ఖమ్మం, మే 01, బిసిఎం10 న్యూస్.
ప్రపంచ కార్మిక వర్గ చరిత్రలో మే 1వ తేదీ, ఒక సాధారణ రోజు కాదు. అది కార్మికుల చెమట, త్యాగం, పోరాటం, ఐక్యతకు ప్రతీక. ఎనిమిది గంటల పని దినం కోసం చికాగో వీధుల్లో ప్రాణాలు అర్పించిన కార్మికుల స్ఫూర్తిని గుర్తు చేసే రోజు. కార్మికులకు హక్కులు ఎవరూ దానం చేయలేదని, పోరాడితేనే సాధించుకోవచ్చని నేర్పిన చారిత్రక మైన రోజు మేడే సందర్భం. మేడే కేవలం జ్ఞాపక దినం కాదు, కార్మిక వర్గ భవిష్యత్తు కోసం కొత్త సంకల్పం తీసుకునే పోరాట దినం. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం నేడు దేశంలో అమల్లోకి తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కుల పై తీవ్రమైన దాడికి గురిచేస్తున్నాయి. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను ఒకే గొడుగుకిందకి తెచ్చినట్టు చెప్పినా, అసలు ఉద్దేశం యజమానులకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం, కార్మికులను మరింత అసురక్షిత పరిస్థితుల్లోకి నెట్టడం. పని గంటలు పెరగడం, కనీస వేతనాలు పెంపు లేకుండా చేయడం, యానియన్ హక్కులు బలహీనపరచడం, సమ్మె హక్కు పై పరిమితులు విధించడం, కాంట్రాక్టు ఉద్యోగాలను విస్తరించడం, లాంటి తదితర అంశాలు ఈ లేబర్ కోడ్స్‌లో దాగి ఉన్నాయి. ఇవి కార్మిక సంక్షేమానికి కాదు, కార్పొరేట్ లాభాలకు సేవ చేసే విధానాలుగా ప్రభుత్వం రూపొందించింది. ప్రత్యేకంగా అసంఘటిత రంగ కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా కార్మికులు, యువత ఈ లేబర్‌కోడ్స్ ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. ఇప్పటికే ఉపాధి భద్రత లేకుండా, తక్కువ వేతనాలతో, సామాజిక భద్రత లేకుండా జీవిస్తున్న కోట్లాది మంది కార్మికుల జీవితాలు మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. 'సంస్కరణల' పేరుతో వస్తున్న ఈ మార్పులు వాస్తవానికి కార్మిక వర్గాన్ని బలహీనపరచే చర్యలు తప్ప మరొకటి కాదు. మేడే మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నది కార్మిక వర్గం ఐక్యమైతే ఏ దాడినైనా ఎదుర్కోగలదు.
గతంలోనూ కార్మికులు సంఘటిత శక్తితోనే కనీసవేతనం, పనిగంటలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక హక్కులను సాధించుకున్నారు. నేడు అదే ఐక్యతతో లేబర్ కోడ్స్ పై దేశవ్యాప్తంగా ప్రతిఘటన నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి కార్యాలయంలో, ప్రతి రంగంలో కార్మికులు ఈ లేబర్‌కోడ్స్ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని, ఇతరులకు తెలియజేసి, పోరాటానికి సిద్ధం చేయించాలి. లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకించడం అంటే కేవలం ఒక చట్టాన్ని వ్యతిరేకించడం కాదు, అది కార్మిక వర్గ భవిష్యత్తును కాపాడు కోవడం. ఇది నేటి కార్మికుల కోసం మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం కూడా అవసరమైన పోరాటం. కార్మిక హక్కులు బలహీనమైతే ప్రజాస్వామ్యం కూడా బలహీన మవుతుంది. ఎందుకంటే కార్మికుడి గౌరవం లేని సమాజం న్యాయమైన సమాజం కాలేదు. ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు ఒక ప్రతిజ్ఞ చేయాలి. లేబర్‌కోడ్స్‌ను తిప్పికొడదాం.. కార్మిక హక్కులను కాపాడుదాం, కార్మికవర్గ విముక్తి కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం, మేడే స్ఫూర్తి మనలో చైతన్యం నింపాలి. పోరాటమే మార్గమని, ఐక్యతే ఆయుధమని గుర్తుచేయాలి.


0 Comments