ఖమ్మం, అక్టోబర్ 01, బిసిఎం10 న్యూస్.
బరువెక్కిన గుండెతో బ్రతుకీడ్చుతున్న వయోవృద్ధులు. మానవత్వమా మేలుకోవమ్మా. ఆశ్రమాలకు అమ్మానాన్న, మసకబారుతున్న మలి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు, మచ్చుకైనా లేదు చూడు మనసున్న వాడు అని సినిగేయ రచయిత ఓ చలనచిత్రంలో గీతం రాశారు. నేటి సమాజంలో అది అక్షరసత్యమౌతుంనేది ఇటివల జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి తెలుస్తుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అని, మోక్షం సంపాదించేందుకు అనునిత్యం మొక్కే దైవం, మన జీవితాన్ని తమ ప్రజ్ఞతో తీర్చిదిద్దే గురువుకు సైతం తల్లి, తండ్రి తర్వాత స్థానం దక్కింది సనాతన ధర్మంలో. జీవిత చర మాంకం ఎవరికైనా ఇది సరదాగా ఆహ్లాదంగా సాగితే అంతకంటే ఆనందం ఉండదు. తమ పిల్లలు, మనుమలతో సరదాగా సాగాల్సిన మలి బాల్యం నాలుగు గోడలకు పరిమితమవుతోంది. తల్లి నవమాసాలు మోసి, రెక్కలు వచ్చే వరకు తండ్రి తన భుజాన మోస్తే, కడుపార కన్న కొడుకులే కనిపెంచిన తల్లిదండ్రులను చూసేందుకు నువ్వంటే నువ్వంటూ వంతులు వేసుకునే పరిస్థితి దాపురిస్తుంది. అంటే ఆవేదనతో మలిబాల్యం ఆత్మహత్య చేసుకుంటుంది. వయోభారం తమకు భారం అవుతుందంటూ, తల్లితండ్రుల బాధ్యత కొందరు సుపుత్రులు గాలికి వదిలేస్తున్న సంఘటనలు గుండెలు బరువెక్కించేలా చేస్తున్నాయి. కడుపు మాడ్చుకొని కన్న పేగును పెంచిన, తమకు తమ సంతానమే పిడికెడు మెతుకులు పెట్టేందుకు వెనకాడుతున్నారన్న భాధ వృద్ధాప్యంలోని వృద్ధులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండి, పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు కూడా జన్మనిచ్చిన వారికి కడుపు నింపలేక, వారిని చూడటంలో చిన్న, చిల్లరి మనుషులుగానే మిగిలిపోతున్నారు.
● కని, పెంచిన వారి క్షేమం పట్టని ప్రబుద్ధులు.
గడచిన కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో వృద్ధులే పెద్దలుగా వెలుగొందేవారు రాను రాను ఆ పద్దతి మసకబారిపోయింది. ప్రస్తుత కాలంలో ఆ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతూ భార్య, భర్త, పిల్లలు అన్నట్లుగా చిన్న కుటుంబాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దల పై ఆకుటుంబంలో పుట్టిన పిల్లలకు సరైన అవగాహన లేకపోవడం వారిని వృద్దులకు దగ్గర చేయడంలో తల్లిదండ్రులు విఫలం అవుతున్నారు. భార్యా భర్తల మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. బ్రతికుండగా తల్లిదండ్రులు పట్టించుకోవడంలో కొందరు ప్రబుద్దులు దారుణంగా వ్యవహరిస్తున్నారని వారు అంటున్నారు.
● వయోభారంతో పనులు చేసుకోలేకపోతే బయటకు గెంటేస్తారా..??
వయోభారంతో పనులు చేసుకోలేక పోవడంతో కొందరు వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. ఆస్తి తమ పేరు పై రాశాక తల్లిదండ్రులను రోడ్డు పై వదిలేస్తున్నవారే అధికం. నిత్యం మనకు రహదారుల వెంట అటువంటి వృద్ధులు తారసపడుతూనే ఉంటారు. వారిలో సుపుత్రులు ఇంటిలో నుంచి గెంటేసినవారి శాతమే ఎక్కువ. అవసరాలు చూడాల్సిన సంతానం వారిని వృద్ధాశ్రమాలలో, బస్టాండ్ లలో, రద్దీ ప్రదేశాల్లో వదిలి వెళ్ళిపోతున్నారు, సభ్య సమాజం తలదించుకుంటుంది. నోటి మాట రాక తమ అవసరాలు తాము తీర్చుకోలేక చాలామంది వృద్ధులు రహదారుల వెంట బ్రతికిడుస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక ఆనాథ శవాలుగా మారిపోతున్నారు. వయోవృద్ధులకు ఎలా అండగా ఉండాలి, వృద్ధాప్యం అనేది ఓ భిన్నమైన జీవన దశ. కాలంతోపాటే యవ్వన ఛాయలు కరిగిపోతూ ఉంటే. దశాబ్దాల శ్రమ ఫలితంగా శరీరం అరిగిపోతోందన్న సంకేతాలు ఆరంభమవుతూ ఉంటాయి. వారి అంశాలుగా తర్వాత తరమైన మనం వారి పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఈ మలిదశను ఎంతో ఆనందంగా గడిపేయ్యొచ్చు. నిజానికి వృద్ధాప్యంలో పలకరించే సమస్యలు వారి అవసరాలూ భిన్నంగా ఉంటాయి. చాలాసార్లు వ్యాధుల లక్షణాలూ, వృద్ధులకు చెయ్యాల్సిన చికిత్సలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వేరుగానే ఉంటాయి. అందుకే వీరిపట్ల ప్రత్యేక శ్రద్ధతో మనం కృతజ్ఞత పూర్వకమైన భావనతో చేయగలిగితే ఎంతో కొంత వారి రుణం తీర్చుకున్నట్లే కదా.

0 Comments