హైదరాబాద్, ఏప్రిల్ 08, బిసిఎం10 న్యూస్.
'అప్పు పుట్టింది బిడ్డా, అంటే కొంప మునిగింది కొడుకా' అన్నట్టుగా ఉంది దేశ ఆర్థిక పరిస్థితి. మొన్న ఉగాది పండగన కేంద్ర ప్రభుత్వానికి రాశి ఫలితాలు ఎవరు చెప్పినట్టు లేరు. కానీ, కాస్త ఆలస్యంగా నైనా ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలను బయట పెట్టింది. ప్రభుత్వ పాలన అప్పుల మీదే నడుస్తున్నదని, ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని పంచాంగ కర్త ఏఐ ‘గ్రోక్’ స్పష్టం చేసింది. మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు అక్షరాలా రూ 3.8 లక్షలు. చారు తాగినంత సేపట్లో ‘చారు వాలా’ సర్కార్ ఏకంగా రూ 2.28 కోట్ల అప్పు చేస్తుంది. క్షణ క్షణానికి అప్పుల ఊబిలోకి దించేస్తూ ‘అప్పుల భారతం’గా దేశాన్ని మార్చేస్తుంది. 2014 మార్చి 31 నాటికి దేశ అప్పులు రూ 55.87 లక్షల కోట్లు ఉంటే, నేడు అది కాస్త రూ 185 లక్షల కోట్లకు చేరింది. 65 ఏండ్లలో దేశం చేసిన అప్పులతో పోల్చితే కేవలం పదేండ్లలోనే ట్రిపుల్ అప్పులు చేసిన ప్రధాని గా మోడీ ఘనత వహించారు. ఒక్కొక్కరి నెత్తిన రూ 1.27 లక్షల అప్పును పెట్టిందీ మోడీ సర్కార్. ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ‘డబులింజన్ సర్కార్’ దారుణంగా చతికిలబడినట్టు స్పష్టం చేసింది ఏఐ. దేశ అప్పులను మూడింతలు, తలసరి అప్పును రెండున్నర రెట్లు పెంచింది ‘ట్రిపుల్ ఫెయిల్యూర్ సర్కార్’. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’. ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు, పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే, ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగ్ ఆక్షేపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి చేస్తున్న అప్పులు కొండలా పెరిగిపోయాయి. అర్జెంటుగా అప్పులు తగ్గించాలని కాగే వాయించాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ జిడిపి లో 40 శాతం వరకు అప్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. అదే రాష్ట్రాలు అయితే 20 శాతానికి లోబడి మాత్రమే అప్పులు చేయాల్సి ఉంటుంది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తూనే రాష్ట్రాలను మాత్రం అప్పులు చేయవద్దని సుద్దులు చెబుతుంటే, ఆ ‘శ్రీరంగ నీతులు’ ఏ రాష్ట్రం పట్టించుకుంటుంది..?? ఉచితాలు, సబ్సిడీలు, ఇతర రాయితీలు, నగదు బదిలీ పథకాలు రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేయడం వారి రెండు నాలుకల ధోరణికి నిదర్శనం.
మీ రాష్ట్రం ఎంత అప్పు చేసింది..??
కార్పొరేషన్లు ఎంత మేరకు రుణాలు తెచ్చాయి..??
అప్పుల/పై కడుతున్న వడ్డీ ఎంత..??
ఏటా ఎంత చెల్లిస్తున్నారు..??
పీడీ ఖాతాలు ఎన్ని..??
వాటి లావాదేవీల వివరాలు ఏమిటి..??
ఖజానా నుంచి కార్పొరేషన్ల ఎస్క్రో ఖాతాలకు మళ్లించిన నిధుల వివరాలేవి..??
కార్పొరేషన్లకు బడ్జెట్లో గ్రాంట్ ఇన్‌ఎయిడ్ పేరుతో ఇస్తున్న నిధులెన్ని..??
కేంద్ర పథకాల నిధులను, స్థానిక సంస్థల గ్రాంట్లను పీడీ ఖాతాలకు మళ్లించడం నిజమా..??
ఎన్నివేల కోట్లను మళ్లించారు..??
ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అడిగిన ప్రశ్నలు. ఇప్పుడు అవే ప్రశ్నలు కేంద్రాన్ని అడగాల్సిన పరిస్థితి. కేంద్రం చేసిన అప్పుల నిధులను ఉత్పత్తి రంగాలు, అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసినట్లయితే దేశంలో ఎకనమిక్ యాక్టివిటీ జరిగి ఉండేది. రాష్ట్రాలు సైతం ఆర్ధికంగా నిలదొక్కుకునేవి. కానీ అలా చేయకుండా అనుత్పాదక రంగాల పైన లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం మూలంగా అభివృద్ధి లేకుండా, ఎకనమిక్ యాక్టివిటీ లేక, సంక్షేమ రంగాలు, సేవా రంగాలపైన కూడా ఖర్చు చేయకపోవడంతో ప్రజల కొనుగోలుశక్తి పూర్తిగా పడిపోయింది. ఈ దివాలకోరుతనానికి కారకులెవరు..?? పోనీ ఇన్ని లక్షలకోట్లు అప్పులు చేసినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు, కనీసం వారు చెప్పిన ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలైనా ఇచ్చిందా అంటే అదీ లేదు, దేశంలో పెరిగిందల్లా అసమానతలే. సామాన్యుడు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు బతకడానికి అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఇదీ టూకీగా మన దేశం పరిస్థితి. ఇంకా మన ప్రధాని మోడీ మన దేశం విశ్వగురు కాబోతోందని, ప్రపంచంలో అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి మన ఎకానమీ ఎగబాకనుందని పేర్కొంటారు. మీ చెప్పులో కాళ్లు పెట్టే రాష్ట్రాలు సైతం బిలియన్ డాలర్ ఎకానమీ అని, ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని ఈ ‘కల్లబల్లి’ మాటలు ఇంకా ఎంత కాలం చెబుతారు..?? ఇంకా నల్లధనం వెలికి తీసి జనం ఖాతాల్లో రూ 15 లక్షలు వేస్తామని చెప్పిన ముచ్చటనే ఆయన ప్రతి మాటలో గుర్తుకు వస్తుంటుంది. వట్టి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు దేశ ప్రజలు లేరు మోడిజి ఏమి చెప్పినా నిజమా, అబద్దమా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు జాగ్రత్త.

0 Comments