Breaking News

Loading..

అక్రమ కట్టడాన్ని కూల్చివేయండి- ఎంపీ, ఎం.ఎల్.ఎ లకు వినతి.

 

  •  పి ఓ ఆదేశాలు పట్టించుకోరా..
  •  డ్రైనేజీ, ఫుట్ పాత్ లను ఆక్రమించిన వారిపై చర్యలు     తీసుకోవాలి.
  •  లబ్ధిదారులకు వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
  •  నిర్లక్ష్యపు డాక్టర్లను తొలగించాలి. 
  •  మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్.

ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలో వందలాది అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని తక్షణమే వాటిని కూల్చివేసి ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేసే విధంగా చొరవ తీసుకోవాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ అన్నారు. గురువారం భద్రాచలం శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం నందు మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వినతిపత్రం అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విరుద్ధంగా అనేక అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని, గ్రామపంచాయతీ, రెవెన్యూ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడం వలన విచ్చలవిడిగా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు యదేచ్చగా కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో శ్రీపతి సేవ సంస్థ అనే పేరుతో ఓ వ్యక్తి అక్రమంగా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా పంచాయతీ అధికారి ఇతర అధికారులకు అనేక వినతి పత్రాలు ఇచ్చిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి దృష్టికి అక్రమ నిర్మాణంకు సంబంధించిన వినతి పత్రం ఇవ్వగా వెంటనే ఆ నిర్మాణాన్ని తొలగించాలని గ్రామపంచాయతీ అధికారులకు ఆదేశించిన ఈరోజు వరకు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో డబల్ బెడ్ రూమ్ లను గిరిజన లబ్ధిదారులను పిలిపించి ఇండ్లు కేటాయించినా ఈరోజు వరకు లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకపోవడం గిరిజనులను అవమానించడమే అవుతుందన్నారు. ఈనెలలో తప్పకుండా డబల్ బెడ్ రూమ్ లు ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హామీ ఇచ్చారన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని, సమయపాలన పాటించకుండా ఉద్యోగం చేస్తూ లక్షలాది రూపాయలను జీతం గా తీసుకుంటూ విధులు నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. కొంతమంది డాక్టర్లు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యి మరల డిప్యూటేషన్ ల పేరుతో ఇక్కడికి రావడం వారి ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణకేనని ఆయన అన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉద్యోగం ఇవ్వరాదన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్లు రెండు గంటలు మాత్రమే డ్యూటీ కి వచ్చి పోతున్నారన్నారు. రాత్రి సమయంలో కూడా ఓ గైనిక్ డాక్టర్ ను ఏర్పాటు చేయాలన్నారు. భద్రాచలం పట్టణంలో డ్రైనేజీలు, ఫుట్ పాత్ లు చెరువులు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments