ఖమ్మం, నవంబర్ 07, బిసిఎం10 న్యూస్.
భరతజాతి బానిసత్వ విముక్తి గీతంగా విశేషాధరణ పొందిన 'వందేమాతరం' గేయానికి నేటితో 150 ఏండ్లు నిండాయి. నాడు బానిస సంకెళ్లలో చిక్కుకున్న మన దేశానికి ఈగీతం ఒక నూతన శ్వాస. ఈ నినాదమే ప్రజల్లో స్వాతంత్య్ర చైతన్యాన్ని మేల్కొలిపి, దేశమంతా ఒకే తాటి పై నడిపించింది. భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించుకోవడానికి జరిగిన పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగింది. ఈ సుదీర్ఘ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో పోరాటయోధులు తమ ధన, మాన, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. ఆ సమరంలో 'వందేమాతరం' ఒక స్ఫూర్తి మంత్రంగా మారింది. ఇది కేవలం గీతం కాదు, మనోబలం, మాతృభూమి పట్ల ప్రేమ, ఆత్మవిశ్వాసాల కలయిక. నిరంకుశ బ్రిటీష్ పాలకులు స్వాతంత్య్రం కోసం పోరాడినవారి పై ఉక్కుపాదం మోపుతూ, వారిని చిత్రహింసలకు గురిచేసేవారు.
తుపాకులతో కాల్చేటప్పుడు, ఉరిశిక్షలు అమలు చేస్తున్నప్పుడు అధికారులు, న్యాయమూర్తులు 'చివరిగా చెప్పదలచుకున్నది ఏదైనా ఉందా?' అని మనవారిని అడిగితే వారు తల అడ్డంగా ఊపి చిరునవ్వుతో 'వందేమాతరం' అని నినదించేవారు. అది వారి-చివరిశ్వాస, కానీ, దేశానికి కొత్త ఊపిరి. ఉప్పు సత్యాగ్రహంలో సమయంలో బిహారీ బాలుడు బధునోనియా 'వందేమాతరం' అంటూ నిర్భయంగా తిరుగుతుండగా బ్రిటీష్ పోలీసు అతన్ని ఉప్పు కొలిమిలో తోసేశాడు. ఆ బాలుడు ప్రాణాలు గాల్లో కలిసేవరకు 'వందేమాతరం' అంటూ నినదించాడు. ఇలా పిల్లలు, పెద్దలు, యువత, మహిళలందరూ ఈ గేయం, నినాదంతో బ్రిటిష్ వారి పై పోరాటం చేశారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఆ గీతం ప్రజల హృదయాలలో దావానలంలా వ్యాపించింది. బిపిన్ చంద్రపాల్ దీన్ని దేశానికి పరిచయం చేసి ప్రాచుర్యం కల్పించారు.
ఈ గీతానికి ఆవిర్భావం వెనుక ఒక అవమానగాధ కూడా ఉంది. బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ్ బ్రిటిష్ పాలనలో డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తుండగా ఒక తెల్లతోలు అధికారి అతని పై జాతి వివక్షతో దాడిచేశాడు. ఆ అవమానం ఆయన గుండెలో జ్వాలగా మారింది. తర్వాత బ్రిటిష్ పాలకులు 'God Save the King' (గాడ్ సేవ్ ద కింగ్) గీతాన్ని భారత జాతీయగీతంగా ప్రకటించాలని చూస్తు న్నారని తెలిసి, బంకిమ్‌చంద్ర కలం నుంచి అక్షరాల మంటలు చిమ్మాయి. 1875 నవంబర్ 7న ఆయన రచించిన గీతమే భారతీయ గేయం. ఇది బంకించంద్ర చటర్జీ రచించిన 'ఆనందమఠ్' అనే బెంగాలీ నవలలోనిది. స్వాతంత్రోద్యమ కాలంలో ఈ గీతాన్ని భారతీయులు 'విప్లవ గీతం'గా గానం చేశారు. ఇది జనగణమనతో సమానమైన స్థాయి కలిగి ఉంటుంది. వందేమాతరం గీతం ప్రథమంగా 1896లో కోల్‌కత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలాపించబడింది. ఆ తర్వాత యావత్ భారత జాతి గుండెల నిండా చేరి ఉద్యమానికి పురి కొల్పింది.
అయితే, భాషా మిశ్రమం గురించి కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ బంకిమ్ చంద్ర తగ్గకపోగా 'మీకు నచ్చితే పాడండి, లేకుంటే విసరేయండి, దీని విలువ ప్రపంచం గుర్తిస్తుంది' అని అన్నారు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతంలోని ఆధ్యాత్మికతను గుర్తించి దేశాన్ని మాతృ మూర్తిగా చూపించే విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు.1886లో అనేక సభల్లో స్వయంగా ఆలపించారు. బంకిమ్ చంద్ర మరణానంతరం ఈ గీతం అగ్నికణాలై ప్రజల్లో వ్యాపించింది.1947 ఆగస్టు 15న మన స్వాతంత్య్రం సిద్ధించిన రోజున పార్లమెంట్‌లో సంగీతకారుడు ఓం ప్రకాశ్ ఈగీతాన్ని ఆలపించారు. 1950లో రాజ్యాంగ పరిషత్తు 'వందేమాతరం'ను ‘జనగణమన'తో సమానహోదాలో గౌరవించాలని తీర్మానించింది. దూరదర్శన్‌లో ప్రతిరోజూ వినిపించే 'వందేమాతరం'కు నేపథ్య సంగీతం లేకపోవటానికి దీనిలోని పదాల మాధుర్యం కారణమని చెబుతారు.
బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్‌లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గీతాలలో 'వందేమాతరం' రెండవస్థానం దక్కించుకుంది.1906లో పాథే ఫోన్స్ కంపెనీ రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో దీన్ని రికార్డు చేసింది. బ్రిటిష్ పోలీసులు ఆ రికార్డులను నాశనం చేశారు. అయితే ఒరిజినల్ కాపీ పారిస్‌లో దొరికింది. దీన్ని 1966లో ఇందిరాగాంధీ తిరిగి భారత్‌కు తెప్పించారు. ఈ గీతం భరతజాతి చైతన్యానికి నిత్యదీప్తి. భారత సంస్కృతిలో 'అసతోమా సద్గమయ', 'సత్యమేవ జయతే', 'జననీ జన్మభూమిశ్చ', 'మా ఫలేషు కథా రచనా' వంటి వాక్యాలతో పాటు ప్రపంచస్థాయి నో దై సెల్ఫ్ సోక్రటీస్ సూత్రం, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అనే మార్క్స్ నినాదం మానవ వికాసానికి మైలురాళ్లు అయినట్లే, 'వందేమాతరం' కూడా ఆ కోవకు చెందిన మహోన్నత నినాదం.
ఇది కేవలం స్వాతంత్య్ర చరిత్రలో ఒక పుట కాదు భరత జాతి దాస్య శృంకణాల విముక్తి గీతం. బ్రిటిష్ వారిని సప్త సముద్రాలు దాటించి విప్లవ గీతం. భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య ఉన్న భేదాలను చెరిపి దేశాన్ని ఒక్కతాటిపై నిలిపిన చైతన్యగీతం. వందేమాతరం జాగృతి గీతానికి సరిగ్గా నూట యాభై ఏండ్లు అవుతున్న సందర్భం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నవంబర్ 7, ఉదయం 10 గంటలకు 'వందే మాతరం' గీతా లాపన చేసి యావత్ భారత ప్రజానికానికి పిలుపునిచ్చింది. నేటితరం, ఆనాటి త్యాగాల స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ భారత దేశ ప్రగతికి, అభివృద్ధికి పునరంకితం కావలసిన అవసరం ఉంది.
వందేమాతరం..!!
సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం..
సస్యశ్యామలాం.. మాతరం..! వందేమాతరం..!
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం..
పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం,
సుహాసినీం సుమధురభాషిణీం..
సుఖదాం వరదాం మాతరం..! వందేమాతరం..!'
భావం: తల్లి..! భారతమాత నీకు వందనం..! తీయని జలాలతో, కమ్మని ఫలాలతో, చల్లని మలయా మారుతాలతో, పచ్చని పైర్లతో వెలసిల్లే, తల్లి నీకు వందనం..! పండు వెన్నెల రాత్రులలో విరబూసిన తరూలతలతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధుర మైన మాటలతో మాకు సుఖాలను కలిగిస్తూ వరాలనిచ్చే, తల్లీ నీకు వందనం..

0 Comments