Breaking News

Loading..

అంధకారమవుతున్న బాలల భవితవ్యం..!!


● పొలాల్లో వాడిపోతున్న పసిమొగ్గలు.

● ఎనిమి - పదెండ్లకె స్కూళ్ల నుంచి పంట పొలాల్లోకి.

● రూ 200 కోసం కూలీలుగా గిరిజన పిల్లలు.

● అందులో రూ 50 రవాణా చార్జీలకు.

● పిల్లల భవితను కబళిస్తున్న పేదరికం.

● నిస్సహాయులుగా అధికారులు.

● సాగుదారులకు కలిసి వస్తున్న గిరిజనుల పేదరికం.

ఖమ్మం, అక్టోబర్ 21, బిసిఎం10 న్యూస్.

'రెండేండ్ల క్రితం నేను స్కూల్‌కు వెళ్లేదాన్ని, యేటా రెండు నెలలు మాత్రమే పనికి వచ్చేదాన్ని కానీ, మా నాన్న అనారోగ్యంతో మంచం పట్టాడు. నన్ను మొత్తం పనికే రమ్మని అమ్మ చెప్పింది. ఇంటికి కొంత డబ్బు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది’ పత్తి చేనులో పని ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న సుమారు 10-12 ఏండ్ల ఓ బాలిక చెప్పిన మాటలివి.

‘నేను నా పిల్లలను స్కూల్‌కు పంపించాలనే అనుకున్నా కానీ, ఆ ప్రభుత్వ హైస్కూల్‌ లో నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. పిల్లలను స్కూల్‌కు పంపినా నేర్చుకునేది పెద్దగా ఏమీ ఉండదు. పనికి తీసుకు వచ్చిందే మంచిదని అనుకున్నా’ పిల్లలను తన వెంట చేనులో పనికి తీసుకువచ్చిన ఓ తండ్రి అభిప్రాయమిది.

మన దేశంలో ధాన్యం, పత్తి ఉత్పత్తి దారుల్లో అగ్రశ్రేణిలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడ లక్షల హెక్టార్లలో వీటిని సాగు చేస్తారు. ఈ సాగులో పనికి ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణా ఏజెన్సీ జిల్లాల్లో పంట సాగు పని చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబాద్, ఖమ్మం జిల్లాల గిరిజనులు కుటుంబాలుగా వచ్చి కూలి చేసుకుని తిరిగి వెళ్తుంటారు. వరి, పత్తి చేనుల్లో పని చేసే మొత్తం కార్మిక శక్తిలో కేవలం ఈ జిల్లాల నుంచి వచ్చే బాలలు సుమారు 10 శాతం మంది, కౌమారదశ పిల్లలు సుమారు 15 శాతంగా 'డెవలప్‌మెంట్స్‌ ఫర్గాటెన్‌ చిల్డ్రన్‌' తన నివేదికలో పేర్కొంది. గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ వలస కూలీలగా దగ్గరగా ఉన్న ఊర్లకు వస్తున్నారు. పైన పేర్కొన్న నాలుగు జిల్లాల నుంచే 70 శాతంకి పైగా కార్మికులు వ్యవసాయ సాగుకు పని చేస్తున్నారు. ఇందులో ఒక లక్షకు పైగా బాలలు, 1.9 లక్షల కౌమార పిల్లలు కార్మికులుగా ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. రోజుకు మిగిలేది రూ 150, ఈ కూలీల్లో పిల్లలు కూడా ఎక్కువగా ఉంటున్నారు. వారు వివిధ పంట సాగులో అన్ని పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ పాలినేషన్‌ కోసం వీరిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాలినేషన్‌ ప్రక్రియలో మేల్‌ ఫ్లవర్‌ బడ్‌ను ఫీమేల్‌ ఫ్లవర్‌ ప్లాంట్‌ దగ్గరికి ఒక రోజులో చాలా సార్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ మొక్క నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది కాబట్టి, ఈ పనికి పిల్లలు సరిపోతారు అని భావిస్తారు. సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. పంట సాగు కోసం పిల్లలను మధ్య దళారీలు చేనులకు తీసుకువస్తారు లేదా గిరిజనులే తెలుసుకుని వస్తారు. అలా కుదరకపోతే ఇంటి వద్దే సాగు పనులు చేసుకుంటారు. సుమారు ఉదయం 5 గంటలకు వీరి పని మొదలవుతుంది, మధ్యాహ్నం ఒంటి గంటకు పని ముగించుకుని వాహనాల్లో ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. వీరి కూలి రూ 200 ఇందులో రూ 50 వాహన చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.

● అడ్డుకోలేరా..??

స్కూల్‌ డ్రాపౌట్లను తగ్గించడానికి, బాల కార్మికులుగా బాలలు మగ్గడాన్ని అడ్డుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. బాల కార్మికుల గురించి ఎన్నిసార్లు సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్లినా, గిరిజన పిల్లలు సాగులో ముఖ్యంగా పత్తి సాగులో ఎక్కువగా పనికి వెళ్తున్నారనే విషయం తమ దష్టికి వచ్చిందని కానీ, తమకు ఎవరూ ఫిర్యాదు చేయడం లేదని తెలుపుతున్నారు. తల్లిదండ్రులే పిల్లలను తమ వెంట తీసుకెళ్లుతుండటం వల్ల రిపోర్ట్‌ చేయడానికి ముందుకు రావడం లేదని వివరిస్తున్నారు. పోలీసులు ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన, పలుచోట్ల చెక్‌ పోస్టులు పెట్టినా వారు వేరే మార్గాల గుండా వెళ్తున్నారన్నది వారి వాదన. పోలీసుల ప్రయత్నాలు ముమ్మరమైనప్పుడు పంట సాగుదారులే ఈ గిరిజనులను వారి దగ్గర పంట సాగు చేయాలని కోరుతారు. అప్పుడు గిరిజనులు కుటుంబమంతా కలిసి పంట పొలం వద్దే ఉంటారు. నిర్దిష్ట సమయం అనేది లేకుండా కుటుంబమంతా పనిలోనే నిమగమై ఉంటుంది.

● పరిష్కారమేంటీ..??

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు కూడా ఈ సమస్యను అంగీకరించుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బాల కార్మికుల పరిరక్షణకు సమగ్రమైన ప్రభుత్వ పాలసీ రావాల్సిందేనని పేర్కొంటున్నారు. ఇందులో స్కూల్‌ డ్రాపౌట్లను ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ‘ఇందుకు ప్రధాన కారణం పేదరికం కాబట్టి, బాల కార్మికులను పట్టుకుని స్కూల్‌కు తెచ్చినా మళ్లీ వారు కూలికి వెళ్లే చాన్స్‌ ఉంటుంది. ఎంత మంది డ్రాపౌట్లు ఉన్నారనే విషయం పై రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే సర్వేలు చేపట్టింది. కాబట్టి, పిల్లలను మళ్లీ పొలాల నుంచి పాఠశాల బాటపట్టించే విధంగా పాలసీని తీసుకురావాలి’ అన్నది వీరి వాదన.

ఏది ఏమైనా బాలల భవితవ్యం అంధకారం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది అన్నది మా అభిప్రాయం.

Post a Comment

0 Comments