'ఏచూరి' మార్క్సిజం విలువల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి.
◆ సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో 'సీతారాం ఏచూరి' సంస్మరణ సభ.
ఖమ్మం, సెప్టెంబర్ 13, బిసిఎం10 న్యూస్.
దేశానికి దిశానిర్దేశం చేసే అనేక చట్టాల రూపకల్పనలో కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరించారు. వాటిలో సీతారాం ఏచూరి పాత్ర ఎనలేనిదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మార్క్సిజం విలువల కోసం పని చేసిన మహోన్నత వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన అఖిల భారత సిపిఐ(ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. సీతారాం ఏచూరి మృతికి సంతాపంగా ఆయన చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు ప్రసంగించారు. భారతదేశ వామపక్ష ఉద్యమంలో ఓ అరుణతార రాలిందని, ఓ సిద్దాంతకర్త, ఓ దార్శనికుణ్ణి దేశం కోల్పోయిందన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలు లేని సమసమాజ స్థాపనకు కమ్యూనిస్టు నేతగా సీతారాం ఏచూరి చేసిన కృషి ఎనలేనిదన్నారు. లౌకిక, వామపక్ష పార్టీలను సమన్వయం చేస్తూ విచ్ఛిన్నకరవాదులను, ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం సాగిస్తున్న తరుణంలో సీతారాం ఏచూరి మృతి చెందడం విషాదకరమని పేర్కొన్నారు. దేశంలో మతతత్వం ఎంత ప్రమాదకరమో, తన రచనల ద్వారా వివరించారని చెప్పారు. దేశంలో కొద్దిమంది చేతుల్లోకి సంపద పోగవుతుందని. పేదలు, సంపన్నుల దేశంగా భారతదేశం విడిపోయిందని స్పష్టం చేసినట్లు వివరించారు. యూపీఏ, ఎన్‌డీఏలు ఏకపక్షంగా పాలన సాగిస్తున్న క్రమంలో పార్లమెంట్‌లో ప్రజా వ్యతిరేక బిల్లులను రద్దు చేయించడంతో పాటు, వాయిదా వేయించడంలో ఏచూరి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కమ్యూనిస్టు సిద్దాంతమంటే బిజేపి సైతం ఏచూరిని ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిరదంటే ఆయన వ్యక్తిత్వం ఎంతటి మహోన్నతమో అర్థం అవుతుందన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగినా యూపిఎస్సీ ఆలిండియా ర్యాంకర్‌గా, జేఎన్‌యూ అధ్యక్షుడుగా ఆయన చూపించిన పోరాట పటిమ కీర్తించదగినదన్నారు. ఎమర్జెన్సీ విధించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం కమ్యూనిస్టుల నేతృత్వంలో ఏచూరి పోరాటపటిమకు తలొగ్గక తప్పలేదని తెలిపారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలను మలుస్తూ ఇండియా కూటమి ఆవిర్భావానికి రూపకల్పన చేసిన వారిలో ముఖ్యులు ఏచూరి అన్నారు. ఉపాధిహామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం వంటి ఎన్నో ప్రజోపయోగ చట్టాల రూపకల్పనలో సీతారాం ఏచూరి పాత్ర ఎనలేనిదని విశ్లేషించారు. అంతర్జాతీయ కమ్యూనిస్టులను సమన్వయం చేసుకోవడంతో పాటు సాధారణ సంబంధాలను నెరపడంలోనూ ఏచూరి ముందుండేవారని చెప్పారు. మార్క్సిజం విలువల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు.
◆ ఏచూరి సిద్ధాంతం కమ్యూనిస్టులకు ప్రేరణ.
సీతారాం ఏచూరి సిద్ధాంతం కమ్యూనిస్టులకు ఓ ప్రేరణ, స్ఫూర్తిదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు పేర్కొన్నారు. 90వ దశకంలో నూతన ఆర్థిక విధానాలు, సోవియట్ యూనియన్ పతనం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏచూరి కమ్యూనిస్టులకు ఓ ధైర్యంగా ఉన్నారని తెలిపారు. ఆయన మరణం దేశ రాజకీయాలు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు తీరని లోటని అన్నారు. మార్క్సిజం, లెనినిజం శాస్త్రీయమైనది అదే శాశ్వతమని తన రచనల ద్వారా నిరూపించారని తెలిపారు. భారతం, రామాయణ ఇతివృత్తాల ఆధారంగా సమకాలీన అంశాలను విశ్లేషిస్తూ దేశ ప్రజానికానికి ఉపయోగపడే కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి కృషి చేశారని వివరించారు. ఏచూరి అమరుడు అజరామరుడు అని పేర్కొన్నారు.
◆ భారత రాజ్యాంగ పీఠికలో అంశాల ఆధారంగా రచనలు.
భారత రాజ్యాంగ పీఠికలో అంశాల ఆధారంగా సీతారాం ఏచూరి రచనలు చేశారని ఐలూ రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్యనారాయణ తెలిపారు. స్టడీ అండ్ స్ట్రగుల్ సిద్ధాంతాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కి ఆపాదించిన ఘనత ఏచూరిదే అన్నారు. న్యాయ వ్యవస్థపైన తన అభిప్రాయాలను వెల్లడిరచడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేందుకే భారత న్యాయవ్యవస్థలో మార్పులు చేశారని, నూతన చట్టాలు తీసుకువచ్చారని విశ్లేషణలను ఏచూరి తన రచనలు, ఉపన్యాసాల ద్వారా వెల్లడిరచారని తెలిపారు. 1978లో ఎస్‌ఎఫ్‌ఐలో తాను పనిచేస్తున్నప్పుడు తొలిసారి ఏచూరిని కలిసినప్పుడు ఆయనలో ఆవేశం, ఉద్రేకం చూశానని, కానీ ఆ తరువాతి కాలంలో ఆయన పరిణతి పొందిన తీరు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసిందని అన్నారు.
◆ ప్రజా ఉద్యమాలు, పార్లమెంట్‌లో దిట్ట.
ప్రజా ఉద్యమాల నిర్వహణ, పార్లమెంట్‌లో వివిధ అంశాలను విశ్లేషించడంలో సీతారాం ఏచూరి దిట్ట అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి సోమయ్య చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బిజేపి చట్ట విరుద్ధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఏచూరి కేసు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాతే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వివిధ పార్టీలు ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నాయో వెల్లడిరచాల్సి వచ్చిందన్నారు. వ్యవస్థ పై ఆధారపడి చట్టాలు ఉంటాయి తప్ప, చట్టాల పై ఆధారపడి వ్యవస్థలు ఉండవని చెప్పిన నాయకుడు ఏచూరి అని తెలిపారు. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్ ఉందా..?? అని నిరూపించిన నేత సైతం ఆయనేనని పేర్కొన్నారు.
ఈ సంతాప సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, మహిళా సంఘం నాయకురాలు ఏపూరి లత, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుండాల కృష్ణ, కాంగ్రెస్ రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థి సంఘం నాయకులు ఎం సుబ్బారావు, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments