Breaking News

Loading..

బూటకపు ఎన్కౌంటర్ల తో 'నక్సలిజాన్ని అంతం చేయగలరా..!!'


ఖమ్మం, మే 30, బిసిఎం10 న్యూస్.

సిపిఐ ఎంఎల్ మావోయిస్టు అగ్రనేతతో పాటు 26 మందిని కాల్చి చంపిన తర్వాత 'మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు అసాధారణ విజయాన్ని సాధించటం గర్వకారణం' అని మన ప్రధాని మోది అన్నారు. 'భద్రతా దళాలు ఓ మైలురాయి వంటి విజయాన్ని సాధించాయి' అని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతోపాటు మావోయిస్టుల అణచివేతలో ఘన విజయం సాధించిన భద్రతా బలగాలను అమిత్‌ షా అభినందించారు. అంతేగాక 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని మోది సర్కార్ పూర్తిగా అంతం చేస్తుందని కూడా ప్రకటించారు. ఈ విధంగా తేదీలు ప్రకటించి నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించటం రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక హక్కులను కాలరాయడానికి పూనుకోవటం అమానుషం కాదా..?? అలాగే ఎన్కౌంటర్లో దారుణంగా చంపబడిన వారి మృతదేహాలను అప్పగించాలని మృతుల బంధువులు హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం కంటే దారుణం ఏముంటుంది..?? అగ్ర నేతల భౌతికకాయాలను బంధువులకు అప్పగించకుండా ఛత్తీస్‌ఘడ్ పోలీసులే దహనం చేయటం అమానుషం.

● ఆపరేషన్ కగార్ (అంతిమ యుద్ధం).

ఈ పేరుతో మోది ప్రభుత్వం ఇటీవల పదుల సంఖ్యలో బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో భీతావహం సృష్టిస్తున్నది. ఈ స్థితిలో ఎన్కౌంటర్ల హత్యకాండను ఆపి శాంతి చర్చలు జరపటానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టుల నాయకత్వం పదేపదే ప్రకటించింది. మావోయిస్టులతో చర్చలు జరపాలని వివిధ రంగాల ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ఆందోళనలు సాగిస్తున్నారు. అయినా మోది ప్రభుత్వం మే 21న మావోయిస్టుల అగ్ర నాయకులను పెద్ద సంఖ్యలో బూటకపు ఎన్కౌంటర్లో కాల్చిచంపి, విజయ గర్వంతో ప్రకటనలు చేయడం ఫాసిస్టు రాజనీతి కాదా..?? ఇది పైశాచిక ఆనందం కాదా..?? కశ్మీర్లో మన పౌరులను దారుణంగా చంపిన పాకిస్తాన్ పాలకులతో శాంతి చర్చలు జరపగలిగిన పాలకులు మనదేశంలోని మావోయిస్టులతో చర్చలు జరప నిరాకరించి నరమేధాన్ని కొనసాగించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?? మతం పేరుతో ఉగ్రవాదానికి తెరతీస్తున్న వారికంటే తమదైన రాజకీయ విధానంతో సమాజాన్ని మార్చటానికి కృషి చేస్తున్న వారే ప్రభుత్వానికి ప్రథమ శత్రువులుగా ఉన్నారని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.


● ఈ ఎన్కౌంటర్లు వలస పాలన కాలం నుంచి సాగుతున్న రాజ్యపు అణచివేతకు కొనసాగింపు మాత్రమే.

నాడు తమ పరిపాలన కాలంలో మన్యం ప్రాంతంలోని అటవీ సంపదను కారు చౌకగా కొల్లగొట్టడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగా అడవి బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టుతున్న బ్రిటిష్ దొరల పై మన్యం వీరుడు తిరుగుబాటును ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు నాయకత్వాన సాగిన ఈ ప్రజా తిరుగుబాటును అణిచివేయటానికి బ్రిటిష్ దొరలు అన్ని విధాలుగా ప్రయత్నించారు. చివరికి సీతారామరాజును బూటకపు ఎన్కౌంటర్లో దారుణంగా కాల్చిచంపారు. ఆ విధంగా అడవి బిడ్డల ఉద్యమాన్ని అణచాలని చూశారు. కానీ స్వాతంత్య్రానంతరం కూడా మన్యం వీరుడు అల్లూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేటికి అటవీ ప్రాంతాల సంరక్షణ కోసం, ఆదివాసీల హక్కుల కోసం గిరిజన సంఘాల నాయకత్వాన పోరాటాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకొని పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతంలో జోతేదార్ల దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆదివాసీల పోరాటాన్ని అణచాలని ఆనాటి పాలకులు చూశారు. కానీ ఆ పోరాటంలో ఎగసిన నిప్పు కణాలు దేశవ్యాప్తంగా కాంతులు వెదజల్లాయి. ఆ ప్రభావంతోనే శ్రీకాకుళంలో సాగిన గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేయటానికి బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడి అనేకమంది పోరాట యోధులను పాలకులు పొట్టన పెట్టుకున్నారు. పాలకులు కలలుగన్నట్లు ఆ పోరాటాలు ఆగకపోగా అనేక ప్రాంతాలకు విస్తరించి నేటికి కొనసాగుతున్నాయి.

● దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్ల ద్వారా ప్రజా ఉద్యమాలను అణచాలని పాలకులు చూస్తున్నారు.

అయినప్పటికి ఉద్యమాలు నానాటికి విస్తరించడానికి ముఖ్య కారణం పాలకులు తమ దోపిడీ విధానాలను సరికొత్త రూపాలలో కొనసాగించటమే..!! ఇప్పుడు ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు తాము ఎంచుకున్న పంథాలో గిరిజనులను చైతన్యపరచి, పాలకులు అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాలలో భాగంగా అటవీ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ఈ పోరాటాలు మరింత ఉధృత రూపం దాల్చి తమ అధికారాన్ని కూకటి వేళ్లతో పెళ్లగిస్తాయనే భయంతో వెన్నులో వణుకు ప్రారంభం అయ్యింది. దీని ఫలితమే నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి అంతం చేస్తామని ప్రకటించే దుస్థితిలో పాలకులు పడ్డారు.

● పీడిత ప్రజలు దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా సాగించే తిరుగుబాటే నక్సలిజం.

దోపిడీ విధానాలు ఎంతగా పెరిగితే అంతగా ప్రజల్లో తిరుగుబాటు ధోరణులు పెరుగుతాయి. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ప్రారంభించిన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను మరింత దూకుడుగా అన్ని రంగాల్లో అమలుపరచడానికి మోది ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ నూతన ఆర్థిక విధానాలకు పుట్టిన వికృత బిడ్డలే అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులు. ఈ దోపిడీ విధానాల ఫలితంగా సమాజంలో అంతరాలు అందనంత ఎత్తులో పెరుగుతున్నాయి. కోటీశ్వరులు శతకోటీశ్వరులు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంలోకి కూరుకు పోతున్నారు. ఫలితంగా ప్రజలు తమ ప్రాథమిక హక్కుల సాధన కోసం పోరాట బాట పట్టక తప్పటం లేదు. ప్రజలు సాగిస్తున్న పోరాటాలకు ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు నాయకత్వం వహించినట్లు దేశవ్యాప్తంగా అనేక విప్లవ శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలలో వివిధ విప్లవ శక్తుల నాయకత్వాన తమతమ స్థాయిలో రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సాగుతున్నాయి.

మధ్య భారతంలోని అడవుల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి, అంతిమంగా అపారంగా ఉన్న అడవి సంపదను బడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే 'ఆపరేషన్ కగార్‌'ను కేంద్ర పాలకులు చేపట్టారు. మణిపూర్‌లోని అటవీ ప్రాంతంలో విలువైన సహజ వనరులను ఆధిపత్య వర్గాలకు కట్టబెట్టడానికి డబల్ ఇంజన్ సర్కార్ ఆ రాష్ట్రంలో రావణ కాష్టాన్ని రగిలించింది. అదే విధంగా దేశవ్యాప్తంగా నూతన ఆర్థిక విధానాలను అమలుపరచి సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలను కాపాడాలని మోది ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అటవీ ప్రాంతంలో అపారంగా ఉన్న సహజ వనరులను ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టటానికి అడ్డుపడుతున్న 2006 అటవీ చట్టాన్ని మార్చివేసి అటవీ సంరక్షణ నిబంధనలు 2022 చట్టాన్ని పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనల మధ్య అప్రజాసామికంగా ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో పాటు మోది ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాల ఫలితంగా సంభవించే సంక్షోభాలను ఎదుర్కోవటానికి ప్రజలు పోరాట మార్గం చేపట్టక తప్పదు. ఇది ప్రపంచ చరిత్ర నిరూపించిన సత్యం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మోది షా లు చేసే ప్రకటనలు చెత్తబుట్ట పాలుకాక తప్పదు. పాలకులు నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూసినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. నక్సలిజాన్ని అంతం చేయాలంటే అసమానతలు, వివక్ష, దోపిడీ దౌర్జన్యాలు లేని వ్యవస్థలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మార్క్సిస్ట్ మహనీయులు బోధించినట్టు దోపిడీ ఉన్నంత కాలం ప్రజల హక్కుల కోసం పోరాటాలు సాగుతూనే ఉంటాయి. అణిచివేత పెరుగుతున్న కొలదీ తిరుగుబాటు మరింత ఉద్వేగంతో సాగుతుంది, ఇది సమాజ నియమం, నీతి.

Post a Comment

0 Comments