● దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ఉగ్రవాదుల లక్ష్యం.
న్యూఢిల్లీ, మే 07, బిసిఎం10 న్యూస్.
ఉగ్రవాదులకు శిక్షణ ఇతర ప్రాథమిక సౌకర్యాలు అందించే పాక్ భూభాగంలోని తొమ్మిది కేంద్రాల పై భారత్ బుధవారం వేకువజామున క్షిపణులతో దాడి చేసింది. బుధవారం ఉదయం భారత్ సైన్యం ప్రయోగించిన క్షిపణి దాడుల్లో శిథిలమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోని ఓ భవనాన్ని పాక్ సైన్యం పరిశీలించింది. పహల్గాం ఘాతుకం తర్వాత రెండు వారాలకు భారత ప్రభుత్వం సైనిక చర్యలకు దిగింది. పహల్గాం దాడుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయారు. బుధవారం జరిగిన భారత క్షిపణి దాడుల్లో లష్కర్ ఏ తయిబా, జైషే ముహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలతో పాటు పహల్గాంతో సహా తాజాగా భారత్ గడ్డ మీద జరిగిన వివిధ ఉగ్ర దాడుల మూలాలున్న పాక్ ఆక్రమిత ప్రాంతాలు, పాక్ భూభాగాలబ్పై కూడా భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన పరిణామాలు ఇంకా చోటు చేసుకునేలా ఉన్నాయి. కాబట్టి తాజా వివరాల కోసం కాస్త సమయం పడుతుంది. అయితే, బుధవారం వేకువజామున జరిగిన భారత క్షిపణి దాడుల గురించి మీడియాకు వివరించేందుకు కేంద్రం ఇద్దరు సైనికాధికారులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో 'ఆపరేషన్ సిందూర్' పై త్రివిధ దళాధిపతులతో కలిసి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విలేకరులనుద్దేశించి కల్నల్ సోఫియా ఖురేషి హిందీలో మాట్లాడితే వ్యోమిక సింగ్ ఇంగ్లీషులో మాట్లాడారు. ఈ సైనిక చర్యల నిర్దిష్ట ప్రణాళికతో, నిర్ధిష్ట నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎంపిక చేసిన ఉగ్ర శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సాగాయని చెప్పారు. ఈ దాడుల్లో పాక్ పౌరులు గాయపడలేదని, పాక్ ప్రభుత్వం నుంచి కూడా అటువంటి స్పందన రాలేదని చెప్పారు.
● న్యాయం జరిగేంత వరకు.
ఢిల్లీలో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్‌లో పాకిస్థాన్ పై చేసిన మిస్సైల్ దాడుల గురించి సోఫియా ఖురేషి వివరించారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిని పెంచేందుకు వీలులేదని తెలిపారు. పహల్గాం కుట్రదారులను ఆధారాలతో సహా కనుగొన్నామని, అదేవిధంగా వారికి ఆర్థికంగా సాయం చేస్తున్న వారిని కూడా గుర్తించామని చెప్పారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షిస్తామని అన్నారు. పహల్గాం మృతులకు న్యాయం జరిగేంత వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని పాక్‌లోని సవాయి నాలా నుంచి బహాల్‌పూర్ వరకు వైమానిక దాడులు చేశామని సోషియా ఖురేషి తెలియజేశారు. అక్కడున్న పౌర స్థావరాలకు ఎలాంటి నష్టం కలుగకుండా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
● వ్యోమికా ఏమన్నారంటే.
ఇదే విషయం పై ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని తెలియజేశారు. ఎల్‌వోసీ(ఎల్‌ఓసీ) నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని కోట్లీ, బర్నాల పై దాడి చేశామని చెప్పారు. సియాల్‌కోటల్‌లోని సర్జల్, మొహమూనా జాయా సియాల్‌కోట్ పై మిస్సైల్స్ ప్రయోగించామని తెలిపారు. అంతేకాకుండా కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను సమర్థవంతంగా ఛేదించామని తెలిపారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడి చేశామని, పాక్ సైనిక స్థావరాలను భారతదేశం లక్ష్యంగా చేసుకోలేదని చెప్పుకొచ్చారు. పాక్ చేసే ఎటువంటి చర్యలను ఎదుర్కొనేందుకైనా భారత దళాలు సిద్ధంగా ఉన్నయాని వ్యోమికా తెలియజేశారు. అయితే వైమానిక దాడులలో దాదాపు 90 మంది ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తోంది.
అయితే పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిక్షణ కేంద్రాలుగా ఉన్న తొమ్మిది ప్రదేశాలను క్షిపణి దాడులకు లక్ష్యంగా ఎంచుకున్నామని సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ తెలిపారు. ఈ మధ్య భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఈ తొమ్మిది కేంద్రాలలో శిక్షణ పొందిన వారేనని భారత నిఘా వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నదని, ఆ మేరకు ఈ కేంద్రాలను దాడులకు లక్ష్యంగా ఎంచుకున్నట్టుగా తెలిపారు. భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల అవతల పాక్ భూభాగం వైపు ఉన్న సవాయి నాలా క్యాంప్ ఇందులో ఒకటి. ఈ కేంద్రం నుండి లష్కర్ ఏ తయ్యబా, జైషే ముహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఇది అడ్డాగా ఉంది. దీంతో పాటు మర్కజ్ తాయ్బా, మురిడ్కె కూడా ఇక్కడి సర్జల సియోల్ కోట్ కేంద్రాలు వాస్తవాధీన రేఖకి ముప్పై కిలోమీటర్ల అవతల ఉన్నాయి. భారత క్షిపణి దాడుల లక్ష్యంగా ఉన్న మరో కేంద్రం మర్కజ శుభానల్లా ట్రైనింగ్ సెంటర్ ఉన్న భావల్పూర్ కూడా ఉంది. భావల్పూర్ జైషే ముహమ్మద్ సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంది. పహల్గాం దాడిలో భాగంగా చనిపోయిన వారిని వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేయటంతో పాటు జమ్మూ కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం, రాష్ట్రంలో మత పరమైన ఘర్షణకు దారితీయడం కూడా ఉగ్రవాదుల లక్ష్యంగా ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. సెలవుల్లో ఉన్న పారా మిలటరీ సిబ్బంది మొత్తాన్ని విధులకు హాజరు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంబంధింత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ తొందరపడి ఆయుధ ప్రయోగానికి సిద్ధం కారాదని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. పొరుగు దేశంతో ఎవరూ యుద్ధం కోరుకోరని అదే సమయంలో వ్యూహాత్మక లక్ష్యాల కోసం సాధారణ ప్రజలను బలి చేసేందుకు ఏ ప్రభుత్వమూ సిద్ధం కాకూడదని ఆయన అన్నారు.
● సోఫియా ఖురేషి - వ్యోమికా సింగ్ గురించి.
కల్నల్ సోఫియా ఖురేషి భారత ఆర్మీలో చాలా కాలంగా ధైర్యానికి, పురోగతికి మారుపేరుగా ఉన్నారు. పూణేలో జరిగిన సైనిక విన్యాసం- ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18 లో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. అయితే, వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచి భారత వైమానిక దళంలో చేరాలని అనుకునేవారు. ఆమె భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్. భారత వైమానిక దళం పైలట్‌గా ప్రమాదకర విమానాలు నడిపిన అనుభవం ఆమెకు చాలా ఉంది. ఇప్పటి వరకు ఆమె రెండున్న వేలకు పైగా గంటల విమాన అనుభవం సంపాదించారు. ఈశాన్య భారత రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ వంటి సున్నిత, కష్టతరమైన ప్రాంతాల చీతా, చేతక్ వంటి హెలికాప్టర్లను వ్యోమికా సింగ్ నడిపారు. గతంలో ఆమె అనేక రెస్క్యూ మిషన్లను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. 2020 నవంబర్‌లో వ్యోమికా అరుణాచల్ ప్రదేశ్‌లో చాలా కష్టమైన మిషన్‌కు నాయకత్వం వహించి ప్రజల ప్రాణాలను కాపాడారు.

0 Comments