● కానరాని ద్రవ్యోల్బణం అదుపు.
ఖమ్మం, ఫిబ్రవరి 03, బిసిఎం10 న్యూస్.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైపైన చూస్తే పాక్షికంగానైనా మధ్యతరగతి జీవులను ఆకర్షించేదిగా కనిపిస్తుంది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదవ సారి. ఈ బడ్జెట్ ఉపన్యాసంలో 12 లక్షల వరకు ఆదాయపన్ను ఉండదు అన్న ప్రతిపాదన బాగా హైలట్ అయ్యింది. ఈ ప్రతిపాదన అంతో ఇంతో ఆదాయపు పన్ను కడుతున్న మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు, వ్యాపార వర్గాలను సంతృప్తి పరిచే అవకాశం ఉంది, వాళ్లు కోరుకునేది కూడా ఇదే. అయితే, అటు ఆర్థికమంత్రి ఇటు వేతన జీవులు తరచూ దృష్టిసారించని మరో కీలకాంశం ఉంది, అదే ద్రవ్యోల్బణం. గత మూడు సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం అదుపు తప్పే ఉంది. ఈ కాలంలో ప్రత్యేకించి, గత ఐదు ఆరేళ్లలో నిత్య అవసర వస్తువుల ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఇది ప్రతి కుటుంబానికి అనుభవంలో ఉన్న విషయమే. అదే సందర్భంలో స్వాతంత్య్రానంతరం నిజవేతనాలు దశాబ్దానికి పైగా స్తబ్దతకు లోనవడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్తబ్దతకు లోనైన వేతనాలు నేపథ్యంలో ఆదాయ పన్ను రాయితీ వల్ల కలిగే నిజమైన ప్రయోజనం, ఊరట నామమాత్రమే. వీళ్ల డబ్బులకు విలువ ఉండాలంటే ద్రవ్యోల్బణంలో ధరలు పెరగకూడదు, రూపాయి విలువ పడిపోకూడదు. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తే రూపాయి విలువ పతనం శాశ్వత ధోరణిగా కనిపిస్తోంది. రూపాయి విలువ పడిపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ఖరీదు పెరుగుతుంది. అది కూడా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుంది. అంతిమంగా సార్వత్రిక ద్రవ్యోల్బణం పెరుగుదుల, వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణతగా ఆర్థిక వ్యవస్థలో స్థిరీకరణించబడుతోంది. ఈ సాంకేతికత పక్కన పెడితే పెరిగే ధరల భారం కారణంగా ప్రజల చేతుల్లో మిగులు నిల్వలు కరిగిపోతాయి, తరిగిపోతాయి. దాంతో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేద్దామనుకుంటున్న కంపెనీల లాభాల రేటు కూడా పడిపోతుంది. లాభాల రేటు పడిపోయే సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టి అదనపు ఉత్పత్తి సామర్ధ్యాన్ని నెలకొల్పే ప్రయత్నాలు ముందుకు సాగవు. ఫలితంగా ఉత్పాదక సామర్ధ్యం మందగిస్తుంది. అంతిమంగా ఈ పరిణామాలన్నీ చక్రీయ సంక్షోభానికి దారితీస్తాయి. ఈ కోణంలో చూసినప్పుడు బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్ధిక వ్యూహం, ద్రవ్య వ్యూహం, పెట్టుబడుల వ్యూహం చక్రీయ సంక్షోభాన్ని తీవ్రతరం చేసేదిగా ఉందే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల వినియోగ శక్తిని గట్టెక్కించే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ దిశగా ఈ బడ్జెట్ ఆశాజనక వాతావరణాన్ని కల్పించటంలో విఫలమైందని చెప్పవచ్చు.
● వేతనాల విషయానికి వస్తే రెండు మూడు కోణాల్లో ఈ సమస్యను మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ రంగంలో పరిశ్రమల స్థాపన ఎప్పుడో ఆగిపోయింది. ఉన్న ఉద్యోగాల్లోనే రకరకాల పేర్లుతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, టైం స్కేల్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతి ప్రభుత్వరంగ సంస్థలోనూ, ప్రభుత్వ విభాగంలోనూ 80 శాతం వరకూ ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. పైగా వీళ్లందరిని నేరుగా సదరు ప్రభుత్వరంగ సంస్థ నియమించుకోవడానికి బదులు మధ్యలో ఓ ఏజెంట్ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. కంపెలు ఇచ్చే జీతంలో ఓ భాగం ఈ ఏజెంట్ల పరం అవుతుంది. దాంతో అరకొర జీతాల్లో కూడా కార్మికుల చేతికి దక్కుతున్నది చాలా తక్కువ. ఈ వ్యవస్థను సంస్కరించకుండా ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేయకుండా అసంఘటిత రంగం ద్వారా పని చేసే కార్మికులు ఆ కొద్దిపాటి వేతనాలైనా నేరుగా అందుకునేందుకు అవకాశాలు కనిపించటం లేదు. ప్రభుత్వం గత ముప్పై ఏళ్లల్లో ఎన్ని బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ఈ కోణం పై దృష్టిసారించనే లేదు. దాంతో కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కులు, రిటైర్మంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు, రాయితీలు అసలు చర్చకే రావటం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమిస్తామని హామీ ఇస్తోంది. వేతన సంఘాలు ప్రభుత్వ రంగంలో పని చేసే శాశ్వత ఉద్యోగులకు సంబంధించిన వేతన విధానాన్ని మాత్రమే నిర్ధారిస్తాయి. ఓ రకంగా చూసినప్పుడు వేతన సంఘం నిర్దేశించే సగటు వేతనం ఆయా శ్లాబుల్లో పని చేసే కార్మికులకు ఓ బెంచ్ మార్కుగా పనికొస్తుందే తప్ప సూటిగా కార్మికుల వేతనాల పై సానుకూల ప్రభావం చూపించే అవకశాలు లేవు. ఇది ఓ రకంగా రైతాంగానికి ఇచ్చే కనీస మద్దతు ధర లాంటిదే తప్ప అవసరమైన మద్దతు ధర కాదు. గత ఐదేళ్లల్లో కనీస వేతనాల సవరణ నామమాత్రంగానే మారింది. సవరించిన ఆ కనీస వేతనాలు కూడా అమల్లో లేవు. మరీ ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే కనీస వేతనాలు అమలు కావటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అసంఘటితరంగంలో పని చేస్తున్న శ్రమ శక్తికి సంబంధించిన వెసులుబాట్లు ఏమి ఈ బడ్జెట్‌లో ప్రకటించలేదు.
● ఇక మూడో అంశం వేతన సంఘం వలన కలిగే ప్రయోజనాలతోపాటు వచ్చే ఇబ్బందులకు సంబంధించినది. వేతన సంఘం నియమించి ఆ వేతన సంఘం నివేదిక ఖరారు చేసిన ప్రతిసారి ధరలు పెరిగిన దాఖలాలున్నాయి. సవరించకపోవటం ఈ సమస్యలో రెండో కోణం. ఈ పరిణామం రెండు రకాలుగా వేతన జీవులనూ, యావత్ ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తుంది. వేతన సంఘం అందించే సిఫార్సుల ఆధారంగా వేతనాలు నిర్ణయం జరుగుతుంది. దాంతో పాటే ధరలు కూడా పెరుగుతాయి. కాకపోతే వేతన సంఘం సిఫార్సులు దేశ జనాభాలో ఏ పదిశాతానికో వర్తిస్తాయి, కాని దాని పర్యవసానంగా పెరిగే ధరలు మాత్రం వంద శాతం జనాభా ఆదాయ వ్యయాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఈ కోణంలో చూసినప్పుడు వేతన సంఘం జనాభాలో కొంతమందికి మేలు చేస్తే మొత్తం జనాభాను ధరాఘాతానికి గురి చేస్తుంది. ఈ చర్యలు అంతిమంగా సగటు ప్రజల కొనుగోలు శక్తిని మరింత తగ్గిస్తాయే తప్ప పెంచేవి కావు. దీని తార్కిక ముగింపుగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత స్తబ్దతకు లోనవుతుందే తప్ప కోలుకునే దిశగా ప్రయాణం సాగించటం కష్టం.
పెరుగుతున్న లాభాలకూ, తరుగుతున్న వేతనాలకు మధ్య ఉన్న పీటముడిని విప్పటంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా చొరవ చూపించిన పరిస్థితులేమీ లేవు. బడ్జెట్‌లో సదరు ప్రతిపాదనలు కూడా ఏమీ లేవు. దేశంలో సగటు కార్మికుడి వేతనం, సగటు పెట్టుబడిదారుడి లాభం విలోమానుపాతంలో ముందుకు సాగుతున్నాయి. అంటే పెట్టుబడిదారుల లాభాలు పెరిగే కొద్దీ కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా మారుతున్నాయి. గతంలో వివిధ కార్మిక చట్టాల రూపంలో పెరుగుతున్న లాభాల్లో ఎంతో కొంత ప్రతిఫలం కార్మికుడికి కూడా దక్కేలా ఉండేవి. కానీ ఇప్పుడు కార్మిక చట్టాలు దోపిడీ రేటును పెంచేందుకు సాధనాలుగా మారుతున్నాయి. కార్మికుల వేతనాలు, కొనుగోలు శక్తి పెంచేందుకు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా వమ్ము చేస్తున్నాయి. ఇటువంటి నూతన కార్మికచట్టాలను ఈ ఏడాది ఏప్రిల్ నుండీ అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
● ఇక నిరుద్యోగ సమస్య.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదాయపు పన్ను రాయితీల ద్వారా ప్రయోజనం పొందాలంటే ముందు నెలసరి నికరంగా ఎంతో కొంత ఆదాయ వనరు ఉండాలి. అటువంటి నికర ఆదాయ వనరుకు ఏకైక మార్గం ఉపాధి. భారత ఆర్థిక వ్యవస్థ అనే రైలు ఉపాధి రహిత అభివృద్ధి పట్టాలెక్కి వందేభారత్ కన్నా వేగంగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆదాయపు పన్ను రాయితీల వలన ఎంత మందికి ఎంత మోతాదులో ప్రయోజనం కలుగుతందన్నది ప్రశ్నార్థకమే. ఈ కలిగిన చిరు ప్రయోజనం కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సరిపోయినంత ఇంధనాన్ని సమకూరుస్తుందా లేదా అన్నది అనుమానమే. ఏతావాతా ఈ రాయితీలు గ్రామీణ కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకూ, నిరుద్యోగులకూ, గిగ్ కార్మికులకూ కలిగే ప్రయోజనం ఏమీ లేదు. గిగ్ ఉద్యోగాల తీవ్రత దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సైన్యానికి, ఆ నిరుద్యోగ సైన్యం సాధారణ శ్రమ అమ్ముకునే స్థితి నుండి నాలుగు మెట్లు కిందకు దిగైనా సరే శ్రమ అమ్ముకోవడానికి సిద్ధపడే పరిస్థితికి నిదర్శనం తప్ప, ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థ లక్షణం కాదు.
● రిజర్వేషన్లు అమలు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వరంగ సమస్థల మూత, కోత, ప్రైవేటీకరణ వంటి చర్యలు ఉధృతం కావటం అంటే ఆయా రంగాలు, సంస్థలు, కంపెనీల్లో అమల్లో ఉన్న రిజర్వేషన్లను కాటికి పంపటమే. ఈ రకంగా ప్రైవేటీకరణ అన్నది బిజెపికి రెండు లక్ష్యాలు సాధించి పెడుతోంది. ఒకటి ఒకప్పటి సామాజికంగా అంటరాని తరగతులను ఇప్పుడు ఆర్థికంగా అంటరాని తరగతులుగా మార్చటం. కార్మిక జీవితాలకు భధ్రత కల్పించేందుకు కావల్సిన నిధులు వెచ్చించే పని లేకుండా చేయటం ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారులకు లాభాల రేటు పెంచే గ్యారంటీ ఇవ్వటం రెండో లక్ష్యం. ఈ విధానాల కారణంగా దేశంలో సాధారణ ప్రజల పరిస్థితులు మరింత దిగజారనున్నాయి. ఉపాధి కరువు, వేతన కొరత, జీవన భారం, లాభాల కోరలు, వెరసి బతుకు భారం కానుంది. ఈ పరిస్థితుల్లో పేదలంతా ఎదురుతిరిగితే దేశ రాజకీయ వాతావరణం శ్రీలంక తరహా పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు.

0 Comments