ఖమ్మం, మార్చి31, బిసిఎం10.
ఉగాది ప్రసాద శ్లోకం 'శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం'. ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.
'శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ, సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥'
వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై, సర్వారిష్టాలూ తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం. ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది. 'అబ్దాదౌ నింబకుసుమం, శర్కరామ్ల ఘృతైర్యుతమ్, భక్షితం పూర్వయామేస్యా, తద్వర్షం సౌఖ్యదాయకమ్॥'.
ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.
శ్రీ విశ్వా వసు నామ ఉగాది ఆచరణ..
'తైలాభ్యంగన స్నానం'
ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వుల నూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయాత్ పూర్వం కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి.
'నూతన వస్త్ర ధారణ'
స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టు కోవాలి. కుదరకపోతే ఉతికిన సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. ఆడా మగ ఎవరైనా సరే షార్టులు - చడ్డీలు ధరించి దేవుడి ముందు కూర్చోవద్దు.
'దేవతార్చన'
నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి బ్రహ్మ దేవుడి ప్రార్థన సంవత్సరాది స్తోత్రం ప్రార్ధన చేయాలి.
'బ్రహ్మ స్తుతి'
ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే.! నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే..!! నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే...!!!
'సంవత్సరాది స్తోత్రం'
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహం.! అజారూడం చతుర్హస్తం ద్వి శీర్షం ప్లవ సంజ్ఞకం..!!
'పంచాంగం పూజ'
శ్రీ విశ్వా వసు నామ పంచాంగాన్ని పూజించాలి. 'నింబ కుసుమ భక్షణం' పూజా మందిరంలో ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి కింది శ్లోకం చదువుకుంటూ ప్రాసన చేయాలి. ఉగాది పూజా విధానం పైన ధర్మ సూక్ష్మ సహితమైన చాగంటి వారి ప్రవచనం. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ ౹ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ౹౹
'దానం'
పితృ దేవతల ఆశీస్సుల కోసం ఉగాది రోజున చల్లని నీటి పాత్రను దానం చేయాలి. అలాగే తెల్లని వస్త్రాలు, గొడుగు, విసనకర్ర, చెప్పులు కూడా అవకాశం ఉన్నవారు ఇవ్వవచ్చు.
'పంచాంగ శ్రవణం'
సాయంత్రం ఇంటిల్లిపాది అందరూ కలిసి దగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం చేసి తమ రాశి ఫలాలను తెలుసుకొని పంచాంగ శ్రవణం చేయించిన పండితులవారి ఆశీసులు తీసుకోవాలి.
'చైత్ర మాసం విశిష్టత'
'ఋతూనాం కుసుమాకరా' అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం, సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు. ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది. అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు, అకారణంగా అలగడం, అవీ ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’. ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చేసరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60 ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం మొదటి 60 ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60 ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
'పురాణ గాథ'
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60 మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు, అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. 'ఉగాది పండుగ' కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే, ఆనందమే. ఇట్టి పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు దండుగలే అవుతాయి. పిండివంటలూ, మధురపదార్ధాలూ తిని, రజస్తమోగుణాలు నింపుకోవడం తప్ప - సాత్త్విక ప్రవృత్తి లభించదు. కనుకనే మనపూర్వులు ప్రతిపండుగకూ ఒక అధిష్ఠానదైవం, పూజ, నియమాలూ, ఆహార విశేషాలూ ఏర్పాటు చేసినారు. పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యమూ ఇహపర ఆనందదాయకమే అవుతుంది.
ఉగాది ప్రత్యేకించి - ఇతర వ్రతాలూ, పండుగల వలె ఏదో వొక దేవతను ఉద్దేశించి చేసేది కాదు. ఆనంతమైన కాలాన్ని - మన సౌలభ్యగణనం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి, సంవత్సరాదినాడు కాలాన్ని మన ఇష్ట దైవస్వరూపంగానూ, సకల దేవతా స్వరూపం గానూ భావించి, సంవత్సరకాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఆయా సమయాల్లో దైవానుగ్రహ ప్రాప్తికై చేయాల్సిన సాధనాలను సిద్ధపరచుకొనే ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళికకు పూర్వరంగం ఏర్పరచుకోవడం ఉగాది విశిష్టత. కాలగణనంలో ఒకప్పుడు మార్గశిరంతోనూ, వైశాఖంతోనూ, కార్తికంతోనూ, ఆశ్వయుజంతోనూ ఇలా అనేకవిధాలుగా సంవత్సరం ప్రారంభమైన విశేషాలు మనవాఙ్మయంలో కన్పిస్తున్నాయి. అట్లే యుగ ప్రారంభ తిథి విషయంలోనూ కల్ప, మన్వంతరాది భేదాన్నిబట్టి తేడాలున్నాయి. నక్షత్రాలను కూడా యుగాది నక్షత్రాలుగా పేర్కొన్నారు. వరహమిహిరాచార్యుని నిర్ణయాన్నిబట్టి, మనం చాంద్రమానం రీత్యా చైత్రమాసాన్నే సంవత్సరారంభంగా భావించి, చైత్ర శుక్ల ప్రతిపత్తు (పాడ్యమి) నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించినాడన్న శాస్త్రవాక్కును ప్రమాణంగా గైకొని, దీన్నే ''యుగాది''గా గణించి, ఉగాది పండుగను ఆచరిస్తున్నాము. ప్రతి దేశంలోనివారూ, రాష్ట్రంలోనివారూ ఏదోవొక కాలగణనంతో ఉగాది పండుగను తమ సంప్రదాయం ప్రకారం జరుపుకొంటూనే ఉన్నారు. ఆచరించే విధానంలో తేడా వున్నా ఆశయంలో, ఆనందంలో మాత్రం తేడాలేదు. తెలుగు వారే కాక, కర్ణాటకులు, మహారాష్ట్రులు, చాంద్రమానాన్ని అనుసరించే మాళవీయులు మున్నగు వారునూ ఉగాది పండుగను చైత్ర శుక్ల పాడ్యమినాడే ఆచరిస్తున్నారు. మనం జీవిస్తున్న ఈసృష్టి జరిగిన రోజును పండుగగా మనం పుట్టినరోజును పండుగగా జరుపుకొంటున్నట్లుగా భావించి, ఈ ఉగాది పండుగను ఆనందంతో సంవత్సరంలో తొలిపండుగగా జరుపు కొంటున్నాము. జరుపుకోవాలి కూడా. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న రోజునే (చైత్రశుక్ల పాడ్యమి) ఈ పండుగను ఆచరించాలి. 'చైత్రేమాసి' జగద్ర్బహ్మా ససర్జ ప్రథమేసహని 'శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి' అని హేమాద్రి నిర్ణయం కనుక చైత్రశుద్ధపాడ్యమి సంవత్సరాది, ఉదయానికి పాడ్యమి ఉండాలి. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధపాడ్యమి, సూర్యోదయవేళ ఈ సృష్టిని సమగ్రంగా చేసినాడు. అందుకు కృతజ్ఞతాసూచకంగా, జ్ఞాపక చిహ్నంగా యుగాది పండుగ జరుపుకొంటున్నాము. చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉపవాస ముండి, బ్రహ్మను పూజించినవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు. ఒకవేళ చైత్రం అధికమాసంగా వస్తే, అధికమాస ప్రారంభంనాడే ఉగాది జరుపుకోవాలి, అంతేకాని నిజచైత్రారంభంలో కాదు.

0 Comments