*శ్రీరామనవమికి భద్రాచలం వస్తున్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు..
భద్రాచలం అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలి
సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

బిసిఎం10 న్యూస్ భద్రాచలం : పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం ముంపు సమస్యపై కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని,ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కేంద్రంతో,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జే రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీరామనవమికి భద్రాచలం విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరియు కేంద్ర బిజెపి మంత్రులు భద్రాచలం పట్టణ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. నిరాహార దీక్షను లైన్స్ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రామలింగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజె రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భద్రాచలం పట్ల కక్షపూరిత ధోరణితో ఉన్నదని, గత 10 ఏండ్ల క్రితం పోలవరం ప్రాజెక్టు పేరుతో భద్రాచలం నియోజకవర్గం లోని 4 మండలాలను ఆంధ్రలో కలిపి తీవ్ర అన్యాయం చేసిందని, నేడు భద్రాచలం పట్టణాన్ని పోలవరంలో ముంచేందుకు పోలవరం ఎత్తు పెంచి నిర్మాణం చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చి, నిధులు కేటాయించడం దారుణమని అన్నారు. భద్రాచలం పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం ముంపు పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రీ సర్వే చేసి నిర్దిష్ట అంచనా వేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో కలిపిన 5 పంచాయతీలను తెలంగాణలో కలపడానికి కృషి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని,ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తోనూ చర్చించేందుకు సత్వరమే కార్యాచరణ ప్రకటించాలని అన్నారు.
రామాలయం అభివృద్ధితోపాటు భద్రాచలం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, కరకట్ట ఇరువైపులా ఎత్తు పెంచి పొడిగించేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో అంచనాలు వేసి కావలసిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సుభాష్ నగర్ కాలనీ వైపు కరకట్ట పొడిగింపు నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని అన్నారు.నాలుగు రాష్ట్రాలకు కేంద్రంగా భద్రాచలం పట్టణంలో ఉన్న ఏరియా హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ గా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం రాముని జపం చేస్తున్న బిజెపి ప్రభుత్వం దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచలం పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు. భద్రాచలం రామాలయాన్ని రామాయణం సర్క్యూట్ లో చేర్చాలని, భద్రాచలం కు రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, యు జ్యోతి, ఎస్ డి ఫిరోజ్, జీవనజ్యోతి, చాట్ల శ్రీనివాస్, ఎస్ భూపేంద్ర, కోరాడ శ్రీనివాస్, దనకొండ రాఘవయ్య, కుంజ శ్రీనివాస్, చుక్క మాధవరావు, శాఖ కార్యదర్శులు సీత, కాకా రమణ, పుణ్యవతి, జి నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
0 Comments