● ముక్క లేనిదే ముద్ద దిగదా.
● అదెంత నాణ్యమైందో గమనించారా..??
● అపరిశుభ్రంగా చికెన్, మాంసం అమ్మకాలు.
● ఆసుపత్రి బెడ్ పై ప్రజారోగ్యం.
ఖమ్మం, నవంబర్ 17, బిసిఎం10 న్యూస్.
ఆదివారం తెలవారగానే చేతిలో సంచితో మాంసాహార దుకాణాల వైపు కాళ్లు వడివడిగా అడుగులు పడతాయి. జిహ్వచాపల్యం జివ్వున లాగుతోంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆదివారం దాదాపుగా మాంసాహరం తినని వారు అరుదు. ఎక్కువగా ప్రజలు చికెన్ కొనుగోలు చేయటానికే ఆసక్తి చూపుతారు. అయితే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో చికెన్, మాంసం దుకాణాలు ఎలా ఉన్నాయి. నిబంధనలు అమలు అవుతున్నాయా. అంటే లేదనే సమాధానం వస్తుంది. మన ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన శాఖలు ఒకరి పై ఒకరు నెపం నెట్టుకునే జపం వదలకపోవడంతో ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది.
● నాణ్యమైన చికెన్ ను కొంటున్నామా.
ఖమ్మం పట్టణ, పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా చికెన్ దుకాణాలు వెలుస్తున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇవి రెండింతలయ్యాయి. పలు చికెన్ దుకాణాల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అపరిశుభ్రవాతావరంణంలో దుకాణాలు ఉంటాయి. బాగా నిల్వ ఉండి, వాసన వస్తున్నా ఈగలు విపరీతంగా ముసురుకుంటున్నా అమ్మకాలు సాగించేస్తారు, ఆదివారం, పండుగ తదితర రోజుల్లో ప్రజల రద్దీ దృష్ట్యా రెండు, మూడు రోజుల కిందట కోసిన చికెన్ ను తాజా చికెన్‌తో కలిపి అమ్మకాలు కొనసాగిస్తాన్నారు. ఈ దుకాణాల్లో మార్కెట్ ధర కంటే తక్కువగా అందిస్తుండటంతో ఎక్కువ మంది ప్రజలు ఆయా దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఎటు చూసినా కల్తీ మాంస విక్రయం యథేచ్ఛగా కొనసాగుతోంది. అపరిశుభ్ర వాతావరణంలో పెరుగుతున్న కోళ్లు, మేకల్ని వధించి వాటినే అమ్ముతున్నారు. అవి కొని తెచ్చుకుని తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పట్టణంలో మాంసం విక్రయాలకు ఓ పద్ధతి లేకపోవడం వల్ల ఎవరికి వారుగా దుకాణాలు తెరిచి మాంసం విక్రయిస్తున్నారు. పట్టణ సైతం వీధుల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నారు. పలువురు వ్యాపారులు అత్యాశకు పోయి నాసిరకం, కల్తీ మాంసం విక్రయిస్తున్నారు. అనారోగ్యానికి గురైన గొర్రెలు, మేకలు, చనిపోయిన జీవాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు.
● మాంసం దుకాణాల్లో ఇలా చేస్తున్నారా.
జంతువులను ముందు రోజున జంతు వైద్యుడి ముందు (యాంటే మార్టమ్) ప్రవేశపెట్టాలి. సాయంత్రం ఐదు గంటల నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా ఉపవాసం ఉంచాలి. ఆయన ధ్రువీకరించిన వాటినే తరువాత రోజున వధించాలి. కోసిన తర్వాత మాంసం పరీక్షించి మళ్లీ ధ్రువీ కరిస్తారు. జంతువుల భాగాల్లో ఇన్‌ఫెక్షన్/కంతుల వంటివి ఉంటే వాటిని తొలగిస్తారు. మాంసాన్ని కడిగి, కట్ చేసినప్పుడు మనుషుల స్వేద గ్రంథుల ద్వారా కూడా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిల్వ మాంసం ఉంటే బద్దెపురుగులు, క్షయ, హైడాటిడో సిస్, అంత్రాక్స్ వంటి రోగాల బారినా పడే ప్రమాదం ఉంది. కాని ఇలా చేస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది. రోడ్ల పక్కన, ఇళ్ల మధ్యలో జంతువుల మాంసం అమ్మాకాలు నిరంతరంగా కొనసాగుతునే ఉంటాయి.
● చట్టం ఏం చెబుతుంది.
దేశంలో 1954లో ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్) 2006ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నాణ్యతా ప్రమాణాలు లేని సామగ్రిని ఆహారంలో వాడరాదు. కల్తీ చేసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడం, విక్రయించడం, పంపిణీ చేయడం వంటివి చేయరాదు. ఇలా చట్టం బలంగా ఉన్నప్పటికి పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది కొరత, అధికారుల అవినీతి తదితర కారణాలతో యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.
ఇకనైనా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం పట్టణ, పరిసర ప్రాంతాల్లో పుట్టా గొడుగుల్ల వెలసిన మాంసం విక్రయాల పై దాడులు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


0 Comments