Breaking News

Loading..

భద్రాద్రి అభివృద్ధిని పట్టించుకునేదెవరు?

భద్రాచలం.. పవిత్ర గోదావరి నదీ తీరాన సాక్షాత్తు రామచంద్రస్వామి సీతా లక్ష్మణ సమేతంగా నడయాడిన పుణ్యభూమి. దక్షిణ అయోధ్యగా పిలవబడే ఈ క్షేత్రం చరిత్ర మహోన్నతమైనది. కానీ.. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. రాష్ట్రం మొత్తం మీద పాలకుల నిర్లక్ష్యానికి గురై, ఎటువంటి అభివృద్ధికీ నోచుకోని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది భద్రాచలమేనని ఎవరిని అడిగినా చెప్తారు విభజన సమయంలో భద్రాచలం ఎవరికి దక్కాలి అన్న ప్రశ్న తలెత్తింది. అనేక చర్చల అనంతరం రాములవారు తెలంగాణకే సొంతమని, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని అనేక పోరాటాలు చేసిన వారిలో స్థానిక ప్రజలతోపాటు మేధావులు, నాయకులు, పాత్రికేయులు ఇలా అన్ని రంగాల వారూ ఉన్నారు.


భద్రాచలం తెలంగాణకైతే దక్కింది కానీ.. విభజన అనంతరం పట్టణం పరిస్థితి మరిం దయనీయంగా తయారైంది. భద్రాచల పట్టణ అభివృద్ధిని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. మొదట్లోనే ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఏకపక్షంగా ఆంధ్రలో కలిపారు. దీంతో అప్పటి నుంచి అభివృద్ధికి ఆమడదూరంలో భద్రాచలం పట్టణం నిలిచిపోయింది. తెలంగాణ నుంచి అంగుళం భూమిని కూడా పోనీయబోమని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం ఏడు మండలాను గుంజుకుంటే అప్పటి వరకు ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇక వదిలేశారు. 


భౌగోళికంగా ఏడు మండలాలను ఆంధ్రలో కలపడంతో భద్రాచలం ఎటూకాకూండా పోయింది. ఒక వైపు గోదావరి నది.. మరోవైపు ఆంధ్ర సరిహద్దు. కనీసం చెత్త పారబోసుకునే స్థలం కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో నేడు భద్రాచలం ఉందంటూ ఎంతటి దయనీయమో అర్థం చేసుకోవచ్చు.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భద్రాచలం వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భద్రాచలం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, భద్రాచలం టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తక్షణమే 100 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు కానీ.. తర్వాత మళ్లా కనిపించలేదు. భద్రాచలం అభివృద్ధి ఉసెత్తలేదు. నేడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం జిల్లాకు చెందినవారే. ఎమ్మెల్యే కూడా వారి పార్టీనే. దీంతో భద్రాచలం అభివృద్ధి పథంలో నడుస్తుందని, అభివృద్ధిలో పరుగులు పడుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. 



అయితే ఇక్కడ సమస్య ఏంటంటే భద్రాచలానికి ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా ఆ ఏడు మండలాలను తిరిగి భద్రాచలంలో కలపాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం భద్రాచలం చుట్టూ ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచాలానికే అప్పగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఐదు పంచాయతీలు భద్రాచలానికి వెన్నెముక వంటివి. 

ప్రస్తుత పట్టణ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పూర్తిగా అటవీ గిరిజన ప్రాంతమైన అటవీ గిరిజన హక్కులకై 1/70 చట్టం ఇక్కడ అమల్లో ఉన్నది. దీంతో ఇక్కడ గిరిజనేతరులు భూ క్రయవిక్రయాలు జరుపడం చట్ట విరుద్ధం. ఒకవైపు చట్టం ఉన్నా.. అనేక మంది స్థలాలు, పొలాలు యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. 

కేంద్ర ప్రభుత్వ తలా తోక లేని విభజన వల్ల భద్రాచలం పూర్తిగా నష్టపోయింది. రాముల వారి గుడి తెలంగాణలో, ఆలయ భూములు ఆంధ్రలో ఉంచుతూ విభజన చేశారు. మరోవైపు భద్రాచలం పట్టణం నుండి చర్ల వెళ్లే దారిలో ఒక్క ఎటపాక గ్రామాన్ని ఆంధ్రలో కలిపి, మిగిలింది తెలంగాణలో ఉంచారు. దీంతో ఎటపాక గ్రామాన్ని పట్టించుకునే అధికారులే లేకపోయారు. ఏ సమస్య ఉన్నా 70 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. 

మరోవైపు పోలవరం బ్యాక్ వాటర్ ముంపు భయంతో వర్షాకాలం వస్తే చాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో భద్రాచలం వాసులు ఉంటున్నారు. 2022 వచ్చిన వరదలు తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. తృటిలో తప్పిన ప్రమాదం భద్రాచలం వాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా ఎన్నాళ్లు బిక్కుబిక్కు బట్టు బతకాలి? అన్న ప్రశ్న ఇక్కడి ప్రజల్లో నెలకొన్నది. 


భద్రాచలం అభివృద్ధికి నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు కానీ.. ఆచరణలో పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలానికి ముగ్గురు మంత్రులు పూనుకొనిపూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అందులో కీలకమైన ఐదు పంచాయతీలను భద్రాచలంలో మళ్లీ కలిపేందుకు చొరవ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని భద్రాచలానికి శాశ్వత పరిష్కారం చూపి భద్రాచలం అభివృద్ధికి దోహదపడాలని, రాములవారిని, రాములవారి దేవాలయాన్ని, ఇక్కడ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నారు.

 



Post a Comment

0 Comments