అమరావతి, జూలై 06, బిసిఎం10 న్యూస్.
గత రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్రంలో పాలకులు మారినా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, దినసరి, కంటింజెంట్, టైంస్కేల్, గౌరవ వేతన ఉద్యోగుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. ఈ కాలంలో అధికారంలో ఉన్న పార్టీలు మారినా పై ఉద్యోగుల ఎడల వీరి విధానాలు ఒకటే కావడం వలన వీరు రెగ్యులర్ కాలేదు. సమాన పనికి - సమాన వేతనం, సమాన సౌకర్యాలు అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, పథకాలు, యూనివర్సిటీలు, టిటిడి వంటి థార్మిక సంస్థలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకొంటున్న ప్రభుత్వాలు, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలను చెల్లించకుండా అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే సౌకర్యాలనూ ఈ ఉద్యోగులకు అమలు చెయ్యకుండా ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే నేడు చట్టం ముందు దోషిగా నిలిచింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలను అమలు చేయడంలేదు. ఎన్నికల ముందు హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం పరిపాటిగా మారింది. గత ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కాస్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న దాదాపు లక్ష మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ఆప్కాస్‌ను రద్దు చేసి తిరిగి ప్రైవేట్ ఏజెన్సీల వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం సరైనది కాదు. ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించడంతో టిడిపి కూటమి ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి కమిటీ వేసింది.
సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ 213 ఆఫ్ 2013లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న వివిధ తాత్కాలిక క్యాడర్ల ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల కనీస బేసిక్ (మినిమం టైం స్కేల్)ను అమలు చెయ్యాలని తీర్పునిచ్చింది. కాంట్రాక్ట్ లేబర్ (ఎబాలిషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం 1970 ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చెయ్యాలి. కాని వీటన్నింటినీ ప్రభుత్వాలు అమలు చెయ్యకుండా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నది. తక్కువ వేతనాలతో పని చేయించుకుంటూ దోపిడీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, వెలుగు, 108, 104, ఆరోగ్యమిత్ర, కస్తూరిబా, తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్, ఆయుష్, ఎ.పి సాక్స్ తదితర ప్రభుత్వ పథకాల్లోని కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్‌కు, మున్సిపల్, పంచాయితీ, విద్యుత్తు, ఆర్టీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో కనీసం మినిమం టైం స్కేల్‌ను అమలు చెయ్యడం లేదు. ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి (2008) వీరందరికీ మినిమం టైం స్కేల్ అమలయ్యేది. కాని గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లోని డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే టైం స్కేల్‌ను పరిమితం చేసింది. దీనివలన ప్రభుత్వ శాఖల్లోని ఔట్‌సోర్సింగ్ మరియు పై పథకాలు, సంస్థల్లోని 2.5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర క్యాడర్ల ఉద్యోగులకు అన్యాయం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా మినిమం టైం స్కేల్‌ను పునరుద్ధరిస్తుందని ఈ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న ఔట్‌సోర్సింగ్ తదితర పై కేటగిరీల ఉద్యోగులకు గత, ప్రస్తుత పాలకులు కనీసం సంక్షేమ పథకాలనూ అమలు చేయడం లేదు. తెలుగుదేశ కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని మానిఫెస్టోలో ప్రకటించినా నేటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. అనేక సంవత్సరాలుగా పనిచేయించుకుంటున్న పై ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యడం లేదు. గత ప్రభుత్వం 2014కు ముందు నుండీ పనిచేస్తున్న 10,177 మంది ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని జీఓ లు ఇచ్చినా, వైద్య ఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమంలోని 4 వేల మంది ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేసింది. విద్యాశాఖ, పాలిటెక్నిక్ లలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఇతర శాఖల్లోని దాదాపు 6 వేల మందిని రెగ్యులర్ చెయ్యలేదు. అధికారులు ఎప్పటికప్పుడు సక్రమంగా వీరికి రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేయకుండా కొనసాగించడం తదితర కుంటి సాకులతో వీరిని రెగ్యులర్ చెయ్యలేదు. అధికారుల తప్పిదాలకు కాంట్రాక్ట్ లెక్చరర్లను బలి చెయ్యడం సమంజసం కాదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయినా వీరి రెగ్యులరైజేషన్‌లో ఒక్క అడుగూ ముందుకు వేయలేదు.
1994కు ముందు నుండీ అంటే 30 సంవత్సరాల నుండీ పనిచేస్తున్న కంటింజెంట్, పార్ట్‌టైం, దినసరి, కన్సాలిడేటెడ్ తదితర ఉద్యోగులనూ రెగ్యులర్ చెయ్యలేదు. వీరు చనిపోతున్నా, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా ఈ పాలకులు పట్టించుకోవడం లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్ తదితర పై ప్రభుత్వ పథకాలు, సంస్థల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులకు ఎంటిఎస్ అమలు చెయ్యడం లేదు. కేంద్ర గైడ్‌లైన్స్ ప్రకారం హెచ్.ఆర్ పాలసీ అమలు చెయ్యాల్సి ఉన్నా నేటికీ రెండు పథకాల్లో మినహా మిగిలిన పథకాల్లో హెచ్ఆర్ పాలసీని రూపొందించలేదు. వీరందర్నీ ఇతర రాష్ట్రాల్లో వలె రెగ్యులర్ చెయ్యాలి. ఇన్నేళ్లు వీరంతా ప్రజల కోసం పని చెయ్యడానికి అర్హులైనప్పుడు రెగ్యులరైజేషన్‌కు ఎందుకు అర్హులు కారు..?? ఉద్యోగులంతా ఐక్యమై, ఐక్య పోరాటాలు సన్నద్ధమైతేనే పై సమస్యలు పరిష్కారమవుతాయని గ్రహించాలి. అలాంటి ఐక్య పోరాటాలకు సన్నద్ధమవ్వాలి. సమస్యల పరిష్కారానికి జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలి.
0 Comments