ఖమ్మం, ఫిబ్రవరి 12, బిసిఎం10 న్యూస్.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికి హిందుత్వ శక్తులు ఎట్లా వేరు వేరు సంఘటనల్లో విష, విద్వేష రాజకీయాలు చేస్తున్నాయో చూడండి. సంఘ్ పరివార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో విస్తరించడానికి, సమాజాన్ని చీల్చి తమ పబ్బం గడుపుకోవడానికి, ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి వీలైన అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. వారి సిద్ధాంతకర్త గోల్వాల్కర్ ప్రవచనం ప్రకారం ప్రధాన శత్రువులైన ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల మీద దాడులు చేయడానికి సాకులు వెతుకుతున్నారు. వారి పట్ల విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని గోతికాడి నక్కలా ఎదురుచూస్తున్నారు. నిజమైన కారణాలేమీ లేకపోయినా, ఏదో ఒక అబద్ధం సృష్టించి, ప్రచారం చేసి తమ కార్యకర్తలలో ఆవేశాలు ప్రేరేపిస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియా ప్రభావంలో ఉన్నారు గనుక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంఘ్ పరివార్ కార్యాలయాలలో ఐటి సెల్స్ ఏర్పాటు చేసి, డజన్ల కొద్దీ ఉద్యోగులను నియమించి, సోషల్ మీడియాలో అబద్ధాలు రాయిస్తున్నారు. భిన్నాభిప్రాయాలున్న వారి మీద ద్వేషం రెచ్చగొడుతూ భౌతిక దాడులకు పురికొల్పుతున్నారు.
ఈ కార్యక్రమాలు దేశమంతా, రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో కాలంగా సాగుతున్నప్పటికి, ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గత రెండు మూడు సంవత్సరాలలో, ఎన్నికల సందర్భంలో పెచ్చు పెరిగాయి. క్రమక్రమంగా వాతావరణాన్ని, అమాయకుల మనుషులను విష కలుషితం చేస్తున్నాయి. ఇలా సామాజిక వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తున్న ఉదంతాలు, సామాజిక జీవితంలో బహిరంగంగా, మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ ఉదంతాలు ఒక్కొక్కటి వాటికవిగా చూస్తే చిన్నవిగా, పట్టించుకోనవసరం లేనివిగా కనబడవచ్చు. కాని వీటిలో ప్రతి ఒక్కటి సంఘ్ పరివార్ విశాలమైన సామాజిక విభజన కుట్రలో భాగమైనవి. అందువల్ల ఈ ఘటనలన్నిటి మధ్య సంబంధాన్నీ, వాటి వెనుక సంఘ్ పరివార్ కుట్రను అర్ధం చేసుకుని ప్రతిఘటించవలసి ఉంది.
హైదరాబాద్ బుక్ ఫేర్ చివరి రోజున వీక్షణం స్టాల్లో ఉద్దేశపూర్వకంగా వాదన పెట్టుకుని, దాన్ని మొత్తం రికార్డ్ చేసి, వెంటనే సోషల్ మీడియాలో పెట్టి, వాళ్ల ఐటీ సెల్ ఉద్యోగులతో వైరల్ అయ్యేలా చూసారు. ఏ పుస్తకం అమ్మడం పట్ల ఆ వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారో, ఆ పుస్తకం అప్పటికి వారం రోజుల ముందే బుక్ ఫేర్లోనే ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తక ప్రచురణకర్తకు కూడా బుక్ ఫేర్ ఒక స్టాల్ ఉంది. ఆ పుస్తకం బుక్ఫేర్లో కనీసం ఇరవై స్టాల్స్ లో అమ్మకం జరుగుతుంది. అయినా చివరి రోజున, ప్రత్యేకంగా ఎంచుకుని, వీక్షణం స్టాల్ కు వచ్చి, అది కూడా వీక్షణం సంపాదకుడు అక్కడ ఉంటాడని కచ్చితంగా తెలిసిన సమయంలో వచ్చి, ఆయనతో వాదన పెట్టుకోవాలని దురుద్దేశంతో, ప్రణాళిక ప్రకారం జరిగిన పని అది. వాదన మొదటి నుంచే రికార్డ్ చేయడం మొదలు పెట్టారంటే ఈ వీడియోను వైరల్ చేసి, ప్రగతిశీల భావాల మీద విద్వేషం రెచ్చగొట్టే దురుద్దేశం ఉందనేది స్పష్టమే. వాదన తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని వందలాది మంది హిందుత్వ వాదుల ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వేదికల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ చేశారు. అలా షేర్ చేసిన ప్రతి చోటా కింద వ్యాఖ్యలలో 'కొట్టండి, తన్నండి, అక్కడే కొట్టవలసింది, ఫోన్ చేసి చూసుకోండి, చంపండి, పెట్రోల్ పోసి తగులబెట్టండి' అని హంతక, నేరపూరిత దాడి మొదలై రోజుల తరబడి సాగింది.
ముప్పై ఏళ్ల కింద ఇంగ్లిష్ లో వెలువడిన, ఇప్పటికే అనేక భాషల్లోకి అనువాదమైన ఒక చరిత్ర పరిశోధన గ్రంథం మీద అభ్యంతరాలు చెప్పడం నామమాత్రమే. ఈ సాకుతో వీక్షణం సంపాదకుడి మీద దాడి చేయడం, తద్వారా మొత్తంగా ప్రగతిశీల భావాల మీద దాడి చేయడం, విష ప్రచారం చేసి, సమాజాన్ని చీల్చడం సంఘ్ పరివార్ లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగానే ఈ బుక్ఫేర్లోనే మరి ఇద్దరు రచయితల మీద కూడా దాడి మొదలయింది, లేదా తీవ్రతరమయింది. 2023 జూలైలో మధ్యప్రదేశ్ లో ఒక ఆదివాసి యువకుడి పై మూత్రం పోసిన భారతీయ జనతా పార్టీ నాయకుడి గురించి వార్తలు అప్పట్లో సంచలనమయ్యాయి. మనిషి మీద మనిషి ఉచ్చపోయడానికి అవకాశం ఇచ్చే మనువాదం మీద భావుకులుగా, సున్నిత మనస్కులుగా ఎందరో కవులు స్పందించారు. అటువంటి కవితా స్పందనలను సంకలనం చేసిన సంపాదకులు మెర్సీ మార్గరెట్ ఆ సంకలనానికి 'ఉచ్ఛల జలధి తరంగ' అని శీర్షిక పెట్టారు. చెరబండరాజు వందేమాతరం, రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం వంటి శీర్షికలు పరిచయం ఉన్న తెలుగు సాహిత్య లోకంలో ఈ శీర్షిక ఆశ్చర్యకరమైనదీ అభ్యంతరకరమైనదీ కాదు. కాని కుహనా దేశభక్తి, జాతీయగీతం పట్ల కుహనా గౌరవం పెట్టుబడిగా విష రాజకీయాలు నడిపే సంఘ్ పరివార్ శక్తులు, కొందరు సాహిత్య కారులు ఈ శీర్షికను తప్పు పడుతూ, మెర్సీ మార్గరెట్ పట్ల అవమానకరంగా, అభ్యంతరకరంగా, నీచంగా ట్రోలింగ్ దాడి సాగించారు.
అలాగే ఈ దేశంలో ఇంకా కొనసాగుతున్న మనుషుల మలాన్ని చేతులతో ఎత్తిపోసే వృత్తి గురించి బాషాసింగ్ రాసిన పరిశోధనాత్మక గ్రంథాన్ని సామాజిక కార్యకర్త కె సజయ అనువదించి దానికి 'అశుద్ధ భారత్' అని శీర్షిక పెట్టారు. రెండు మూడేళ్ల కింద వెలువడి ఎంతగానో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ పుస్తకం శీర్షిక దేశాన్ని అవమానించేదిగా ఉందనే తప్పుడు వాదనతో సంఘ్ పరివార్ శక్తులు ఇటీవల సజయ మీద దాడి ప్రారంభించారు. మనిషి మీద మనిషి ఉచ్చపోయడాన్ని ఆమోదించే, మనిషి మలమూత్రాలను మరొక మనిషి చేతులతో ఎత్తిపోయడాన్ని ఆమోదించే అసమాన మనుధర్మం గురించి సంఘ్ పరివార్ కు ప్రశ్నే లేదు. ఆ అసమానతను ఎత్తి చూపడం మాత్రం దేశ ద్రోహం, దేశానికి, జాతీయగీతానికి అవమానం అని రంకెలు వేస్తారు. నిజానికి వాళ్ళ దృష్టిలో ఉన్నది దేశం కాదు, దేశం పట్ల ప్రేమా కాదు, సమాజంలో ఆలోచనను, ప్రశ్నను, భిన్నాభిప్రాయాన్ని లేకుండా చేయాలనేది వాళ్ళ కోరిక.
అసలు ఆ పుస్తకాల్లో ఏమి ఉన్నదో చదవాలని, చర్చించాలని, తప్పు ఉంటే సవరించమని సంభాషణ జరపాలని సంఘ్ పరివార్ కు తెలియదు. ఆలోచనా, ప్రశ్నా మాత్రమే కాదు, అసలు చదువే వద్దనే దగ్గరికి వాళ్ళ ప్రయాణం. అందుకే బుక్ ఫేర్ మీద హిందుత్వ శక్తుల యూట్యూబ్ చానల్ ఒకటి చేసిన వీడియోలో బుక్ ఫేర్ కు వెళ్ళకండి అని పిలుపు ఇచ్చారు. అక్కడి పుస్తకాలలో 95 శాతం హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక పుస్తకాలే ఉన్నాయి అని పచ్చి అబద్ధం ప్రకటించారు. శూడ్రులకు చదువే వద్దు అన్న మనుధర్మ వారసులుగా, వాళ్ళు అటువంటి భావాలు ప్రచారం చేయడం ఆశ్చర్యం కాదు. కాని రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హిందుత్వ వాదులు తమ అబద్ద ప్రచారాలతో దళితులను, శూద్ర, ఉత్పత్తి, బహుజన కులాల వారిని ఆకర్షిస్తుండడమే, బోల్తా కొట్టిస్తుండడమే ఆశ్చర్యం.
రెండు తెలుగు రాష్ట్రాలలో గత ఒకటి రెండు సంవత్సరాలలో హిందుత్వ వాదులు చేసిన విష ప్రచారాలు, లేవదీసిన ఘర్షణల జాబితాలో కొన్ని ఇక్కడ చూద్దాం.
● 2023 జనవరిలో నిజామాబాద్ జిల్లా కోటగిరి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మల్లికార్జున్ వినాయక చవితి చందా ఇవ్వలేదనే కోపంతో దాడి చేసి కొట్టారు. పిల్లలకు దేవుడు లేడని పాఠాలు చెపుతున్నాడని, సరస్వతిని నిందించాడని సాకులు సృష్టించారు. ఊరేగింపుగా తీసుకువెళ్లి క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేశారు.
● 2024 జనవరిలో సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ లో శ్రీరామాలయ ఉత్సవ కమిటి ఊరేగింపు మీద ఎవరో చెప్పు విసిరారని సాకుతో ఘర్షణలు సృష్టించి ఒక ముస్లిం పళ్ల దుకాణం వ్యాపారి కుటుంబం మీద దాడి చేసారు. ఆయన దుకాణాన్ని తగులబెట్టి జీవనోపాధి కొల్లగొట్టారు. అదే జిల్లా మోర్గి లో కాషాయ ధ్వజాన్ని అవమానించాడనే సాకుతో ఒక ముస్లిం యువకుడిని నగ్నంగా ఊరేగించి, చిత్రహింసలు పెట్టారు.
● 2024 ఫిబ్రవరిలో రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఒక రోడ్డు నిర్మాణం విషయంలో తగాదాను సాకుగా చేసుకొని మెథడిస్ట్ చర్చ్ మీద దాడి చేసి విధ్వంసం చేసి, క్రైస్తవులను గాయపరిచారు.
● 2024 జూన్లో మెదక్ లోని ఒక మదరసాలో బక్రీద్ పండుగ ఏర్పాట్లు జరుగుతుండగా సంఘ్ పరివార్ మూక దాడిచేసి ముస్లింల మీద రాళ్లు విసిరి ఘర్షణ ప్రారంభించింది. ఆ దాడిలో గాయపడిన ముస్లింలను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకు పోగా, సంఘ్ పరివార్ మూక ఆ ఆస్పత్రి మీద కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించింది.
● 2024 సెప్టెంబర్ లో ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్లో ఒక ఆదివాసి మహిళ మీద ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడనే కారణంతో మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు, మసీదు మీద దాడి చేశారు.
● 2024 అక్టోబర్ లో సికిందరాబాద్ లోని ముత్యాలమ్మ గుడిని ఎవరో అపవిత్రం చేశారనే సాకుతో మత ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నించారు.
● 2024 డిసెంబర్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్, దళిత ఉపాధ్యాయుడు పి రాములు అయ్యప్ప దీక్షలో ఉన్న ఎనిమిదో తరగతి విద్యార్థిని కాలితో తన్నాడనే అబద్దపు ఆరోపణ పై సంఘ్ పరివార్ మూక, అయ్యప్ప భక్తులు పాఠశాలకు వచ్చి హెడ్ మాస్టర్ ను కొట్టారు. దుస్తులు చించివేశారు, ఆయన చేత విద్యార్థి కాళ్లు పట్టించి క్షమాపణ చెప్పించారు.
● ఆంధ్రప్రదేశ్ లో కూడా సంఘ్ పరివార్ ఆగడాలు మితిమీరి సాగుతున్నాయి.
పాలక కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి కావడం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందుత్వ వాదులను మించిన హిందుత్వవాదిగా ప్రవర్తిస్తుండడం సంఘ్ పరివార్ కు కలిసి వచ్చింది.
● మచిలీపట్నంలో మసీదు మీద దాడి చేసి ఖురాన్ దహనం చేశారు.
● స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకుడు. దళితులను అభ్యంతరకరమైన భాషలో అవమానించాడు.
● తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పుడు ఉపముఖ్యమంత్రి వీరంగం వేసి తాను నిర్ద్వంద్వమైన సనాతనవాదినని బహిరంగంగా చెప్పుకున్నాడు. గన్నవరం దగ్గర జరిపిన హైందవ శంఖారావం సభకు రాష్ట్రమంతటి నుంచీ లక్షలాది మందిని తరలించి అక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చారు.
ఇలా చెపుతూ పోతే రెండు రాష్ట్రాలలోనూ సంఘ్ పరివార్ చొరబడడానికి కారణాలకోసం వెతుకులాడుతున్నదని అర్థమవుతుంది. ఇక్కడ తప్పనిసరిగా గుర్తించవలసిన అంశమేమంటే ఇటువంటి ప్రతి వివాదంలోనో ఈ హిందుత్వ వాదులు ఏ సంబంధమూ లేని జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు ఇస్తున్నారు. తద్వారా అమాయక భక్తులను, మత విశ్వాసులను, నిజమైన దేశభక్తులను తమ విష రాజకీయ వ్యూహంలోకి లాగదలచుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో మారణాయుధాల వాడకం గురించి కూడా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో సరైన దర్యాప్తు జరిపి, నిజమైన నేరస్తులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం న్యాయస్థానాలలో ప్రవేశపెట్టవలసిన పోలీసులు, అధికార యంత్రాంగం ఆ పని చేయకపోగా, బాధితుల మీదనే ఆంక్షలు విధించడం, బాధితుల మీద లేదా ఇరు పక్షాల మీద కేసులు పెట్టడం, నేరస్తులకు రక్షణ కల్పించడం, జరిగిన ఘటన గురించి నిజాలు ప్రచారం కాకుండా ఇంటర్నెట్ సౌకర్యం తొలగించడం సాగిస్తున్నారు. సంఘ్ పరివార్ అబద్ధాల వాట్సప్ ఫ్యాక్టరిలలో పచ్చి అబద్ధాల ప్రచారం ఇబ్బడి ముబ్బడిగా సాగిపోతుండగా, నిజాల ప్రచారానికి మాత్రం ఆటంకాలు కల్పిస్తున్నారు. మన సమాజంలోని బహుళత్వాన్ని, సహజీవనాన్ని రద్దు చేసి మనుధర్మపు ఏకతను, హిందూ బ్రాహ్మణీయ కుటిలాచారాలను స్థాపించడమే, మనుధర్మపు అమలు కోసం అధికారం చేపట్టడమే సంఘ్ పరివార్ చేయదలచుకున్న పని, సమాజంలో విషం నింపడమే, సమాజాన్ని విధ్వంసం చేయడమే హిందుత్వ వాదుల పని.
సమాజంలో ప్రతి ఒక్కరు ఈ ప్రమాదాన్ని గుర్తించి లేచి నిలిచి ప్రతిఘటించినప్పుడు మాత్రమే ఆ ప్రమాదం తొలగిపోతుంది. సమాజంలో ఆ ప్రతిఘటనా చైతన్యాన్ని కలిగించడం బుద్ధిజీవుల బాధ్యత.


0 Comments