దేశానికి మంచిదా..?? కాదా..??
ఖమ్మం, మే 11, బిసిఎం10 న్యూస్.
భారత్, పాకిస్తాన్ మధ్య రష్యా, ఉక్రెయిన్‌ల మాదిరిగా ఎడతెగని యుద్ధం జరుగుతుందని ఆశపడిన వారి నోట్లో పాక్ పేలని డ్రోన్ పడినట్లు అయింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి అమెరికా సాయంతో కాల్పుల వివరణ ప్రతిపాదన చేసింది, దానికి భారత్ అంగీకరించింది. అయితే అలా అంగీకరించాల్సిన అవసరం ఏముందని పాకిస్తాన్ ను నామ రూపాల్లేకుండా చేయాల్సిందని కొంత మంది వాదనలు ప్రారంభించారు. అసలు వాస్తవ పరిస్థితులేమిటి అనేది కనీస మాత్రం తెలిసినా ఇలా మాట్లాడరు. ఏ బాధ్యతలు లేని వాళ్లు, భవిష్యత్ పై ఎలాంటి ఆశలు లేని వాళ్లు మాత్రమే ఇలాంటి వాదనలు చేస్తారు. అలాంటి వాళ్లే కాస్త ఎక్కువగా కనిపిస్తున్నారు.
● తమది ఉగ్ర దేశమని అంగీకరించిన పాకిస్తాన్.
భారత్, పాకిస్తాన్ మధ్య వారం రోజులకు పైగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల చాలా నష్టం జరిగింది. భారత్ యుద్ధం చేసేది ఉగ్రవాదంపైనే. పాకిస్తాన్ సరిహద్దుల్లో, పాకిస్తాన్ భూభాగంలో పాక్ ఆర్మీ సాయంతో నక్కిన ఉగ్రవాదుల్ని వారి క్యాంపుల పై మాత్రమే యుద్ధం చేసింది. ఉగ్రవాదులకు మద్దతుగా రంగంలోకి దిగాలని పాకిస్తాన్ అనుకుంది కాబట్టే పోరాటం ప్రారంభమయింది. పాకిస్తాన్ తీరును అంతర్జాతీయంగా భారత్ ఎండగట్టింది. ఉగ్రవాదాన్ని చైనా కూడా సమర్థించబోమని చెప్పింది. అంటే పాకిస్తాన్ కు అందరూ వ్యతిరేకం అయ్యారు. భారత్ తో ఉండే పోటీ, మత పరమైన కారణాల వల్ల తుర్కియే, చైనా వంటి దేశాలు పాకిస్తాన్ కు మద్దతు పలికి ఉండవచ్చు. కానీ మిగతా ప్రపంచం అంతా పాకిస్తాన్ ఉగ్రదేశమన్న నిర్ణయానికి వచ్చింది.
● భారత్ చేసేది పాక్ పై యుద్ధం కాదు టెర్రరిజంపై.
దేశాల మధ్య వచ్చే ఎలాంటి సమస్యలను అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని శాంతికాముకులు కోరుకుంటారు. ఎవరూ మరో దేశానికి తగ్గాల్సిన పని లేదు, ఎవరి పని వారు చేసుకుంటే చాలు. మరో దేశం విషయంలో జోక్యం చేసుకోకపోతే చాలు. కాని కొన్ని దేశాల విపరీత ప్రవర్తన కారణంగా ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. పాకిస్తాన్ పాలకులు ప్రజల్ని భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో భారత్ పట్ల వారికి అంత ద్వేషం లేదు. ఇప్పుడు ఉగ్రవాదదాడితో బాధిత దేశంగా ఉన్న భారత్ పైనే నిందలు వేసి మళ్లీ రెచ్చగొట్టాలనుకున్నారు. కానీ ప్రజల నుంచి స్పందన రాలేదు, అక్కడి ప్రజలు నేరుగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. టెర్రరిస్టు నేతల్ని చంపినా అక్కడి ప్రజల్లో సానుభూతి రాలేదు.
● జోలికోస్తే సహించేది లేదని భారత్ సందేశాలు.
భారత్ శాంతి కాముక దేశం, ఉద్దేశపూర్వకంగా ఎవరి జోలికి వెళ్లదు. 1971లో అయినా కార్గిల్ వార్ సమయంలో అయినా పాకిస్తాన్ పిచ్చి చేష్టల వల్లనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పట్లో పరిమిత వనరులతోనే లక్షల మంది పాక్ సైన్యాన్ని బందీలుగా చేసుకున్నారు. యుద్ధం అంటూ జరిగితే భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం ఎలాంటిదైనా వినాశనమే, అందులో విజేతలు సాంకేతికంగా ఉంటారు, కానీ యుద్ధం చేసిన వారంతా నష్టపోతారు. దానికి తాజా సాక్ష్యం రష్యా, ఉక్రెయిన్ మాత్రమే. లక్షల మంది సైన్యాన్ని ఈ రెండు దేశాలు కోల్పోయాయి. పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బందులు పేట్టారు. ఉక్రెయిన్ దాదాపుగా నాశనం అయిపోయింది. రష్యా పెద్ద ఎత్తున సైనిక, ఆర్థిక నష్టాలను చవి చూసింది. ఇప్పటికి అనుకున్న విజయాన్ని పొందలేకపోయింది. రేపు రష్యా విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవచ్చు. కానీ జరిగిన నష్టాన్ని మాత్రం ఎప్పటికీ భర్తీ చేసుకోలేదు. సగటు భారతీయునిగా అలాంటి విజేతగా భారత్ ఉండాలని కోరుకోలేం. పాకిస్తాన్ ఖచ్చితంగా పాపిస్తాన్, ఆ విషయంలో మరో డౌట్ లేదు. ఆ దేశంలో సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు, ఆ దేశాన్ని బలహీనం చేయాలి, అది కూడా మనకు నష్టం జరగకుండా ఆ దిశగా ఈ కాల్పుల విరమణ తొలి విజయం అనుకోవచ్చు.
0 Comments