● నిన్న తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహ ఆవేదన నేపథ్యంలో.
ఖమ్మం, మార్చి 16, బిసిఎం10 న్యూస్.
'ఎవరు జర్నలిస్టులు..?? ఎవరు నకిలీ..?? జర్నలిస్ట్ సంఘాలను లిస్ట్ అడగండి అధ్యక్షా. ఆ లిస్ట్ లో లేని వాళ్ళు క్రిమినల్స్. ముసుగులేసుకుని వాళ్ళు రాసే రాతలను చూసి విశ్లేషిద్దాం. బొడ్కల్ తీసి బట్టలు ఉడదీసి ఉరికించి కొడతాం. కుర్చీలో ఉన్నా, ఏం చేయలేడని అనుకోవద్దు. నేను ముఖ్యమంత్రిని, అధ్యక్షా మీరు అనుమతిస్తే ఒక రోజు జర్నలిస్ట్ లపై చర్చ చేద్దాం, చట్టం తీసుకొద్దాం. పరిధి దాటితే తడాఖా చూపిద్దాం, మీరు మనుషులేనా..?? మా ఇంట్లో ఆడబిడ్డలను తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?? తోలు తీస్తాం'. ఇదీ నిన్న తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం, తీవ్ర ఆవేదన.
నిజ్జంగా ఇప్పుడు అసలు పాయింట్ కు వచ్చారు అధ్యక్షా. అసలు ఎవరు జర్నలిస్టులు..?? ఎలా గుర్తిస్తారు..?? ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్న వాళ్లే జర్నలిస్టులా..?? అలా అయితే అందులో నిజంగా పని చేస్తున్న జర్నలిస్టులు సగం మంది కూడా ఉండరు. ప్రభుత్వమే ఎడా పెడా ఎవరికంటే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేసింది. నిజంగా పని చేస్తున్న వాళ్లలో సగానికి పైగా గుర్తింపు కార్డులు ఉండవు. ఎలా గుర్తిస్తారు అధ్యక్షా, ఎలా ఉరికించి కొడతారు..??
● జర్నలిస్టులు పలు రకాలు అధ్యక్షా..!!
వెటరన్ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టులు, ప్రింట్ మీడియా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు, స్ట్రీంగర్లు, కంట్రిబ్యూటర్లు. వీళ్ళు కాకుండా సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇంచార్జులు, న్యూస్ ఎడిటర్లు, కార్టునిస్టులు ఇంకా బోలెడు. అఖరకు ప్రూఫ్ రీడర్లు కూడా. ఇక ప్రింటింగ్ మెషిన్ వర్కర్స్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్ వరకు ప్రెస్ అని రాసుకుంటారు. వీళ్లందరిలో జర్నలిస్టులు ఎవరు అధ్యక్షా, ఎలా గుర్తిస్తారు అధ్యక్షా.
సరే వాళ్లంతా జెన్యూన్ అనుకుందాం కాసేపు, ఇక ట్యూబ్ పేరిట లక్షల మంది జర్నలిస్టులు పుట్టుకొచ్చారు అధ్యక్షా. రెండేళ్లు ఎక్కడో ఏదో ఛానెల్ లో పని చేసి బయటకొచ్చి సొంత యుట్యూబ్ పెట్టేసుకుంటారు. అనుభవం లేకున్నా, ఫోన్ ఉంటే చాలు జర్నలిస్ట్ అయిపోతున్నారు. వీళ్లందరిని ఏం చేయాలి..?? ఎవరు గుర్తిస్తారు..?? ఇక ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయ నాయకులే స్వయంగా తయారు చేసిన జర్నలిస్టులు ఉన్నారు. పెయిడ్ జర్నలిస్టులు అంటారు. రేటు కట్టి మరీ రాస్తారు, వసూలు చేసి ఆహా ఓహో అంటూ రన్నింగ్ కామెంట్రీ ఇస్తారు. వీళ్ళు కూడా జర్నలిస్టులే అధ్యక్షా, ఎవరి గొట్టం వారిదే. అవసరం వచ్చినప్పుడు వాళ్ళను వాడుకునేది రాజకీయ నాయకులే. ఇక ఏ పార్టీకి ఆ గొడుగు పట్టే జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళను పోషించేది కూడా రాజకీయ నాయకులే. వాళ్ళను ఏ కేటగిరిలో వేస్తారు అధ్యక్షా. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు పట్టుకుని దందాలు, బ్లాక్ మెయిల్ చేసే కేటు జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు బిల్డింగ్ కడుతున్నారో చూసి బెదిరించడం, ఏదో రాసేస్తాం, స్టోరీ ప్లే చేస్తాం, ఆ అనుమతులు లేవు అంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసే జర్నలిస్టులు ఉన్నారు అధ్యక్షా. అంతే కాదు, వీళ్ళను మించి మరో కిలాడీ దందా, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదొక రియల్ ఎస్టేట్ కంపెనీ పై అవాకులు చెవాకులు రాసేసి, చివర్లో మిగతా భాగం రేపు అని రాసి బెదిరించి భయపెట్టి వసూలు చేసే జర్నలిస్టులు ఉన్నారు. వీళ్ళను ఏ కేటగిరిలో గుర్తిద్దాం అధ్యక్షా.
● ఇక సోషల్ మీడియా జర్నలిస్టులు.
ప్రతి పార్టీకి ఒకటి కాదు పది కాదు వందల్లో జర్నలిస్టులు పని చేస్తున్నారు. ప్రతి రోజు ఎదుటి పార్టీని ఏదొక విధంగా విమర్శించడమే ఈ జర్నలిస్టుల పని. వీళ్ళను ఏ కేటగిరిలో వేయాలి అధ్యక్షా. ఏదొక పేరు పెట్టుకుని స్టార్ హోటల్స్ లో జరిగే ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యే బ్యాచ్ కూడా ఉంది. ఆడిటోరియాల్లో జరిగే ప్రదర్శనల దగ్గర కూడా భయపెట్టి పెద్ద పెద్ద పత్రికల పేర్లు చెప్పి అడుక్కునే నకిలీ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంటాయి అధ్యక్షా అదే విచిత్రం. ఇలా అందరినీ పెంచి పెద్ద చేసింది రాజకీయ పార్టీలే అధ్యక్షా. ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడిపోతున్నారు. వందల మంది వస్తున్నారు, తాంబూళం ఇవ్వనిదే వెళ్ళరు. జీతాలు ఇవ్వకుండా కేవలం లోగో గొట్టాలు, ఐడి కార్డులు ఇచ్చి తరుముతున్న మీడియా యాజమాన్యాలది తప్పు. వాళ్ళను పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు, రాజకీయ ప్రతినిధులది తప్పు. మధ్యలో మీడియా సంఘాలు ఏం చేస్తాయి అధ్యక్షా. వారి మాట ఎవరు వింటున్నారు..?? ఏ యాజమాన్యం వాళ్ళను గుర్తించింది..??
● అసలు పాయింట్ కు వచ్చారు అధ్యక్షా, ప్రక్షాళన చేయండి..!!
అసలు ఎవరో, నకిలీ ఎవరో, పెయిడ్ ఎవరో, రాసే వాళ్ళు ఎవరో, రాయని భాస్కరులు ఎవరో, గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళు జర్నలిస్టులు అవునో కాదో, గుర్తింపు కార్డుల వ్యాపారం ఎవరు చేస్తున్నారో, అసెంబ్లీ లో కావచ్చు, సచివాలయంలో కావచ్చు. గుర్తింపు కార్డులు పొంది తిరుగుతూ పైరవీలు చేసుకుంటున్న జర్నలిస్టులు ఎవరో, అసలైన జర్నలిస్టులు ఎవరో లెక్కలు తీయండి అధ్యక్షా, ప్రక్షాళన చేయండి. నిజమైన జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఈ న్యాయం కోసమే ఎదురు చూసి అలసిపోయారు, ప్రక్షాళన చేయండి అధ్యక్షా.

0 Comments