హైదరాబాద్, మే 30, బిసిఎం10 న్యూస్.
ఇటీవల తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడి రోడ్డు మీద దారుణంగా కొట్టడం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానిస్టేబుల్‌ను కొట్టారుగనుక వారిని అందరి ముందూ కొట్టామని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పుకొచ్చారు. రౌడీషీటర్లను అరెస్టు చేయడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం తప్పు కాదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంపైనా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. అలా చేయడానికి పోలీస్ స్టేషన్లు, విచారించి శిక్షలు వేయడానికి కోర్టులూ ఉన్నాయి. చట్ట ప్రకారం శిక్షించకుండా నేరుగా నడిరోడ్డు పై అదీ ఒకరు కాళ్లు నొక్కిపెడితే మరొకరు కొట్టడం, ఇది కచ్చితంగా చట్ట ఉల్లంఘన, మానవ హక్కుల హననం. అంటే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రవర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టిడిపి, వైసిపి, ఇప్పుడు మరలా టిడిపి ప్రభుత్వం అదే పోలీసులు, అదే పాలన. మరి ఇలాంటి రౌడీషీటర్లు ఎందుకు పుట్టుకొస్తున్నారు, యథేచ్ఛగా ఎందుకు తిరుగుతున్నారు. ఇవే కాదు దోపిడీలు, దొంగతనాలు, నిరంతరం గంజాయి రవాణా ఇష్టారీతిగా సాగిపోతోంది. చిన్నారుల పై అత్యాచారాలు, మహిళలు, విద్యార్థినుల పై దాడులు జరుగుతున్నాయి.
● ఎక్కడో లోపం జరుగుతోంది.
పెద్దపెద్ద దందాలు, సెటిల్‌మెంట్లు చేసేవారు పోలీసులతో కలిసే ఉంటున్నారు, మరి వారందరినీ ఇలాగే కొడుతున్నారా..?? తెనాలిలో కానిస్టేబుల్‌ను కొట్టారనే పేరుతో వారి జులుం ప్రదర్శించారు. ఒకవేళ వారిని శిక్షించాలి అనుకుంటే బహిరంగంగా కొట్టనవసరం లేదు. అంటే పోలీసులు వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేది సుస్పష్టం. పైగా చట్టం వారికి కల్పించిన హక్కులను దుర్వినియోగం చేశారు. కోర్టులను, న్యాయ వ్యవస్థను అపహస్యం చేశారు. షెడ్యూలు, వెనుకబడిన కులాలకు చెందిన వారిని విచక్షణారహితంగా కొట్టడం అంటే పోలీసులను అడిగేవారు ఎవరూ లేరనే ధీమాఅన్నా ఉండాలి. పోలీసులు ఇలా బహిరంగంగా శిక్షించేవారు, ఎక్కువగా రౌడీషీట్లు మోపే వారందరూ దళిత, మైనార్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన వారే అధికంగా ఉంటారు, ఇదొక సామాజిక సమస్య. దీని వెనుక ఒక పరిశోధనాత్మక అధ్యయనమే ఉంది. ఎన్‌కౌంటర్లకు గురయ్యేవారు, జైళ్లలో మగ్గేవారిలో ఎక్కువమంది ఎరుకల, దళిత ఇతర కులాలకు చెందినవారే ఉంటారు.
● ఇది చరిత్ర చెబుతున్న నిజం.
వకుళాభరణం లలిత గారు రచించిన 'మాజీ నేరస్త జాతులు-ఒక పరిశీలన' అనే పుస్తకం చదివితే స్టువార్టుపురం, సీతానగరం వంటి చోట్ల సెటిల్‌మెంట్లు ఎందుకు ఏర్పాటయ్యాయో ఇట్టే అర్థమవుతుంది. ఇటీవల వచ్చిన ‘జై భీమ్’ సినిమాలోనూ తక్కువ కులం వాళ్లనే జైళ్లలో పెట్టడం, నేరాన్ని అంగీకరించాలని కొట్టి చంపడం వంటి చర్యలను మనం చూశాం. అలాగని గంజాయి అమ్మేవారిని, నేరస్తులను సమర్థించాల్సిన అవసరం లేదు, చట్టపరంగా శిక్షించాల్సిందే. పోలీసులు, వారిని నడిపే పాలకుల చుట్టంగా చట్టం ఉండకూడదనేది ఇక్కడ కీలకాంశం. కొన్ని పార్టీల నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి వాటిని సమర్థిస్తూ ఉంటారు. కులాలకూ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దీంతో అసలు సమస్య పక్కకు పోయి ఒక రాజకీయ అంశంగా మారి చివరకు బాధితులకు న్యాయం జరగకపోగా వారే మరింత నేరాలకు పాల్పడిన వారుగా చిత్రీకరించబడతారు, అందుకు తెనాలి ఘటనే ఒక ఉదాహరణ, వాస్తవంగా జరిగింది అదే.

0 Comments