Breaking News

Loading..

మతరాజ్య భావన ఒక మానసిక దౌర్బల్యం.


జులై 19, బిసిఎం10 న్యూస్.

భారతదేశ గత చరిత్రను చూసినపుడు భారత ఉపఖండంలో వివిధ మతాలను అవలంబించిన రాజులు ఉన్నారు, తప్ప మత రాజ్యాలు ఉన్నట్లు చరిత్ర లేదు. కొన్ని దేశాల్లో ఉన్న ఇస్లామిక్‌, క్రైస్తవ, బౌద్ధ మతాలను అధికారికంగా ప్రకటించటాన్ని చూసి భారత్‌లో హిందూ రాజ్య స్థాపన చేయాలని కొందరు విదేశీ భావజాలాన్ని కాపీకొట్టి (ఆర్‌ఎస్‌ఎస్‌ వారు వేసుకొన్న నిక్కర్లు, ఇప్పటి పాంట్లు కూడా విదేశీ కాపీ తప్ప మన వస్త్రధారణ కాదు), గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే 101వ సారి నిజంగా మారుతుందట. హిందూ, ముస్లిం, క్రైస్తవం, సిక్కు ఎవరైనా తమ మత రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారంటే దురహంకారవాదపు ప్రతికూల ప్రభావంతో తలెత్తే ఒక మానసిక దౌర్బల్యానికి చిహ్నం తప్ప మరొకటి కాదు. అది మతానికే పరిమితం కాదు, చివరకు కులాల రాజ్యాలు ఏర్పాటు జరగాలన్న దిగజారుడుకూ దారితీస్తుంది. సోషలిజం అన్నది భారతీయ ఆర్థిక ఆలోచన కాదని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వాదించినట్లు రచయిత పేర్కొన్నారు. ఇదొక అర్థం లేని వాదన, ఒక్కో దేశానికి ఒక్కో ఆర్థిక ఆలోచన ఉండదు. ప్రపంచమంతా ఒక కుగ్రామం అని చెబుతున్న రోజుల్లో ఇలాంటి కబుర్లు చెప్పటం జనాలను మభ్యపెట్టే అతితెలివి తప్ప మరొకటి కాదు. పొలంలో పని చేసేవాడు ఎక్కడైనా వ్యవసాయ కార్మికుడే, అలాగే అమెరికాలో అయినా అనకాపల్లిలో అయినా ఫ్యాక్టరీ పనివాడు పారిశ్రామిక కార్మికుడే. పెట్టుబడి, లాభాలు తప్ప మరొక గీటురాయి ఉండదు. సోషలిజం కూడా అలాంటిదే. భారతదేశం ఎల్లపుడూ సర్వోదయ, అంత్యోదయ సూత్రాలను అవలంబిస్తుంది.

సర్వేజనా సుఖినో భవంతు అని సోషలిస్టు భావన కంటే ముందే, దానిలో అందరికీ మంచి జరిగితే అంత్యోదయ, అత్యల్ప వర్గాలు ఎందుకున్నట్లు. బ్రిటిష్‌ వారి హయాంలో కూడా లేని ఆర్థిక అంతరాలు ఎందుకు పెరుగుతున్నట్లు. లౌకికవాదం దారి తప్పిందట, దాని వలన హిందూ ధర్మానికీ, సమాజానికీ హాని కలుగుతున్నందున దేశాన్ని పూర్తి స్థాయి హైందవ దేశంగా పునరుద్ధరించటం గురించి ఆలోచించాలట. లౌకికవాదం దారితప్పితే గాడిలో పెట్టమని అడగాల్సింది పోయి మతరాజ్యాన్ని ఏర్పాటు చేయాలనటం ఏమిటి? అది కూడా పునరుద్ధరించాలనటం హిమాలయమంత అవాస్తవాన్ని మెదళ్లలోకి ఎక్కించే యత్నం తప్ప మరొకటి కాదు. 

'భారతదేశంలోకి స్థానభ్రంశం చెందిన ముస్లిం జనాభాకు వక్ఫ్ బోర్డును ప్రసాదించారు. ప్రతిగా స్థానభ్రంశం చెందిన హిందువులకు మాత్రం రిక్తహస్తం చూపించారు. పాకిస్థాన్‌లో ప్రతిదీ వదులుకున్న హిందువులకు శూన్యమే మిగిలింది', అని అనటానికి ఆధారాలు ఏమిటన్నది ప్రశ్న. రాష్ట్రాల వారీగా దేవాదాయ, ధర్మాదాయ సంస్థలకు ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎవరైనా చెబుతున్నారా? వక్ఫ్‌బోర్డుకు భారత్‌లో దానం చేసిన ఆస్తుల నిర్వహణ బాధ్యత ఇచ్చారు తప్ప అదనంగా ఇచ్చిందేమీ లేదు. ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం దేశంలో 8.7లక్షల ఆస్తులు 9.4లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, వాటి విలువ రూ 1.2లక్షల కోట్లు. దాన్ని ఒక సంస్థగా చూసి భారతీయ రైల్వేలు, మిలిటరీ తరువాత పెద్దది అని చెబుతున్నారు. దేశంలో దేవాదాయ ధర్మాదాయ ఆస్తుల మొత్తం విలువ ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం క్రోడీకరించి చెప్పిందా? దాని దగ్గర ఉండవచ్చు గానీ ఎక్కడా బయటికి వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ 3.02లక్షల కోట్లు. మన దేశం నుంచి వెళ్లిపోయినవారి ఇక్కడి ఆస్తులను పాకిస్థాన్‌ వెళ్లినవారికి ఇవ్వలేదు కదా. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి పాక్‌ వెళ్లిన వారి ఇండ్లు, పొలాలను అనేక మంది తరువాత ఆక్రమించి అన్యాక్రాంతం చేసుకున్నారు. వారిలో ముస్లింలు, హిందువులు అందరూ ఉన్నారు. ఇప్పటికీ ఆ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇన్ని దశాబ్దాల అనంతరం కూడా భారతదేశంలో హిందువుల పరిస్థితి మెరుగుపడలేదట. ఇది ఒక మానసిక దాడి, గాలి పోగేయటం తప్ప మరొకటి కాదు. పాకిస్థాన్‌లో ముస్లింలు ఎలా బాగుపడ్డారో కూడా చెప్పాలి. ఒకవైపు 'మతరాజ్యంగా మారిన పాకిస్థాన్‌ దుస్థితి ఎలా ఉందో చూడండి, మన దేశం ఎలా ముందుకు పోయిందో చూడండి' అంటూ కాషాయదళాలు ప్రచారం చేయటం చూస్తున్నాం. మనదేశాన్ని కూడా మతరాజ్యంగా మార్చటం అంటే మరో పాకిస్థాన్‌గా మార్చాలనేనా? అసలు హిందూరాజ్యం అంటే ఏమిటో, దాని రూపురేఖలు ఎలా ఉంటాయో ఎవరైనా చెప్పగలరా?

సామాన్యులకు పట్టింపు లేదు గానీ అసలు సిసలు నిలువుబొట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకొనేవారు అడ్డబొట్ల ఆలయాల గడప తొక్కరన్న పచ్చినిజం ఎంత మందికి తెలుసు? అలాంటప్పుడు ఎవరి భావనలకు అనుగుణంగా మతరాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు? దాన్ని రెండవవారు అంగీకరిస్తారా? అలాంటి రాజ్యంలో ఇతర మతాలవారి పరిస్థితి ఎలా ఉంటుంది. హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ దురవస్థలో ఉన్నారని పదే పదే చెప్పటం గోబెల్స్‌ ప్రచారం, అందరూ అదే స్థితిలో ఉన్నారు. అన్ని మానవాభివృద్ధి సూచికల్లోను మనం ప్రపంచంలో ఎంత దిగువ స్థానాల్లో ఉన్నామో తెలిసిందే. దేశంలో హిందూ ద్వేష భావం ఉందని చెప్పటం ఒక మైండ్‌ గేమ్‌, జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. మెజారిటీ వాదం చాలా ప్రమాదకరమైనదని ప్రపంచ అనుభవం చెబుతుంది, అందువలన మార్చాల్సింది ఈ వాదాన్ని. దీన్ని ఇలాగే కొనసాగనిస్తే దేశ యువత పురోగమనంవైపు గాకుండా తిరోగమనంవైపు తిరిగితే దేశం మరింత అధోగతిలోకి దిగజారుతుంది. సామాన్య భారతీయులకు మతం ఉంది గానీ విద్వేషం లేదు. ఉంటే 2024 ఎన్నికల్లో హిందూత్వకు ప్రమాదం ముంచుకువచ్చిందని చెప్పినా 34 శాతం మంది అసలు ఓటింగ్‌కే రాలేదు. బీజేపీకి గత ఎన్నికల కంటే 0.8 శాతం తగ్గి వచ్చిన ఓట్లు 36.56 శాతం, ఇవి కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు వేయించిన ఓట్లు కూడా కలిస్తే. చివరిగా ఒక్క మాట హిందూ ద్వేష భావజాలాన్ని నిర్మూలించాలి, అందరం సంకుచితమేనా.

సర్వేజనా సుఖినో భవంతు అనే వారికి మతద్వేషం అనటానికి నోరు రాలేదు. ఒక భావజాలం అది మతవిద్వేషమైనా, మరొకటైనా నిర్మూలించటానికి అదేమైనా వస్తువు, ప్రాణి కాదే. చరిత్రలో చార్వాకులను చంపేశారు, వారి గ్రంథాలను తగులబెట్టారు తప్ప వారి భావజాలాన్ని నిర్మూలించగలిగారా. జనం ఆదరించకపోతే ఏదైనా వెనక్కు పోతుంది, ఆదరిస్తే మనదేశంలో కవలపిల్లల మాదిరి మెజారిటీ, మైనారిటీ మతవిద్వేషం రెచ్చిపోతుంది.

Post a Comment

0 Comments