బిసిఎం10 న్యూస్ మే 26 భద్రాచలం
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని సంతకాల సేకరణ.
- ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి.
- తల్లిదండ్రులకు ఫీజుల భారాన్ని మోపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.
- PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్న నేపథ్యంలో, వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలిపారు. విద్య హక్కు అని, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాల్గొన్నవారు కోరారు. ఈ సందర్భంగా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు ఇచ్చే ఎలక్ట్రోరల్ బాండ్స్ కు అలవాటు పడ్డాయని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల నుండి కోట్ల రూపాయల ఫండ్స్ వసూలు చేస్తున్నాయని, ఈ క్రమంలోనే ఫీజులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలే ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయని అన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ప్రతి ఏటా ఇష్టారాజ్యంగా 25 నుంచి 50 శాతం ఫీజులు పెంచుతున్నాయని, జిల్లా, ప్రాంతీయ స్థాయిలో ఎంఈఓ లు, డిఈ వోలు, ఆర్ జేడీలు ప్రైవేటు విద్యాసంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తూ ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారు అని అన్నారు. ఫీజులు పెంచాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని, భవిష్యత్తులో తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల కమిటీలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించి, చట్టం చేసి వారి అభిప్రాయాలు సేకరించాకే ఫీజులు పెంచే వెసులుబాటు కల్పించాలన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక భారానికి గురి చేస్తున్నాయని పిడిఎస్ యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పిడిఎస్ యూ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ , AYFI జిల్లా కార్యదర్శి సాధన పల్లి సతీష్ , జిల్లా కమిటీ సభ్యులు వాసు , విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.



0 Comments