Breaking News

Loading..

ఔట్ 'సోర్సింగ్' లే అవినీతి సోర్సులు..!!


● అధికారులకు భజన - అవినీతి అర్జన.
● ప్రధానశాఖల అధికారులకు వసూల్ రాజాలుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.

ఖమ్మం, మే 27, బిసిఎం10 న్యూస్.

'ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు'. ప్రజలు కట్టిన పన్నులతో ప్రభుత్వాలు నడుపుతూ, ఉద్యోగులకు వాటినే జీతాలుగా ఇస్తారని అందరికీ తెలిసిన విష్యం. ప్రజా సేవకులుగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు ఇచ్చిన జీతంతో పని చేస్తూ ఏదైనశాఖలో ఎవరైనా వ్యక్తులు తమ సమస్యతో ఆ శాఖ అధికారులను, ఇతర ఉద్యోగులను సంప్రదించినప్పుడు సేవకులుగా ఉండాల్సిన ఉద్యోగులు ప్రజల మీద పెత్తనం చేస్తూ ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా కూడా పని చేస్తే ఎంత ఇస్తారు, ఏమిస్తారు అంటూ బేరసారాలడుతూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధానశాఖలలో నెలకొని ఉంది. ఆయా శాఖల ప్రధానాధికారులు అవినీతికి అలవాటు పడి డైరెక్టుగా తాము ప్రజల నుండి డబ్బులు దండుకుంటే, అప్రతిష్ట పాలవుతామని తమ కింద పనిచేసే పర్మనెంట్ కానీ ఉద్యోగులైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వసూల్ రాజాలుగా, గుత్తేదారులుగా పెట్టుకొని అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారనే చర్చ   హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ తమ అవినీతితో ఎసిబికి పట్టుపడితే పోయేదేముంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగే కదా మళ్లీ ఏదో ఒక శాఖలో తిరిగి ఉద్యోగం ఇప్పించవచ్చనే ధీమా ఆయా శాఖల ప్రధాన అధికారుల్లో, మళ్లీ ఎలాగైనా ఉద్యోగం సంపాదిస్తామని ధీమా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కనిపిస్తుండటం శోచనీయం. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారికి ఇంత, వసూల్ రాజాగా అధికారి ఆజ్ఞల ప్రకారం నడిచి అవినీతి సొమ్మును తెచ్చి ఇచ్చే ఔట్సోర్సింగ్ ఉద్యోగి కి కొంత ముట్టుతుందనేది వాస్తవమే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

● సరైన అర్హత లేకుండా ఔట్సోర్సింగ్ ఏజెన్సీ లో పలుకుబడి ఉంటే చాలు ఉద్యోగం వచ్చినట్టే.

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకం అయిన ఉద్యోగులకు తప్పకుండా వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు సరిపడా లేకున్నప్పటికీ కమిషన్లకు అలవాటు పడ్డ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో సిబ్బందిని మంచివాడా, చెడ్డవాడా, ఉద్యోగ నిర్వహణ చేయగలడా లేదా అని చూడకుండానే తమకు కమిషన్ వస్తే చాలు అన్న రీతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేస్తారనే అపవాదు లేకపోలేదు. అలా ఎంపికైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని ప్రధానశాఖల్లో శాఖ అధికారుల వద్ద భజన చేస్తూ ఆయా శాఖల వారీగా పనుల కోసం వచ్చిన అమాయక ప్రజలను తమవాక్చాతుర్యంతో బుట్టలో వేసుకోవడం, 'పలానా అధికారికి నేను ఎంత చెప్తే అంత అంటూ నీ పని నిమిషాల్లో చేపించేస్తా' నా వాటా నాదే మా సార్ వాటా సారుదే అంటూ టేబుల్ కింద చేయి పెట్టి టేబుల్ పైన ఫైల్ పెట్టి మరీ పని చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికారితో పని చేపిస్తా, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ కార్యాలయాలకు వచ్చే ప్రజలను మాయ మాటలతో జాదూగాళ్లలాగా వలలో పడేసి పై సంపాదన ఎంత అవినీతి మార్గంలో సంపాదిస్తే తమ అధికారి దగ్గర అంత మంచి పేరు, పలుకుబడి ఉంటుందనే ఉద్దేశంతో బేర సారాలలో రాటుదేలి ఆయా శాఖలలో డబ్బులు ఇవ్వనిదే పని అయ్యేలాగా లేదంటూ సూత్రధారులుగా, పాత్రధారులుగా ఔట్ట్సోర్సింగ్ ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.

● ఔట్సోర్సింగ్ ఉద్యోగులకే అవినీతి అధికారుల అండ.

ఆయా శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తుమ్మితే ఊడిపోయే ముక్కులైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులే అసలైన  పర్మనెంట్ ఉద్యోగులను కాదని తడాఖా చూపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం అంతకన్నా కాదు అన్న చర్చలు జరుగుతున్నాయి. అధికారులు కూడా పర్మనెంట్ ఉద్యోగులు అయితే అవినీతి సొమ్ములో బేరసారాలు అడిగి మరి వాటాలు ఎక్కువగా తీసుకుంటున్నారని, తాత్కాలిక ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఇచ్చినంత తీసుకొని చెప్పినట్లు వింటారనే ఉద్దేశంతో ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగులనే అవినీతి అధికారులు ప్రోత్సహిస్తున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే కార్యాలయపు పని వేళలోనే కాకుండా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు  24/7 అధికారుల సేవలోనే మునిగి తేలుతుంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పర్మినెంట్ ఉద్యోగుల కంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అవినీతి సంపాదనే ఎక్కువ ఉందనే వాదనలు లేకపోలేదు. ఆయా శాఖల అధికారులు మనవారైతే సరిపాయే అధికారిని కాకాబట్టి అందిన కాడికి దోచిపెట్టె ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనుల కోసం వచ్చే ప్రజలను మాటలతో ఆకట్టుకుని అవినీతి సంపాదనకు అలవాటు పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పర్మనెంట్ ఉద్యోగుల ద్వారా అవినీతి బేరసారాలు నడిపితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారనే భయం కూడా ఆయా శాఖల ప్రధాని అధికారుల్లో నెలకొన్నట్లు సమాచారం.

● అన్ని ప్రధాన శాఖల్లోనూ ఔట్సోర్సింగ్ అవినీతి.

అవినీతి సంపాదనకు అర్హత కాదనే శాఖనే లేదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన శాఖలైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు, డిఆర్డిఏ, సిపిఓ, ఎస్ టి ఓ, డి టి ఓ, రెవెన్యూ, మున్సిపల్, కార్మిక శాఖలలో అవినీతి అధికారులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్రమ సంపాదన విషయంలో ఊతమిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయంలో స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బెస్ట్ ఆఫీసర్ లుగా జిల్లా ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఎన్నో శాఖలలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేస్తున్న జిల్లా కలెక్టర్ లు ప్రధాన శాఖలలో అవినీతి అధికారులకు వసూల్ రాజాలుగా మారిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కూడా తగు విచారణ జరిపించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ లు తక్షణ చర్యలు తీసుకొని అవినీతి రక్కసి భరతంబట్టి కూకటివేళ్లతో పెకలించి అంతమొందిస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

Post a Comment

0 Comments