Breaking News

Loading..

తూటాలే 'తీర్పు'చెబితే చట్టాలెందుకు..!!


ఖమ్మం, జూన్ 02, బిసిఎం10 న్యూస్.

'చేయాల్సిన పనులు మానేసి, చేయకూడనివి చేయడం మన పోలీసులకు(కొందరికి) కొత్తగా అంటుకున్న రోగం కాదు'. నేరాలను నియంత్రిస్తున్నాం, శాంతిభద్రతలను కాపాడుతున్నామంటూ కొందరు ఖాకీలు చేసే ఆగడాలూ అన్నీ ఇన్నీ కావు. ‘వ్యవస్థీకృత నేరగాళ్ల బృందమైన భారతీయ పోలీసు బలగం క్రైం రికార్డుల దరిదాపుల్లోకి వచ్చే అరాచక ముఠా ఏదీ దేశంలో లేదు’ అని అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆనంద్‌ నారాయణ్‌ ముల్లా ఛీత్కరించారు. దొంగ ఎఫ్‌ఐఆర్‌ను పుట్టించిన పోలీస్‌ అధికారి పై ధర్మాగ్రహంతోనే అరవై ఏళ్ల క్రితం ఆయన అంత కటువైన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టడం, సాక్ష్యాలను సృష్టించడం లాంటి దశలను దాటిపోయి ఏకంగా బూటకపు ఎన్‌కౌంటర్లు చేసే స్థాయికి ఎప్పుడో చేరిన ఖాకీ నేరాలను చూస్తే జస్టిస్‌ ఏఎన్‌ ముల్లా ఏవగింపులో అతిశయోక్తి ఏమీ కనిపించదు. మే 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యలో అస్సాంలో 171 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిలో ఎనభైకి పైగా బూటకమైనవేనంటూ ఒక వ్యాజ్యం దాఖలైంది. దీని పై మొన్న బుధవారం సుప్రీంకోర్టు స్పందిస్తూ ‘ఇన్ని ఎదురుకాల్పుల ఘటనలంటే చాలా చాలా తీవ్ర అంశం’ అంటూ వ్యాఖ్యానించింది. మొత్తం 171 ఎన్‌కౌంటర్ల పై విచారణ జరపమని అస్సాం మానవహక్కుల కమిషన్‌ను ఆదేశించింది. నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కోర్టు ఉత్తర్వులతో ఏడుగురు పోలీసుల పై తాజాగా కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అభివర్ణించినట్లు పోలీసుల కస్టడీలో చిత్రహింసలు, బూటకపు ఎన్‌కౌంటర్లు అనేవి వ్యవస్థాగత వైఫల్యాలు. నేరాలను అదుపు చేయడం చేతకాక, శాస్త్రీయంగా దర్యాప్తు చేసి ముద్దాయిల పై నేరాభియోగాలను నిరూపించే సత్తాలేక పోలీసులే న్యాయనిర్ణేతలై తూటాలతో తీర్పులు చెబుతున్నారు. ఒక నేరాన్ని నియంత్రించడానికంటూ వారే నేరాలు చేస్తున్నారు.

● ప్రాణాలు తీసే అధికారాన్ని ఏ చట్టమూ పోలీసులకు కట్టబెట్టలేదు.

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటాచలయ్య ఏనాడో స్పష్టీకరించినా ‘చట్టాన్ని నిలబెట్టాల్సిన వ్యక్తులు చేసే ఘోరమైన హత్యలే బూటకపు ఎన్‌కౌంటర్లు’ అని న్యాయపాలిక ఆగ్రహం వ్యక్తంచేసినా ఖాకీల తీరు ఏమాత్రం మారట్లేదు. మానవ హక్కుల కమిషన్‌ నివేదికల ప్రకారం, 2012 - 21 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1346 ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయి. చాలా వరకు ఎదురు కాల్పుల కేసుల్లో పోలీసులు చెప్పే కారణాలన్నీ ఆత్మరక్షణ అనే పాయింటు చుట్టూనే తిరుగుతుంటాయి. నిందితులు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ తమ పై దాడిచేశారని, అందుకే కాల్చాల్సి వచ్చిందని ఖాకీలు అమాయకంగా నమ్మబలుకుతుంటారు. హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ సమయంలోనూ వారు అవే మాటలు వల్లెవేశారు. కానీ, అదంతా వట్టి కట్టుకథేనని జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చిచెప్పింది. దానికి బాధ్యులైన మొత్తం పదిమంది పోలీసుల పై హత్యానేరం మోపాలని సిఫార్సు చేసింది. రాజకీయ నాయకులు చెప్పారనో, పై అధికారులు ఆదేశించారనో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తే వదిలిపెట్టేది లేదని సుప్రీంకోర్టు సైతం గతంలో ఒక కేసులో హెచ్చరించింది. నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం, సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టడం మాత్రమే పోలీసుల పని.

● నిందితులకు వారే శిక్ష విధిస్తే ఇక చట్టాలెందుకు.

లఖన్‌ అని ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి హత్యారోపణలతో 1977లో అరెస్టయ్యాడు. స్థానిక జిల్లా కోర్టు అతనికి 1982లో జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి జైలులోనే ఉండిపోయిన లఖన్‌ను నిర్దోషిగా తేలుస్తూ అలహాబాద్‌ హైకోర్టు మొన్న రెండో తేదీన తీర్పిచ్చింది. ముంబయిలో హత్యాచారానికి గురైన ఏపీ యువతి కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ప్రాసిక్యూషన్‌ కథనంలో లోపాలున్నాయని తేల్చిన సుప్రీంకోర్టు అతణ్ని నిర్దోషిగా విడిచిపెట్టింది. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా కోకొల్లలు. తక్షణ న్యాయమంటూ నిందితులను కాల్చిచంపేస్తే, తీరా వాళ్లు అమాయకులని తేలితే పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా..?? తాము నేరగాళ్లుగా భావించిన వారిని కాల్చిపడేసే పోలీసుల విశృంఖలత్వం ప్రజాభద్రతకు చాలా ప్రమాదకరమైంది. తక్షణ న్యాయం పేరిట ఎన్‌కౌంటర్లకు జనం చప్పట్లు కొడితే ఆ హోరులో ఖాకీ తూటాలు ఎవరి గుండెల్లోకైనా దూసుకుపోతాయి. రాజకీయ నాయకులకు ప్రైవేట్‌ సైన్యంగా పనిచేస్తున్న కొందరు పోలీసులు ఆయా నేతల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తుపాకులకు పని చెబితే న్యాయమే చచ్చిపోతుంది.

● దోషులను కచ్చితంగా చట్టప్రకారమే వేగంగా శిక్షించాలి.

కోర్టుల పై పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే చట్టబద్ధమైన పాలనకు అర్థముంటుంది. ప్రజాసంక్షేమం పట్ల బాధ్యత, న్యాయ విధేయత, చట్టబద్ధత, నిజాయతీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ఉండి తీరాల్సిన లక్షణాలివి. పాలకుల్లో, సర్కారీ సిబ్బందిలో అవి కనపడితేనే వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగి, సామాజిక శాంతి నెలకొంటుంది. ఆ నాలుగింటికి సాధ్యమైనంత దూరంగా ఉంటున్న ప్రభుత్వ యంత్రాంగం పెరుగుతున్న నేరాల పై ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు ఎన్‌కౌంటర్ల కథలు అల్లుతోంది. వాటివల్ల నేరాలు అదుపులోకి రావు సరికదా పెత్తందారుల వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, అసమ్మతి స్వరాలను అణచివేయడానికి ఖాకీ తుపాకులు దుర్వినియోగమయ్యే ప్రమాదమెప్పుడూ పొంచి ఉంటుంది. మానవ హక్కులను హరిస్తూ అది అంతిమంగా మన ప్రజాస్వామ్యాన్నే పొట్టనపెట్టుకుంటుంది అన్నది మా వాదన.

Post a Comment

0 Comments