శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంలో ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారని అటువంటి భద్రాచలాన్ని పరిశుభ్రత విషయంలో గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు భద్రాచలంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛత హీ సేవ లో భాగంగా గ్రామపంచాయతీ పరిశుభ్రత కార్మికుల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో ప్రతి సంవత్సరం గోదావరి నిమజ్జనం చేయడానికి వినాయక ప్రతిమలు వస్తూ ఉంటాయని అలాగే బ్రహ్మోత్సవాలు, ముక్కోటి, సీతారామచంద్రస్వామి కళ్యాణము వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ఉదయము, సాయంత్రము పరిశుభ్రత విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకొని తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, భద్రాచలం పట్టణం శుభ్రంగా ఉండేలా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. భద్రాచలం పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్లు, సఫాయి పనులు చేసే వర్కర్లు, మరియు ప్లంబర్లు అందరూ కలిసి 320 మంది బాధ్యతగా పనులు చేస్తున్నారని, పంచాయతీ సిబ్బంది కూడా ఉదయం సాయంత్రం వర్కర్ల యొక్క పర్యవేక్షణ పగటిబందీగా నిర్వహిస్తున్నారని ఇదే స్ఫూర్తితో పనిచేసి భద్రాచలం పట్టణాన్ని నందనవనంగా శుభ్రంగా ఉండే విధంగా వర్కర్లు కంకణం కట్టుకోని బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని అన్నారు. రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలంటే భద్రాచలం పట్టణం కలుషితం కాకుండా చూడాలని, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా పట్టణ వీధులు సుచి శుభ్రత తో ఉండాలని, రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని, స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు ఈరోజు నుండి అక్టోబర్ రెండో తారీకు వరకు జరుగుతూ ఉంటాయని ప్రతిరోజు పరిశుభ్రతకు సంబంధించిన పనులు చేసుకుంటూ భద్రాచలం పట్టణం సర్వ సుందరంగా తీర్చిదిద్ది శ్రీ సీత రాముడి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషించి మెచ్చుకునే విధంగా అందరం మన వంతు బాధ్యతగా కష్టపడి పని చేయాలని అన్నారు. అనంతరం సపాయి వర్కర్లకు సేఫ్టీ మెటీరియల్ తో పాటు ఇంటికి అవసరమయ్యే కాస్మోటిక్ వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, ఐటీసీ వావ్ సంస్థ కోఆర్డినేటర్ రమ్య, ఫీల్డ్ కోఆర్డినేటర్లు సౌజన్య, రాజేశ్వరి మరియు గ్రామపంచాయతీ సిబ్బంది, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

0 Comments