ఖమ్మం, మే 11, బిసిఎం10 న్యూస్.
దేశమంతా 'ఆపరేషన్ సిందూర్' నామ స్మరణ చేస్తూ భారత సైన్యానికి జేజేలు కొడుతుంటే వాటికి దూరంగా, ఈ జేజేలతో సంబంధం లేకుండా ఒక సైన్యం మన పైన రక్షణ వలలా అనుక్షణం పహారా కాస్తూ ఉంది. తనకు తానే నిరంతరం 'పారా హుషార్' అని తట్టుకుంటోంది.
● మనకోసం.. కేవలం మనకోసం..
అదే భారతీయ ఇంటలిజెన్స్ విభాగం అది 'బార్బరీకుడి బాణం'. నిన్నటి ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల పైన ఖచ్ఛితంగా, గురి తప్పకుండా దాడి చేసింది. అది మన క్షిపణుల గొప్పతనం, మరి ఆ క్షిపణులు ఎక్కడ దాడి చేయాలో వాటికి ఎవరు చెప్పారు..?? మన ఇంటి పక్కన ఎవడున్నాడో, ఏం చేస్తున్నాడో అనేదే మనకు తెలియదు. అలాంటిది వందల కిలోమీటర్ల దూరంలో, మనది కాని దేశంలో, ఫలానా చోట ఫలానా ఉగ్రవాది దాక్కున్నాడని మనకు ఎలా తెలుస్తుంది..?? ఉగ్రవాద స్థావరాల ఛాయాచిత్రాలను మాత్రమే ఉపగ్రహాలు అందిస్తాయి. ఉదాహరణకు భారత సరిహద్దుకు 167 కి.మీ దూరంలో ఉన్న బావల్ పూర్ అనే పట్టణంలో ఒక ఇంటిలో మౌలానా మసూద్ అజహర్ ఉన్నాడని ఉపగ్రహం అతని ఫోటోను అందించదు. సరిహద్దుకు 497 కి.మీ దూరంలో ఉన్న మురుద్కే అనే ఊరిలోని ఒక బంగళాలో లష్కరే తోయిబా హెడ్ ఆఫీస్ ఉన్నదని, అందులో ఇంత మంది పని చేస్తున్నారని ఉపగ్రహం చూపదు. అక్కడికి స్వయంగా వెళ్ళి, లేదా అక్కడి స్థానికుల ద్వారా సమాచారం పొందిన తరువాతనే నిర్ధారిస్తారు. ఆ నిర్ధారణ ఎంత ఖచ్చితంగా ఉంటుంది అంటే పొరపాటున అది గనుక సామాన్య పౌరుల ఇల్లు అయితే పాకిస్తాన్ కు అద్భుతమైన ఆయుధం దొరికినట్లే. ఇది మనకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకోసం పని చేసే రహస్య సైన్యం. మనం ఎన్ని సాల్యూట్ లు చేసినా కృతజ్ఞత తీరని త్యాగం.
● 'బార్బరీక బాణం' మీకు తెలుసా.
ఎన్నో రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని కేవలం మూడే మూడు క్షణాలలో మూడే మూడు బాణాలతో ముగించగలిగే సత్తా ఉన్న వీరుడు బార్బరీకుడు, ఇతను ఘటోత్కచుని కొడుకు భీమునికి మనుమడు. ఇతని దగ్గర మూడు బాణాలుంటాయి, అందులో మొదటి బాణం వెళ్ళి ఒకసారి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి వస్తుంది. రెండో బాణం వెళ్ళి ఆ టార్గెట్లు అన్నింటి పైనా మార్క్ చేసి వస్తుంది. మూడో బాణం వెళ్ళి మార్క్ చేసిన ఆ టార్గెట్లను మాత్రమే అంతమొందిస్తుంది. ఇందులో బార్బరీకుడి మొదటి రెండు బాణాలే మన 'ఇంటలిజెన్స్ వ్యవస్థ'. మూడో బాణం మన సైన్యం.
● సందర్భం వచ్చింది కాబట్టి ఈ బార్బరీకుడి పూర్తి కథ తెలుసుకుందాం.
అంతటి శక్తి గల బార్బరీకుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి వస్తే కృష్ణుడు అతని శక్తిని పరీక్షించాలని అనుకుంటాడు. అక్కడ చెట్లు, చేమలు, పరిసరాల్లో ఉన్న పచ్చని ఆకుల మధ్యన ఉన్న ఎండిపోయిన ఆకులన్నింటిని ధ్వంసం చేయమటాడు. మొదటి బాణం వెళ్ళి ఎండుటాకులను గుర్తిస్తుంది. రెండో బాణం వెళ్ళి అన్ని ఎండుటాకుల పైన మార్క్ చేసి కృష్ణుని పాదం వద్దకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. మూడో బాణం ప్రయోగించగానే అది వచ్చి మార్క్ చేయబడిన ఎండుటాకులన్నింటిని ధ్వంసం చేసి కృష్ణుడి పాదం నేలకు ఆనిన చోట ఆ పాదం చుట్టూ గిరగిరా తిరుగుతుంటుంది. అప్పుడు బార్బరీకుడు కృష్ణుడి పాదం కింద ఒక ఎండుటాకు ఉందని చెబుతాడు. కృష్ణుడు కాలును పైకి లేపగానే ఆ ఆకును ధ్వంసం చేస్తుంది. మరి బార్బరీకుడిని పాండవ సైన్యం ఉపయోగించుకోవచ్చు కదా. బార్బరీకుడికి ఒక ఖచ్ఛితమైన నియమం ఉంటుంది అది ఏమిటంటే అతను ఎవరైతే యుద్ధంలో ఓడిపోయే దశలో ఉన్నారో వారి తరఫున మాత్రమే యుద్ధం చేస్తాడు. కృష్ణుడికి తెలుసు పాండవుల చేతిలో కౌరవులు ఓడిపోతారని. అప్పుడు బార్బరీకుడు కౌరవుల తరఫున యుద్ధం చేస్తే పాండవులు ఓడిపోతారు. అందుకని బార్బరీకుడిని తలను ఇమ్మని అడుగుతాడు కృష్ణుడు. తాను యుద్ధాన్ని చూడడానికి వచ్చానని, చనిపోతే ఎలా చూడగలను అని అడిగితే కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షించే శక్తిని ఆ తలకు ఇస్తానని చెబుతాడు శ్రీకృష్ణుడు, తల ఇస్తాడు బార్బరీకుడు. ఆ తలను కొండ పైన పెడతాడు కృష్ణుడు. అలా మొత్తం కురుక్సేత్ర యుద్ధానికి సాక్ష్యంగా నిలుస్తుంది బార్బరీకుడి తల, ఇది కథ.
0 Comments