ఇది 'విద్యా'వ్యవస్థకు సిగ్గుచేటు..!!
ఖమ్మం, ఆక్టోబర్ 04, బిసిఎం10 న్యూస్.
చదువులతో, ఆటపాటలతో అలసిపోయే పిల్లలకు దాహం వేయడం సహజం. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడమూ తప్పనిసరి. కానీ, మన బడుల్లో దుర్భర పరిస్థితుల మూలంగా ముఖ్యంగా ఆడపిల్లలు నిత్యం నరకం చవిచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా మరుగుదొడ్లు ఉండడం లేదు. ఉన్నవాటిలోనూ అధికభాగం శిథిలావస్థకు చేరినయే. సరైన నిర్వహణ కొరవడి కొన్ని భరించలేని దుర్గంధం వెదజల్లుతున్నాయి. తలుపులు దెబ్బతినడంతో టాయిలెట్లకు పట్టాలు అడ్డుపెట్టుకోవాల్సిన దుస్థితి మరికొన్ని చోట్ల. అందుబాటులో ఉన్న ఒకటి రెండు మరుగుదొడ్ల ముందు విద్యార్థులు బారులుతీరే దృశ్యాలు తరచూ కనపడుతుంటాయి. 'దాంతో గొంతెండుతున్నా గుక్కెడు నీరు తాగడానికి బాలికలు జంకుతున్నారు'. గంటల కొద్దీ అలాగే కూర్చుంటూ అనారోగ్యం బారిన పడుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే దేశీయంగా దాదాపు 98 శాతం ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో అమ్మాయిలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు సమాచారమివ్వడం దిగ్భ్రాంతపరుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం గతంలో 'స్వచ్ఛ విద్యాలయ్' కార్యక్రమాన్ని పట్టాలకెక్కించింది. అందులో భాగంగా 2.61 లక్షల బడుల్లో 4.17 లక్షల టాయిలెట్లు నిర్మితమైనట్లు అధికారగణం ఘనంగా సెలవిస్తోంది. ఆ లెక్కల్లోని లొసుగులను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక లోగడే తూర్పారబట్టింది. 15 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట్ల ‘కాగ్’ పరిశీలిస్తే డెభ్భైశాతం మరుగుదొడ్లలో నీటి వసతి లేదని తేలింది. చాలా వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరి కొన్ని కేవలం దస్త్రాల్లోనే పనిచేస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో ఆరోగ్యంగా ఎదగాల్సిన చిన్నారులు ఎంతటి దుర్భరావస్థలను ఎదుర్కొంటున్నారో మాటల్లో చెప్పలేం. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ, అస్సాం, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశాల్లో బాలికలకు సరైన టాయిలెట్ వసతి లేని బడులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల కొత్త మరుగుదొడ్ల నిర్మాణం మొదలు పెట్టినా బిల్లులు రాక కాంట్రాక్టర్లు మధ్యలోనే చేతులెత్తేస్తున్నారు. కొన్నిచోట్ల చిన్నారులే చీపుర్లు చేతపట్టి మరుగుదొడ్లను శుభ్రం చేసుకోవాల్సి వస్తోందంటే మన విద్యావ్యవస్థకు అంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది..??
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలకూ పటిష్ఠ భవనం, సరిపడా సిబ్బంది, గ్రంథాలయం, తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా సామగ్రి వంటివి ఉండి తీరాలి. ఈ వసతులకు నోచుకోని బడులు మన దేశంలో అనేకం. పాఠశాలల్లో పిల్లల అగచాట్ల పై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ప్రతి బడిలో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయి స్థితిగతులను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మరుగుదొడ్ల కొరతతో ఎంతోమంది అమ్మాయిలు అర్ధాంతరంగా బడికి దూరమవుతున్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకొంటే యూరినల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు తలెత్తుతాయి. చెప్పుకోలేని ఇబ్బందితో సతమతమవుతూ చదువు పై దృష్టిపెట్టడమూ సాధ్యం కాదు. విద్యార్థినుల ఉజ్జ్వల భవిష్యత్తుకు ఇది శరాఘాతమవుతుంది. దీన్ని నివారించాలంటే అన్ని బడుల్లో అవసరమైనన్ని మరుగుదొడ్లు నిర్మించాలి. నిరంతర నీటి సరఫరాతో అవి సక్రమంగా పనిచేసేలా చూడాలి. ఆ మేరకు ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన కదిలితేనే ఆడపిల్లల మౌన వేదన తీరేది అన్నది మా వాదన.

0 Comments