భద్రాచలం, ఫిబ్రవరి 02, బిసిఎం10 న్యూస్.
ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల అండర్ 19 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి, మిగతా టీం సభ్యులకు ముందుగా బిసిఎం10 న్యూస్ అభినందనలు. టోర్నమెంట్ మొదటి నుండి చివరివరకు అద్భుతంగా ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన త్రిష 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డ్ గెలుచుకుంది.
ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన 19 ఏళ్ల త్రిష జనవరి 28న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్ జట్టుని సెమీ ఫైనల్స్ కి తీసుకెళ్లింది. త్రిష చేసిన సెంచరీ మహిళల అండర్ 19 ట్20 ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటిది. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ ఐన త్రిష ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు కూడా తీసింది. తన సెంచరీని కేవలం 53 బంతుల్లోనే బాదిపడేసింది. మొత్తం 59 బంతుల్లో 110 పరుగులు చేసింది ఈ తెలంగాణ భద్రాద్రి బిడ్డ. జనవరి 31న జరిగిన సెమీ ఫైనల్స్ లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కి చేరింది. ఈ మ్యాచ్ లో కూడా త్రిష తన బ్యాట్ తో మంచి ప్రదర్శన చేసింది. ఇంక ఇవాళ జరిగిన ఫైనల్స్ లో బ్యాట్ తో 44 రన్స్, బాల్ తో 3/15 ఆల్ రౌండ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. అంతకు మునుపు ఆసియా కప్ మ్యాచెస్ లోనూ, 2023 సీనియర్స్ ప్రపంచ కప్ టోర్నమెంట్ లోనూ ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఐతే చిత్రమేమంటే బలమైన షాట్స్ తో ఎంతో దూకుడైన బాటింగ్ తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్ చేసే ఈ యంగ్ ఆల్ రౌండర్ ని గతేడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కనీస ధర ఐన 10 లక్షల కి కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.
త్రిష తండ్రి ఒక జిం ట్రెయినర్, త్రిష కెరీర్ కోసం వారి కుటుంబం మొత్తం భద్రాచలం నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. త్రిష అనేక ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకున్నది. ముఖ్యంగా తన కోసం తండ్రి పడ్డ కష్టాల గురించి చెప్పింది. వరల్డ్ కప్ లో త్రిష సెంచరీ చేసినప్పుడు ఆమె తండ్రి రాంరెడ్డి కూడా ప్రేక్షకుల్లో వుండి తన కుమార్తె ఘనతని స్వయంగా వీక్షించారు. తాను సాధించిన 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ' అవార్డుని తన తండ్రికే అంకితమిచ్చింది.

0 Comments