Breaking News

Loading..

సామాజిక సేవ - వికాస తోవ.

సామాజిక సేవ - వికాస తోవ.


ఖమ్మం, ఫిబ్రవరి 22, బిసిఎం10 న్యూస్.

సమాజం అంటే మన చుట్టూ ఉన్న మనుషులు మాత్రమే కాదు మనలోని మనిషితనం కూడా. ఆ మనిషితనాన్ని మేల్కొలిపే బాటే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అంతర్జాతీయ సంస్థ. విద్యార్థుల్లో సేవాభావాన్ని అలవర్చుతూ, క్రమశిక్షణను జీవనశైలిగా మార్చుతుంది. అదే దారిలో ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్‌లు నిలుస్తాయి. ఇవి విద్యార్థుల్లో ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాల్ని, దేశభక్తిని నింపుతాయి. సమాజం కోసం నిలబడే బాధ్యతను నేర్పిస్తాయి. చదువుతో పాటు జీవితాన్ని అవగాహన చేసుకునే శక్తి ఇచ్చే ఈ సంస్థ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల ప్రభావాలతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న క్రమంలో ఈ సంస్థ మంచిదారిలో నడిపిస్తుంది. చిన్న వయసులోనే ఇతరుల కోసం బాధ్యతను భుజాన వేసుకునే ధైర్యం, స్వచ్ఛత, సహకారంతో సేవ అనే మార్గంలో నడిచే తత్వాన్ని స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు నేర్పిస్తుంది. విద్యార్థి దశ నుంచే సేవా భావం అలవడితేనే, సమాజం బలంగా నిలుస్తుంది. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సిసి, ఎస్ఎస్ఎస్‌ సంస్థల్లో చేరిన విద్యార్థులు రేపటి రోజున దేశానికి అవసరమైన ధీరులుగా, నాయకులుగా, బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు. మద్యం, మత్తుపదార్థాల ఆకర్షణ పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్ల్లల్ని ఈ సంస్థల్లో చేరేలా ప్రోత్సహించాలి. మార్కులు, ర్యాంకులే ముఖ్యంకాదు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం అనేది విద్యార్థి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. సమాజం పట్ల బాధ్యతగా ఉండటం అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించడం. ఆ పనిని చిన్న వయసులోనే నేర్పే గొప్ప పాఠశాలలే ఇవి. భారతదేశంలో 1909లో స్కౌటింగ్‌ ప్రారంభమైంది. భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ అసోసియేషన్‌ 1951లో ఏర్పడింది. అప్పటి నుంచి రాష్ట్రాలు, జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ (బాలభటులు) పాఠశాల స్థాయి పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ క్రమశిక్షణ, నైతిక విలువలు, సాహస క్రీడలు, బృంద భావం, సహనం వంటి అంశాలను నేర్పిస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లల్లో పరమత సహనం, సోదర భావం, సేవాతత్వం, దేశభక్తి బలపడేలా చేస్తుంది. శిబిరాలు, ఆటలు, శిక్షణ, సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి వెలికితీస్తుంది. మన చుట్టూ ఉన్న అనేకమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో అద్భుతమైన సేవను అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, తుపాన్లు, కరువు పరిస్థితులు వంటి సమయాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, ధైర్యం పెరుగుతాయి. శాంతిభద్రతల పర్యవేక్షణలో పాల్గొనడం వల్ల సామాజిక బాధ్యత బలపడుతుంది. ఇలాంటి అనుభవాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోటివారికి సహాయం అందించడంతో మనోధైర్యం కూడా మెరుగవుతుంది.

● జీవితంలో నిలబడేలా.

ఎన్‌సిసి విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తుంది. పరేడ్‌, డ్రిల్‌, శిక్షణ ద్వారా సమయపాలన, బాధ్యత, ధైర్యం అలవడతాయి. దేశ రక్షణపై అవగాహన కలుగుతుంది. ఒక విద్యార్థి తన జీవితంలో ఏ రంగంలో ఉన్నా ఎన్‌సిసి ఇచ్చే క్రమశిక్షణ అతడిని ముందుకు నడిపిస్తుంది. అలాగే ఎన్ఎస్ఎస్‌ కూడా మరోవైపు విద్యార్థులను సమాజంతో అనుసంధానం చేస్తుంది. 'నాట్‌ మీ బట్‌ యూ' అనే భావనతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు, చెట్లు నాటడం, పేదలకు సహాయం వంటి పనుల ద్వారా విద్యార్థి మనసులో మానవత్వం పెంపొందుతుంది. చదువు అనేది కేవలం మార్కులకే కాదు సమాజానికి ఉపయోగపడటానికి అని ఎన్ఎస్ఎస్‌ బలంగా నేర్పిస్తుంది. ఈ మూడు సంస్థల ప్రత్యేకత అదే. విద్యార్థులను కేవలం చదువులోనే కాకుండా జీవితంలో నిలబడేలా తయారు చేస్తాయి.

● సమాజ మార్పు కోసం.

రాష్ట్రాల్లో పలు చోట్ల స్కౌట్స్‌, ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్‌ వేదికగా విద్యార్థుల చేత సేవా, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్‌ అవగాహనా ర్యాలీలు నగర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హెల్మెట్‌ పెట్టుకోవడం, రోడ్డు నియమాలు పాటించడం, వేగం తగ్గించడం వంటి విషయాలను విద్యార్థులే ప్రజలకు వివరించడం ఒక మంచి మార్పు. కొన్ని చోట్ల 'రోడ్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌'లు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యార్థులు చేపట్టే సేవా కార్యక్రమాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది డ్రాప్‌ అవుట్‌ పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడం. విద్యార్థులే గ్రామాల్లో సమావేశాలు పెట్టి 'చదువు విలువ'ను వివరిస్తున్నారు. పేద విద్యార్థులకు అందే స్కాలర్‌షిప్‌లు, విద్యా సహాయాలు వంటివి ప్రజలకు తెలియజేస్తూ, 'చదువు ఆగిపోకూడదు' అనే సందేశాన్ని విద్యార్థులు బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆలోచించి, తమ పిల్లల్ని స్కూలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప పని.

'స్వచ్ఛతే ఆరోగ్యం' అనే సందేశంతో వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి 'నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి', 'దోమల నివారణ చర్యలు తీసుకోవాలి' అనే అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలు ప్రజల్లో జాగ్రత్తను పెంచడమే కాకుండా, విద్యార్థుల్లో 'ప్రజల ఆరోగ్యం కూడా మన బాధ్యత' అనే భావనను నాటుతాయి. విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థినీల భద్రత పై అవగాహన చేపడుతున్నారు. పాఠశాల స్థాయిలో 'గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌' శిక్షణ, చిన్నారులకు సరైన అవగాహన ఇవ్వడంతో తోటిపిల్లల పట్ల ప్రేమ, బాధ్యత తెలియజేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ దిశగా పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్ఎస్ఎస్‌ విద్యార్థుల సేవా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు, వాగులు, నదుల పరిశుభ్రంగా ఉంచడం వంటి పనులు అక్కడ తరచుగా చేపడుతున్నారు. అలాగే పేదల కుటుంబాలకు ఆరోగ్యం, విద్య పై అవగాహన కల్పించడం కూడా సేవలో భాగం. విద్యార్థులకు వరదలు, తుపాన్ల సమయంలో సహాయక చర్యల కోసం శిక్షణ ఇవ్వటం, కష్టకాలంలో ఉన్న ప్రజలకు తోడ్పడటం వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ధైర్యాన్ని, సేవా నిబద్ధతను పెంచుతాయి. ఈ మధ్యకాలంలో మరో కీలకాంశం డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమం చేపట్టడం. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, జీవిత లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోవడం వంటి విషయాల పై విద్యార్థులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

● ఈ రోజు ఇలా.

బాలబాలికల్లో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి రాబర్ట్‌ స్టీఫెన్‌ సన్‌ స్మిత్‌ బేడెన్‌ పవెల్‌ 1907లో ఇంగ్లాండ్‌లోని బ్రౌన్‌సి ద్వీపంలో 20 మంది విద్యార్థులతో ఈ స్కౌట్‌ (బాలభటుల బృందం) ప్రారంభించారు. ఈయన 1857 ఫిబ్రవరి 22న లండన్‌లో జన్మించారు. ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ‘థింకింగ్‌ డే’ పేరుతో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల్లో జరుపుకుంటున్నారు. ఈ టీమ్‌లో బాలురను ‘స్కౌట్స్‌’, బాలికలను ‘గైడ్స్‌’ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి కృషికి నివాళులర్పించడానికి ప్రపంచ స్కౌట్‌ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

● సేవ అనే యూనిఫారంతో.

ప్రపంచంలో విపత్తుల సమయంలో వివిధ దేశాల్లో స్కౌట్స్‌ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో టర్కీ-సిరియా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఇళ్లు కూలిపోయాయి, రోడ్లు చీలిపోయాయి. ఒక్కసారిగా వేల మంది నిరాశ్రయులయ్యారు. అందులో ఒక చిన్న కుటుంబం వారి ఇంటి గోడల మధ్య చిక్కుకుపోయింది. వాళ్లు బయటకు వచ్చే అవకాశం లేక భయంతో కేకలుపెట్టారు. తినడానికి, తాగడానికి వాళ్ల దగ్గర ఏమీలేవు. చుట్టూ చీకటి, చలి అలాంటి సమయంలో అక్కడికి మొదట చేరినవాళ్లలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వాలంటీర్లు కూడా ఉన్నారు. వాళ్లు చేతిలో నీటి బాటిళ్లు, దుప్పట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు, చిన్నపిల్లల కోసం బిస్కెట్లు, వృద్ధుల కోసం మందుల సహాయం చేశారు. ప్రజలను సహాయక కేంద్రాల దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ స్కౌట్స్‌ బృందం చేసిన పని అభినందనీయం. తిండితో పాటూ భయంతో వణికిపోతున్న వారికి ధైర్యం కూడా చెప్పారు.

Post a Comment

0 Comments