Breaking News

Loading..

కబళిస్తోన్న పేదరికం.

ఖమ్మం, జనవరి 25, బిసిఎం10 న్యూస్.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలతో పాటు భారత్‌నూ పట్టి పీడిస్తోన్న భూతం పేదరికం. 147 కోట్ల దేశ జనాభాలో నేటికీ 28 శాతం మంది పేదరికంలోనే మగ్గుతున్నారని ఇటీవలి అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్‌ జిలుగు వెలుగుల గురించి మనం వినని రోజంటూ వుండదు. ‘ఇండియా ఈజ్‌ నాట్‌ పూర్‌. ఇండియన్స్‌ ఆర్‌ పూర్‌’ అనేవారట మాజీ రక్షణమంత్రి కృష్ణమీనన్‌. భారత్‌ పేద దేశం కాదని, భారతీయులే పేదవారని ఆయన అభిప్రాయం. పేదరికం ఎంతటి సామాజిక రుగ్మత అంటే అది మనిషిని సహజ హక్కులను, జీవితానందాలను పరాయీకరించి, లోలోపలి నుంచి ధ్వంసం చేస్తుంటుంది. ఆ ఊబి నుంచి బయటపడే అవకాశం లేక ఆత్మహత్యే శరణ్యమన్న ధోరణిలోకి నెట్టివేస్తుంది. దేశంలో గతేడాది 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. వాటిలో 40 శాతం పేదరికం, సంబంధిత కారణాలే ప్రధానమైనవి. ‘పేదరికం అత్యంత హింసాత్మకమైనది, అది జీవితాలను నాశనం చేస్తుంది’ అంటారు నెల్సన్‌ మండేలా. దీనికి తాజా ఉదాహరణే పార్వతీపురం మన్యం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ఓ దళిత కుటుంబం. పేదరికం, ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణం. ఓ నిరుపేద వృద్ధురాలు ఆస్పత్రిలో చనిపోతే చెత్త తీసుకెళ్లే రిక్షాలో మృతదేహాన్ని తరలించిన హృదయ విదారక ఘటన కూడా ఇదే జిల్లాలో గత నెల చోటు చేసుకుంది. ఆకలి, జీవన ఒత్తిళ్లు ఒక కుటుంబాన్ని ఎలా నిస్తేజంగా మార్చుతాయో, నిశ్శబ్దంగా వారి ప్రాణాలనే ఎలా మింగేస్తున్నాయో ఈ ఆత్మహత్యలు ధ్రువీకరిస్తున్నాయి.

‘పాత ప్రపంచం మరణిస్తూ కొత్త ప్రపంచం జనిస్తున్న ఈ సంధి కాలంలో రాక్షసులు రాజ్యమేలుతున్నారు’ అని వందేళ్ల క్రితం అన్న ఆంటోనియో గ్రాంసీ మాటల ప్రాసంగికత నేటికీ వర్తిస్తుంది. దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచబ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్నప్పటికీ వాస్తవిత మరో విధంగా ఉంది. ‘ప్రస్తుత కాలం భారతీయ మహా కుబేరులకు స్వర్ణయుగంగా మారింది’ అని 2026 అంతర్జాతీయ అసమానతల నివేదిక చెబుతోంది. అంతేకాదు బ్రిటిష్‌ పాలన నాటి కంటే ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయని కూడా ఈ నివేదిక వెల్లడించింది. దేశ సంపదలో సగానికి పైగా సంపద కేవలం 10 శాతం మంది కుబేరుల దగ్గర పోగుబడిందని ‘బ్లూమ్‌ వెంచర్స్‌’ అనే పెట్టుబడుల సంస్థ నివేదించింది. మేడిపండు చూడు మేలిమై ఉండు’ అన్న చందంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో రూపాయి విలువ చరిత్రలో కనివిని ఎరుగనంత పతనావస్థకు దిగజారింది. పేదలు మరింత పేదలు కావడానికి, మధ్య తరగతి వర్గం పేదరికంలోకి జారిపోవడానికి ప్రధానకారణం వ్యవసాయ క్షీణత, నిరుద్యోగం, విద్య, వైద్యం అత్యంత ఖరీదైనవిగా మారడం అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆకలి సూచీ 2025లో భారత్‌ 102వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే విషయం. ఈ గణాంకాలు దేశంలోని పేదరికానికి అద్దం పడుతున్నాయి. కొద్దిమందిగా ఉన్న కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలిస్తున్న కేంద్రం సంక్షేమ పథకాలను కుదించడమో లేదా రద్దు చేయడమో చేస్తున్నారు. గ్రామీణ పేదలకు పని హక్కుగా వున్న గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేయడంతో మరింత ఆకలి కేకలు పెరుగుతాయి.

అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాల్లో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, సామాజిక సమస్యలు పేదరికానికి కారణమౌతున్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నా వాటి ఫలాలు, ఫలితాలు పేదలకు చేరడం లేదు. అట్టడుగు వర్గాలు, పేదలు పేదరికం ఊబిలో కూరుకుపోతునే ఉన్నారు. సంపన్నుల ఆదాయం రెట్టింపవుతూనే ఉంది. ఫోర్బ్స్‌ ఇండియా లెక్క ప్రకారం దేశంలోని టాప్‌ 25 బిలియనీర్ల సంపద సగటున దేశవ్యాప్తంగా ఉన్న పేదల సంపదకన్నా అనేక రెట్లు ఎక్కువ. ‘సమాజం ఎంత సంపద సృష్టించిందన్నదే కాదు, ఆ సంపద అవకాశాలను ఎంత న్యాయంగా పంచిందన్నదే సమాజాన్ని అంచనా వేసే ప్రమాణం’ అంటారు ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ ‘తీవ్ర పేదరిక రహిత రాష్ట్రం’గా కేరళ నిలవడం విశేషంగా చెప్పాలి. ‘కాలే కడుపుకు గరిటెడు గంజి/ జారే సిగ్గుకు మూరెడు పాతా/ ఎల్లర కందే చల్లని రోజులు/ వెలిసే విధమును వెదకండీ’ అంటాడు రాయప్రోలు. దేశంలో సృష్టించబడుతోన్న సంపద పేదలకు చెందాలి. అందుకు అవసరమైన మార్గాలను వెదకాలి. దీనికి కావాల్సింది కేవలం చిత్తశుద్ధి మాత్రమే అన్నది మా అభిప్రాయం.

Post a Comment

0 Comments