బిసిఎం10 న్యూస్ 13.02.26 భద్రాచలం
కె.వై.సి.- మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీ మొదటి అడుగు..అనే ఇతివృత్తం తో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 9 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో వాకతాన్ నిర్వహించారు. ఫ్లెక్సీ లు , ప్లకార్డులు ప్రదర్శిస్తూ కె.వై.సి. నవీకరణ చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తెలియని లింకులు నొక్కొద్దు - ఓ. టి.పి. లు చెప్పొద్దు - మోసగాళ్ళకు చిక్కొద్దు అంటూ నినాదాలు చేస్తూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వి. రామి రెడ్డి మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ తమ కె. వై.సి. అప్ టు డేట్ గా ఉంచుకోవాలని సూచించారు.కె. వై. సి. కి అవసరం అయిన డాక్యుమెంట్లు, అవి బ్యాంక్ ఖాతా కు అనుసంధానం చేయడం వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు వివరించారు. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా అన్నిటిలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఒకేలా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు.ఇప్పుడు ఒక బ్యాంక్ లో కె.వై.సి అప్డేట్ చేయడం ద్వారా మిగిలిన అన్ని బ్యాంకులలో కె. వై.సి. అప్డేట్ చేసే వ్యవస్థ సి.కె.వై.సి. అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం లో 14 అంకెల సి.కె.వై.సి. నంబర్ జారీ చేస్తారు. ఈ నంబర్ మిగిలిన అన్ని బ్యాంకులలో ఉన్న మీ ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా మీ కె.వై.సి. అప్డేట్ అవుతుంది. తిరిగి అన్ని డాక్యుమెంట్లు సమర్పించే అవసరం లేదు. 7799022129 కి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నుండి మిస్డ్ కాల్ చేయడం ద్వారా తన సి . కె.వై.సి. నంబర్ సులభంగా తెలుసుకోవచ్చు అని తెలిపారు.కె. వై. సి. పేరుతో ఫోన్ ద్వారా, ఆన్లైన్ లింకుల ద్వారా జరుగుతున్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఇతరులు మీ ఖాతాని ఉపయోగించే అవకాశం ఇవ్వవద్దు అని, వారు చేసే మోసపూరిత లావాదేవీలకు మీరే బాధ్యులుగా ఉంటారని తెలియచేసారు. అలా చేస్తే మీరు మనీ మ్యూల్ గా పరిగణించబడి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని తెలియచేశారు. మీ బ్యాంక్ ఖాతా కు సంబంధించిన వివరాలు, ఓ. టి. పి, ఏ. టి. యం. పిన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ తెలియనివ్వద్దు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భద్రాచలం బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీ.మధుసూదన శర్మ మాట్లాడుతూ ఖాతాదారులు తమ కె.వై.సి అప్ డేట్ చేసుకోవడం ద్వారా సురక్షితమైన బ్యాంకింగ్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఒక వేళ, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేసి కంప్లైట్ చేయాలని సూచించారు.శ్రీమతి. భాను పద్మశ్రీ, మేనేజర్ (ఎఫ్.ఐ) ఎస్.బి. ఐ.రీజినల్ ఆఫీస్ మాట్లాడుతూ, వాట్సాప్ ద్వారా ఆకర్షణీయమైన పేర్లతో .APK ఫైల్స్ వస్తున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సూచించారు. ఏ పేరుతో వచ్చినా, .APK అని కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, సి.ఎఫ్.ఎల్ భద్రాచలం సిబ్బంది లక్ష్మణ్, హరిబాబు, జీవన రేఖ, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

0 Comments