ఖమ్మం, జూన్ 08, బిసిఎం10 న్యూస్.
బాల్యం అంటే ఆడిపాడే స్వచ్ఛమైన నవ్వుల జీవితం. పరుగులు తీసినా, గంతులు వేసినా వారిది తుళ్లిపడే వయస్సు. కళ్లల్లో మెరుపులతో ప్రకృతిలో తెలి నవ్వులు చిందించే పసితనం. మరి బాలలందరూ అలాగే ఉన్నారా..?? అంటే లేరు, నేటికీ అనేక కుటుంబాల్లో చిన్నారుల శ్రమతో బతుకులీడుస్తున్న దయనీయం. బరువైన బతుకులతో పసితనం వసివాడి నిర్దాక్షిణ్యంగా వారి జీవితాలను చిదిమేస్తోంది. బడికి పోవాల్సిన బాలలు బండెడు చాకిరీలో మగ్గిపోతున్నారు. అసమానతల సమాజంలో వీరి భవిష్యత్తు ఓ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల పైనే అనేది గణాంకాలలోకి వచ్చిన సంఖ్య. లెక్కల్లోకి రాని వారెందరో మన దేశంలోనే ప్రతి ముగ్గురిలో ఒకరున్నారు. కుటుంబంతో పాటు కొందరైతే దిక్కులేనివారిగా ఒక్కరే కష్టం చేస్తున్నారు. పిల్లలు పని కోసమే అనే దుస్థితి నేటికి వెన్నాడుతోంది. ఇది ఆధునిక సమాజం తలదించుకోవాల్సిన విషయం. అందుకే అందరం సమాయత్తమై బాల్యానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలి. ఈ నెల 12న ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినం సందర్భంగా వారి గురించే ఈ ప్రత్యేక కథనం.
● నిషేధ చట్టం.
బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం (1986లో) నోటిఫై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాల కార్మికులు ఉండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. ఈ చట్టం ప్రకారం మన ప్రభుత్వం తివాచీల తయారీ, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, పలకల తయారీ, క్వారీలు వంటి రంగాల్లో బాలల్ని నిషేధించింది. 2010లో సర్కస్‌లో, ఏనుగుల సంరక్షణలోనూ నిషేధించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి సెక్షన్ 14 ప్రకారం అపరాధ రుసుం చెల్లించాలి. జైలు శిక్షకి నిబంధనలున్నాయి, ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది. అవి ఈ చట్టం అమలు పై నివేదికలను సమర్పించాలి.
ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావటానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నారు. అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పది మంది పిల్లల్లో ఒకరు పనిచేయాల్సి వస్తోంది. 2000 నుండి దాని మొత్తం సంఖ్యలు క్షీణించాయి. తగ్గింపు వేగం గతం కన్నా మూడింట రెండొంతులు మందగించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 15.2 కోట్ల మంది పిల్లలు బాలకార్మికుల్లో నిమగమై ఉన్నారు. వీరిలో 7.2 కోట్ల మంది పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బాలకార్మికులున్న దేశం భారత్. దేశ శ్రామికశక్తిలో 3.50 కోట్ల మంది బాలలు ఉన్నారు. ప్రతి 11 మంది పిల్లల్లో ఒకరు పనిలో ఉన్నారు. ఐఎల్ఓ నివేదిక ప్రకారం ఇండియాలో 5 నుండి 14 ఏళ్ల మధ్య వయసులో 1.01 కోట్ల మంది బాలలు పనుల్లో కొనసాగుతున్నారు. అదే వయసు వారిలో సుమారు 4.27 కోట్ల మంది బడి బయట ఉన్నారు. బాలకార్మిక శ్రామికశక్తిలో 14 నుండి 17 ఏళ్ల మధ్య వయసు వారు దాదాపు 63 శాతం ఉన్నారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ లెక్కగట్టింది. వారిలో బాలికల కంటే బాలురే ఎక్కువగా ప్రమాదకర పనుల్లో కొనసాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణాల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందువల్ల చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. యునిసెఫ్ నివేదిక ప్రకారం పట్టణీకరణ ప్రాంతాల్లో 5 నుండి 4 ఏళ్ల వయసులోని బాలకార్మికుల్లో 54 శాతం పెరుగుదల కనిపించింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో బాలకార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కుటుంబం కోసం తల్లిదండ్రులు వారిని పనులకు పంపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబాల అప్పులు సైతం చిన్నారులను బాలకార్మికులుగా మార్చేస్తున్నాయి.
● పిల్లల్ని పనుల్లో నియమించటం నేరం.
ఏదైనా పనిలో పిల్లలను నియమించడం 2016లో సవరించిన బాల, కౌమారదశ కార్మిక (నిషేధం - నియంత్రణ) చట్టం-1986 ప్రకారం గుర్తించదగిన నేరం. కర్మాగారాల చట్టం 1948 ప్రకారం గనులు, పేలుడు, మండే పదార్థాల తయారీ సంస్థల్లో, ప్రమాదకర వృత్తుల జాబితాలో చేర్చిన పనుల్లో కౌమారదశలో ఉన్నవారిని నియమించకూడదు. ప్రమాదకర పరిశ్రమల్లో బాల కార్మికుల్ని చేర్చుకోవడాన్ని రాజ్యాంగంలోని 24వ అధికరణ సైతం వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా బాలకార్మికులు 60% వ్యవసాయ రంగంలో ఉన్నట్లు ఐఎల్ఓ వెల్లడించింది. 70% బాలకార్మికులు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. వ్యవసాయేతర ప్రధాన రంగాలన్నింటా బాలకార్మికులు కనిపిస్తారు. 2014 డిసెంబరులో అమెరికా కార్మికశాఖ బాలకార్మికుల ద్వారా ఉత్పతైన వస్తువుల జాబితాను విడుదల చేసింది. వాటిలో 23 రకాలు భారత్‌లో రూపొందుతున్నట్లు వెల్లడించింది.
● సమిష్టి కృషి అవసరం.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలి. ఉచిత ప్రాథమిక విద్యను అందించడం ద్వారా బడి వయసు బాలలెవరూ విద్యకు, విజ్ఞానార్జనకు దూరం కాకుండా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అనాథలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు జీవనోపాధి కోసం వారు బాల్యంలోనే పనులు చేయకుండా వారికి చేయూత అందించాలి. బాలకార్మిక వ్యవస్థ కొనసాగడంలో సమాజమే కీలకంగా నిలుస్తోంది. పిల్లల జీవితాలను, సామాజిక పరిస్థితులను బాల కార్మిక వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తుందో తెలియకపోవడం వల్లనే అది ఇంకా ఉనికిని చాటుకుంటోంది. తక్కువ వేతనంతో ఎక్కువ సమయం పనిచేయించుకోవచ్చనే ఉద్దేశంతో యజమానులు పిల్లలను పనుల్లో నియమించుకుంటున్నారు. బాలకార్మికుల నిషేధ చట్టాల గురించి యజమానులకు తెలియజెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉంది. ప్రభుత్వ విధులకు ప్రజల మద్దతు తోడైతే బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం పెద్ద కష్టం కాదు. బాలలే రేపటి దేశ భవిష్యత్తు అనే వాస్తవాన్ని సమాజానికి వివరించి దేశ సౌభాగ్యానికి పిల్లల చదువు, వారి సరైన ఎదుగుదల అత్యంత కీలకమని అర్థమయ్యేలా చేయాలి.
● కొరవడుతున్న పురోగతి.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు 1979లో గురుపాదస్వామి కమిటీని కేంద్రం నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1986లో బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం తెచ్చారు. ప్రమాదకర వృత్తుల్లో పనిచేస్తున్నవారి పునరావాసంపై దృష్టి సారించేందుకు 1987లో జాతీయ విధానాన్ని రూపొందించారు. 1988 నుంచి కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వశాఖ బాలకార్మికుల పునరావాసానికి పెద్ద సంఖ్యలో పథకాలను అమలు చేసింది. పలు స్వచ్ఛంద సంస్థలు బాలల విద్య, ఇతర వసతుల కల్పనకు కృషి చేసినా ఫలితం దక్కలేదు. బాలకార్మికుల సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా పేదరికం, నిరక్షరాస్యత వంటి కారణాల వల్ల పురోగతి కొరవడుతోంది.
● బడికి దూరం.
పేదరికం, ప్రభుత్వ అరకొర విద్యా సదుపాయాలు బాలకార్మిక వ్యవస్థ కొనసాగడానికి కారణాలని బిబిసి నివేదిక నిర్ధారించింది. బాలురతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో బాలికలు చదువుకు దూరమై, ఇంటిపనుల్లో నిమగ్నమవుతున్నారని యునిసెఫ్ గుర్తించింది. పాఠశాల అందుబాటులో ఉన్నా విద్యావ్యయం భరించలేక, బడుల్లో ఎదురయ్యే వేధింపులు, లింగ వివక్ష వంటి కారణాలతో ఎక్కువ మంది బాలికలు చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. పిల్లల సంపాదన కుటుంబ మనుగడకు కీలకమని తల్లిదండ్రులు భావించడమూ పిల్లలు బడికి దూరం కావడానికి ఒక కారణం. కొన్ని కుటుంబాల మొత్తం ఆదాయంలో 25 నుంచి 40 శాతం దాకా పిల్లల ద్వారానే సమకూరుతున్నట్లు ఒక అంచనా. సామాజిక భద్రత అనేది మానవహక్కు, సంక్షోభ సమయాల్లో కుటుంబాలు బాల కార్మికులను ఆశ్రయించకుండా నిరోధించడానికి శక్తిమంతమైన విధాన సాధనం.
● చరిత్ర.
ఐఎల్ఓ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ వర్క్‌ను నియంత్రించే యుఎన్ బాడీ, 2002లో బాల కార్మికుల వ్యతిరేక దినాన్ని స్థాపించింది. ఇది 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలామంది పిల్లలకు సరైన విద్య, తగిన వైద్య సేవలు, ఖాళీ సమయం లేదా ప్రాథమిక స్వేచ్ఛను అందించడం ద్వారా వారికి సాధారణ బాల్యానికి హామీ ఇస్తుంది.
● ప్రాముఖ్యత.
బాల కార్మికుల అంతర్జాతీయ సమస్య పై అవగాహన తీసుకురావడానికి, దాన్ని తొలగించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినంగా నిర్ణయించారు. బాల కార్మికులుగా నెట్టబడిన పిల్లలు ప్రపంచమంతటా అనుభవించే ప్రతికూల మానసిక, శారీరక ఆందోళనల గురించి జ్ఞానాన్ని పెంచడానికి ఈ రోజును నిర్వహిస్తారు. బాల కార్మికులకు దోహదపడే కారణాలను పరిష్కరించడానికి వ్యక్తులు సమర్థవంతమైన సాధనాలను రూపొందించడానికి కూడా ఈ రోజు ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది.
● లక్ష్యాలు.
అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచితవిద్యను అందజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గుర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం. బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే. వారు చదువుకోవాల్సిన వయస్సులో పనిచేస్తున్నారు. వ్యవసాయంలోనూ, ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రులకు ఆర్థిక సాయాన్ని అందించేవారు, పేదరిక నిర్మూలన ప్రధానం.
● వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా.
ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం 26వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ సమాజం 2025 నాటికి అన్నిరకాల బాల కార్మికుల నిర్మూలనకు కట్టుబడి ఉంది. జాతీయ ప్రాజెక్టు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో ముఖ్యమైన పథకం జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు. దీన్ని భారత ప్రభుత్వం 1988లో మొదటగా బాల కార్మికులు అధికంగా ఉన్న 12 జిల్లాల్లో ప్రారంభించింది. 11వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును 259 జిల్లాల్లో అమలుచేశారు. ప్రస్తుతం ఇది 266 జిల్లాల్లో అమలవుతోంది. ఈ ప్రాజెక్టు ప్రధానోద్దేశం పని నుంచి విముక్తి కల్పించిన పిల్లలకు పునరావాసాన్ని అందించడం. అలాంటి పిల్లల్ని ప్రత్యేక పాఠశాలల్లో చేరుస్తారు.

0 Comments