులో కమ్యూనిస్టుల పాత్రను, త్యాగాలను తక్కువ చేసిన ‘రజాకార్‌’ సినిమాకు అవార్డునివ్వడం చరిత్రకు తీవ్ర అవమానమనే విమర్శలు వచ్చాయి. మత సామరస్యాన్ని పెంచటం ఏ కళ అయినా చేయాల్సిన సామాజిక విధి. కానీ, ఈ సినిమాలో కాషాయవాదుల రాజకీయ లక్ష్యానికి అనుగుణంగా ముస్లిం వ్యతిరేకతను పెంచటమే ‘రజాకార్‌’ దర్శక నిర్మాతల లక్ష్యంగా సాగింది. బిజెపి నాయకులు పనిగట్టుకొని ఈ సినిమాకు ప్రచారం కల్పించినా పెద్దగా ప్రేక్షకులు ఆదరించలేదు. అలాంటి సినిమాకు పురస్కారం ఇవ్వటం ద్వారా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉన్మాద భావాలకు ఊతమిచ్చినట్టుగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ పేరుతో ఏటేటా సినీ రంగంలోని ప్రముఖులకు ఇచ్చే అవార్డులను ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వాతంత్య్రంరాక ముందు బ్రిటిష్‌ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్‌ పార్టీకి గుర్తుగా గద్దర్‌ ఆ పేరు పెట్టుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌, నటి జయసుధ, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు వీటిని ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు సెన్సారైన చిత్రాలను అవార్టుల కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్‌ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇచ్చే సమయంలో అభివృద్ధిని కాంక్షించే అభ్యుదయ సినిమాలకు కాకుండా చరిత్రను వక్రీకరించి మతం పేరుతో సమాజాన్ని విభజించేలా ఉన్న ‘రజాకార్‌’ సినిమాకు అవార్డు ప్రకటించటం ఆర్ఎస్ఎస్‌ ఒత్తిళ్లకు తలొగ్గినట్లుగా కనిపిస్తోంది.

● రాజకీయ కోణంలో అవాస్తవాలు.

ఒక వాస్తవ సంఘటనను తీసుకొని సంకుచిత రాజకీయ దృష్టితో అవాస్తవాలు చెప్పడం ఈ చిత్రాల ప్రత్యేకత. ప్రతి చారిత్రక సినిమాలోనూ కొంత కాల్పనికత తప్పదు. ఆ కాల్పనికత ఉత్తమ విలువలను, సౌభ్రాతృత్వాన్ని పెంచాలి. బాధితుల పట్ల సానుభూతిని కల్గించాలి. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు, ఆదరిస్తారు. మనదేశంలో అప్పటికీ ఇప్పటికీ జనం ఆదరించే ‘మొఘల్‌ ఎ ఆజం’ను చూడండి. అందులో ప్రేమను భూమికగా ఎంచుకున్నారు. అన్ని భాషల్లోని ఉత్తమ సాహిత్యంలో మనకు ఇలాంటి పాత్రలు కన్పిస్తాయి. ఈ పాత్రలను సృష్టించడం వెనుక ఒక ప్రయోజనం ఉంది. రజాకార్‌ చిత్రం వెనుక చరిత్రను వక్రీకరించే అసత్యాలు కోకొల్లలు. చరిత్రను కనుమరుగుచేసి అభూతకల్పనలను చరిత్రగా చూపించే సామాజిక లక్ష్యం ఇందులో ఇమిడి ఉంది.

● చరిత్ర వక్రీకరించిన ‘రజాకార్‌’కు అవార్డ్.

చరిత్రను వక్రీకరించిన రజాకార్‌ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ చారిత్రక సినిమాగా గద్దర్‌ అవార్డు ప్రకటించింది. భూమి కోసం, వెట్టి చాకిరి, ఫ్యూడల్‌ దుర్మార్గపు వ్యవస్థ నుంచి విముక్తి కోసం హైదరాబాద్‌ రాజ్యంలో 1946 నుంచి 1951 దాకా వీరోచిత సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని ముస్లిం నిజాం పై హిందువులు జరిపిన పోరాటంగా చరిత్రను వక్రీకరించి తీసిన సినిమా ‘రజాకార్‌’. అలాంటి చిత్రాన్ని ఉత్తమ చారిత్రక సినిమాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం యాదృచ్చికంగా జరిగింది కాదు. వీరోచిత తెలంగాణ పోరాటాన్ని వక్రీకరించడమే ఆ ఎంపిక వెనుక ఉన్న లక్ష్యం. దేశంలోని జనాన్ని మత ప్రాతిపదిక పై విడగొట్టి ఉంచడానికి నేడు సినిమాల నిర్మాణం కొనసాగుతోంది. ఆ పరంపరలోనిదే రజాకార్‌. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించలేదు. వందల కోట్లు వెచ్చించి నిర్మించిన సినిమా ‘ఆదిపురుష్‌’ను కూడా భారతీయులు తోసి పుచ్చారు. సినిమాలో చూపినట్లు రజాకార్లు యూనియన్‌ సైన్యం పై తిరగబడలేదు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా నిజాం నవాబులాగే వారూ లొంగిపోయారు. ముస్లింల పట్ల ద్వేషం రెచ్చగొట్టడమే తమ సంకుచిత రాజకీయ లక్ష్యం గనుక వాస్తవ ఘటనలకు మసిబూసి అబద్దాలను జనం ముందుంచారు. నిజాంకు దొరలతో మంచి దోస్తానా ఉండింది. దొరల నుండి విలువైన కానుకలు అందేవి. అందమైన మహిళలను కూడా దొరలు నిజాంకు నజరానాగా బహుకరించేవారు. దొరలు ప్రజలను పశువుల కంటే హీనంగా చూసేవారు. ప్రశ్నించే వారిని చంపేసేవారు. కాంగ్రెస్‌ను వదలి బిజేపిలో చేరిన గూడూరు నారాయణ రెడ్డి రజాకార్‌ చిత్ర నిర్మాత కాగా బిజేపి సీనియర్లు తెరవెనుక నుండి కథ నడిపించారు. సినిమాలో పదే పదే హైదరాబాద్‌కు తుర్కిస్తాన్‌గా మార్చడానికి నిజాం ప్రయత్నిస్తునట్లు చూపారు. మొదటి నిజాం ఇరాన్‌ నుంచి వచ్చినవాడు.

టర్కీతో నిజాం కుటుంబాలకు పెళ్లి సంబంధాలున్నా, టర్కీతో పాలనా సంబంధాలు లేవు. సినిమాలో వాడిన తుర్కిస్తాన్‌ అనే మాట మనకు చరిత్రలో కన్పించదు. నిజాం ఒక దశలో మత మార్పిడులు చేయించాడు. అతనే వాటిని నిలిపేశాడు. కారణం మళ్లీ దొరలే. మతమార్పిడి వల్ల ఇస్లాంను స్వీకరించిన మాల మాదిగలు, ఇతర శూద్రులు వెట్టిచాకిరీని నిరాకరిస్తే మా గతేమిటి..?? మీ అధికారుల గతేమిటి..?? అని దొరల ప్రతినిధి వర్గం నిజాంను కలిసి ప్రశ్నించింది. వెంటనే నిజాం మతమార్పిడులను నిలిపి వేయించాడు. సినిమాలో ఈ విషయం ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. గద్దర్‌ స్ఫూర్తి లేని, చరిత్రను పూర్తిగా వక్రీకరించిన సినిమాకు అవార్డు ఇవ్వటం ద్వారా తెలంగాణా ప్రభుత్వం ఆయన్ను అవమానించిందని పలువురు అభ్యుదయవాదులు విమర్శిస్తున్నారు. ఈ విధంగా గద్దర్‌ పేరిట ఇచ్చిన తొలి సినీ అవార్డులే విమర్శలను ఎదుర్కోవల్సి రావడం విచారకరం.

Post a Comment

0 Comments