Breaking News

Loading..

పిల్లలే టీచర్లను కొడుతున్న కాలం..!!


ఖమ్మం, మే 18, బిసిఎం10 న్యూస్.

పిల్లలు టీచర్‌ని రాయితో కొట్టటం, చెప్పు తీసి కొట్టడం, కన్నెర్ర చేసి చూడటం, దుర్భాషలు మాట్లాడుతూ మీదకు వచ్చి చెప్పుతో కొట్టడం ఎంత వరకు హర్షించగలం..?? ఉపాధ్యాయులు ఇలాంటి అవమానం ఎలా తట్టుకోగలరు..?? ఆ టీచర్ ఏమి చేసింది అన్న మాట పక్కన పెడితే ఆ అమ్మాయి అంత ఎగ్రెసివ్‌గా మాట్లాడుతూ టీచర్‌ని ఎవర్తివే అంటూ ఘోరంగా మీదికి వచ్చి చెప్పుతో కొట్టటం ఎంత వరకు సబబు..?? ఆ అమ్మాయి చేసిన పనిని మనం ఎలా సమర్ధించగలం..??ప్రపంచంలో ఎక్కడైనా టీచర్ అంటే ఒక గొప్ప గౌరవం అభిమానం ఉండటం సర్వసాధారణం. ఇది గురుకులాల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ, అలవాటు. తొంభైల వరకు వరకూ ఇలాగే ఉండేది. పిల్లలు పెంకితనం చేస్తే మరి రెండు గట్టిగా వేయండి అని తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి ఉండేది. అలాంటి కాలం నుండి పిల్లలు పెంకితనం చేస్తే కొట్టడం పక్కన పెట్టి మందలించటం కూడా ఒప్పుకోని రోజులు వచ్చాయి. గవర్నమెంట్ సైతం పిల్లల్ని కొట్టకూడదు, దండించకూడదు, కనీసం గట్టిగా మందలించ కూడదని జీవో పాస్ చేసింది. పైగా ఇప్పుడు చాలా మంది తల్లితండ్రులు పిల్లల్ని ఒక్క మాటన్నా సహించరు. అలాంటి ఒక కాలం వచ్చిందంటే చదువు చెప్పడం టీచర్లకు ఎంత కష్టమైన పనో ఆలోచించటం కష్టమే. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళని అడిగి చూడండి తెలుస్తుంది.

● అసాధారణ ప్రవర్తన.

టీచర్ మొబైల్ తీసుకుంది, అది తప్పని అనుకుందాం. ఆమె మొబైల్ మొత్తానికే టీచర్ ఉంచుకోదు కదా. నాలుగు మాటలు చెప్పి తిరిగి ఇచ్చేయొచ్చు, ఇవ్వకపోతే ఆ విద్యార్థిని ప్రిన్సిపల్‌కి కంప్లైంట్ చేసి తిరిగి తీసుకోవచ్చు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయికి లేకపోవటం చాలా విచారకరం. నిజానికి నేటి పిల్లల్లో మొబైల్ ఫోన్ ఎడిక్షన్ ద్వారా ఎబ్ నార్మల్ బిహేవియర్‌లు బాగా పెరుగుతున్నాయి. కోపం, అసహనం, ఓపిక లేకపోవడం, ఎవరైనా ఏమైనా వాళ్లకు వ్యతిరేకంగా చెబితే తట్టుకోలేకపోవడం లాంటి అనారోగ్యకరమైన లక్షణాలు ఎక్కువయ్యాయి. ఆ సమయంలో ఆ అమ్మాయి అదే స్థితిలో ఉంది. మొబైల్ కాకుండా ఇంకా ఏదైనా వస్తువు అయితే ఆ అమ్మాయిలో అంతటి దుర్మార్గమైన ధోరణి వచ్చేది కాదు. మొబైల్ విషయానికి వచ్చేసరికి అక్కడ టీచరే కాదు వారి తల్లితండ్రులున్నా పరిస్థితి ఇలానే ఉండేది. మానసిక శాస్త్రవేత్తలు కూడా పిల్లల్లో అలాంటి ప్రవర్తనకు చాలా వరకు మొబైల్ కారణమని చెపుతున్నారు. తాగుబోతుకు సారా దొరక్కపోతే జరిగే పరిస్థితిలా ఉంటుంది మొబైల్ ఎడిక్షన్.

● ఆత్మాభిమానం టీచర్‌కి ఉండదా..??

ఇక టీచర్ విషయానికి వస్తే మనం ఆలోచిస్తూ ఉంటాం, టీచర్ మొబైల్ తీసుకోవడం సరైన పద్ధతి కాదు. కానీ క్లాస్ చెబుతూ ఉన్నప్పుడు స్టూడెంట్ మొబైల్‌లో మాట్లాడం కానీ, మొబైల్‌లో మెసేజ్ చేయటం, మొబైల్ సైలెన్స్ చేయకపోవడం వల్ల టీచర్ చెపుతున్న క్లాస్‌కి ఇబ్బంది అవుతుంది. అలా జరిగితే మొబైల్ తీసుకోవడం తప్పనిసరి. అది చాలా మంది టీచర్లు చేస్తారు, తరువాత మందలించి ఇచ్చేస్తారు ఇది సర్వసాధారణం. ఆగి చూడాలి కదా, ఈ లోగా ఆ అమ్మాయి ఆవేశం కట్టలు తెంచుకుంది. టీచర్ కూడా మనిషే కదా ఆత్మాభిమానం దెబ్బ తింటుంది.

● పిల్లల్లో మొబైల్ వ్యసనం డేంజర్.

అయితే ఇప్పుడు టీచర్లు కూడా కొత్త పాఠాలు నేర్చుకోవాలి, ఈ జనరేషన్ పిల్లలతో టీచర్లు జాగ్రత్తగా మెలగాలి. ఈ మొబైల్ ఎడిక్షన్ పిల్లలు ఏమైనా చేసేస్తారు. అలా అందరు పిల్లలూ ప్రవర్తిస్తూ ఉంటారని అనుకోలేం. కానీ చాలా మంది పిల్లలు మొబైల్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి టీచర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా డీల్ చేయాలి లేకుంటే ఇప్పుడు ఈ టీచర్‌కి జరిగిన అవమానకర దుర్ఘటన చాలా మంది టీచర్లకు జరగొచ్చు.

● మారాల్సింది పెద్దలు.

ఇంట్లో తలిదండ్రులు ఎవరి మొబైల్లో వాళ్ళు తల దూర్చి ప్రపంచాన్ని మరిచిపోవడం ద్వారా పిల్లలు మనకి దూరంగా జరిగి అటు స్కూల్లో టీచర్లకూ ఇంట్లో తలిదండ్రులకూ తల నొప్పిగా మారిపోతున్నారు. దీనివల్ల అనారోగ్యకరమైన ఇల్లు అనారోగ్యకరమైన పిల్లల్ని తయారు చేస్తుంది. ఈ పిల్లలు అనారోగ్యకరమైన సమాజాన్ని సృష్టిస్తారు. ఇదే ఈ అమ్మాయి విషయంలో సమాజం చూసింది. ఎవరికి వారే పిల్లల మన స్తత్వాన్ని బట్టి ప్రణాళిక వేసుకోవాలి. తీర్పులు జారీ చేయకుండా ప్రేమగా సరైన పద్ధతిలో పిల్లల్ని మంచి మార్గం వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేయాలి.

Post a Comment

0 Comments